Balineni Srinivasa Reddy: తాను నోరు తెరిస్తే.. వైసీపీ నేతలు తట్టుకోలేరంటున్నారు జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అదానీ గ్రూప్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ముడుపులు అందాయన్న వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేసి వైసీపీకి షాకిచ్చిన బాలినేని.. తనను గెలికితే మరిన్ని నిజాలు చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆ కీలక నేత విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి వెల్లడించిన అంశాలు ఇప్పటికే కలకలం రేపుతున్నాయి. అలాంటి బాలినేని జోలికి వెళ్లి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనాలోచితంగా జగన్‌ని ఇక్కట్ల పాలు చేస్తున్నారా?.. బాలినేని నోరు విప్పితే జగన్ గుట్లన్నీ రట్టు అవుతాయా?
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల ఫైల్ పై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి పేర్కొన్నారు. అయితే, చంద్రబాబు, పవన్ ల మెప్పు కోసం, పదవుల కోసం బాలినేని తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని చెవిరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. పదవి కోసమే జగన్ పై అభాండాలు వేస్తున్నారని, బహిరంగ చర్చకు సిద్ధమా అని బాలినేనికి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి వ్యాఖ్యలపై బాలినేని శ్రీనివాసరెడ్డి రియక్ట్ అయి అదానీ వ్యవహారంలో అసలేం జరిగిందో బయటపెట్టి కలకలం రేపారు.
అదానీ సంస్థ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్ ఎప్పుడూ తనతో చర్చించలేదని.. అదానీతో ఒప్పందానికి ముందు పదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం టెండర్లు పిలిచారని బాలినేని వెల్లడించారు. అదానీ వచ్చి జగన్ ను కలిశాక ఆ టెండర్లను రద్దు చేశారన్న బాలినేని.. ఎఫ్‌బీఐ రిపోర్టులో పేర్కొన్న ఫారిన్ అఫిసియల్ ఎవరో తెలియాలంటూ పరోక్షంగా జగన్‌ని టార్గెట్ చేశారు. రిపోర్టులో పేర్కొన్న హైలీ ర్యాంకింగ్ ఫారిన్ అఫిషియల్ వ్యక్తి.. తాను కాదని స్పష్టం చేశారు. అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిందన్నారు.
అదానీ విద్యుత్ కుంభకోణంలో తనకు సంబంధం ఉందని తేలితే.. కుటుంబంతో సహా ఉరేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అర్థరాత్రి ఫోన్ చేసి ఒప్పందంపై సంతకం పెట్టమంటే.. అందుకు నిరాకరించి మరుసటి రోజు కేబినేట్ కు ఆ ఫైల్ పంపినట్టు స్పష్టం చేశారు. తనతో అదానీ ఎప్పుడూ భేటీ అవ్వలేదని.. కనీసం సెకీ అధికారులు కూడా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. 1750 కోట్ల రూపాయలు లంచాలు ఎవరు తీసుకున్నారనే దానిపై కచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Also Read: జనసేన 1, టీడీపీ 2.. రాజ్యసభకి వెళ్లేది వీళ్లే..?
చెవిరెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గట్టిగా మాట్లాడితే వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెవిరెడ్డికి బాలినేని సవాల్ విసిరారు. రోజు జగన్ కాళ్ళ మీద పడి భజన చేయలేదు కాబట్టే ఈ రోజు వేరే పార్టీకి రావాల్సి వచ్చిందని బాలినేని పేర్కొన్నారు. చంద్రబాబును చెవిరెడ్డి తిడతారు కాబట్టి టికెట్ ఇచ్చారని, చెవిరెడ్డి లాగా ఎవరి మెప్పు కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని, విద్యుత్ ఒప్పందం గురించి చెవిరెడ్డికి ఏం తెలుసని బాలినేని ఫైర్ అయ్యారు.
వైఎస్సార్ పై అభిమానంతో ఎమ్మెల్యే పదవిని వదులుకొని వైసీపీలోకి వెళ్లానని, రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరే కాదని విజయమ్మ, షర్మిల కూడా అని బాలినేని అంటున్నారు. షర్మిల, విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే వారు తన కుటుంబసభ్యులు కాన్నట్లు జగన్ పట్టించుకోలేదని బాలినేని విమర్శించారు. తిట్టిన వాళ్లకి టికెట్లు ఇస్తామన్న సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో అందరికీ తెలుసని జగన్‌ను టార్గెట్ చేశారు.
తాను ఎవరినీ విమర్శించని చెప్పానని, కానీ, తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే తాను కూడా వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని బాలినేని హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యుత్ ఒప్పందం అంశంలో తనకే సంబంధం లేదంటున్న ఆయన ఆ వ్యవహారంలో జగన్‌ను పరోక్షంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జగన్‌కు బంధువైన ఆయన వైసీపీలో ఇమడలేకే బయటకొచ్చారు. అలాంటాయన ఇప్పుడు తాను నోరు తెరిస్తే.. వైసీపీ నేతలు తట్టుకోలేరంటున్నారు. తనను గెలికితే నిజాలు చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ఓపెన్ అయితే వైసీపీలో ఎవరి గుట్టు రట్టు అవుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది.