AP Politics: ఆ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ని కలవటం ప్రకాశం జిల్లా నేతలను పెద్ద షాక్‌కు గురిచేసింది. ఒకవైపు కూటమిలోని తన ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్న బాలినేని.. జ కలవడంతో ఆ జనసేన అధ్యక్షుడితో ప్రత్యేకంగా భేటీ అవ్వడంతో జిల్లా జనసైనికలు, తెలుగు తమ్ముళ్లలో కలవరం మొదలైందట. అసలు ఆ మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడుకున్నారు? జనసేనానితో భేటీపై బాలినేని రియాక్షన్ ఏంటి?
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడం వెనక ఉన్న ఆంతర్యం ఎంటనే దానిపై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది … కూటమి పార్టీలో ఉంటూనే టీడీపీతో పాటు జిల్లా జనసేన నేతలపై విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నిస్తూనే ఉంటానంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసి పలు విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. ఆ మరుసటిరోజే పవన్ కళ్యాణ్ తమ నాయకుడే కాదు, తమ విశ్వాసం, నమ్మకం అంటూ ట్వీట్ చేయడం రాష్ట్రవ్యాప్త చర్చకు దారి తీస్తోంది. వైసీపీ నుంచి తన వెంట వచ్చిన 20 మంది ఒంగోలు కార్పొరేటర్లను ప్రత్యేకంగా సన్మానించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, తాను ప్రశ్నించే పార్టీలో ఉన్నానని, ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన మరుసటి రోజు అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం ..జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువుగా రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని గత ఎన్నికల్లో పరాజయం తర్వాత జగన్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. తనతో పాటు ఒంగోలులో పలువురు వైసీపీ నేతలను జనసేనలో చేర్పించారు. జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు.
జనసేనలో బాలినేని ఎంట్రీని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జిల్లా జనసేన నేతలు అడ్డుకున్నప్పటికీ మెగా ఫ్యామిలీతో తనకున్న పరిచయాల నేపథ్యంలో పార్టీలో చేరగలిగారు… కూటమి పార్టీలో భాగస్వామ్యం అయినప్పటికీ బాలినేని ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఆ క్రమంలో సొంత పార్టీ నేతలు కడా బాలినేనికి సపోర్ట్ చేయకపోగా, తిరిగి విమర్శలు చేస్తూ ఉండటం అయనకు మింగుడుపడటం లేదంట. అయినప్పటికీ అన్నీ ఓర్చుకొని పార్టీలో కొనసాగుతున్నానంటూ తన వర్గం దగ్గర చెప్పుకుంటున్న బాలినేని జనసేన బలోపేతానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ వద్ద తన ఇబ్బందులతో పాటు, తనకు జరుగుతున్నఅవమానాలను కూడా ప్రస్తావిస్తూ, తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చూసుకునే పనిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు. అదే సమయంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్లపై విమర్శల విషయంలో ఎక్కడా తగ్గకపోవటం కూడా పలు వివాదాలకు దారితీస్తోంది. ఒక కూటమిలో కొనసాగుతున్నప్పటికీ, ప్రశ్నించే విషయంలో తగ్గనన్నట్లు.. పార్టీకి సంబంధం లేదు, తమ వ్యక్తిగతం అంటూ.. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోవడం రెండు పార్టీల అధిష్టానాలకి కూడా తలనొప్పిగా మారిపోయిందట.
దీంతో తాజా, మాజీలలో ఎవరికి నచ్చ చెప్పాలో తెలియక ఇరుకున పడిపోతున్నారంట రెండు పార్టీల అధిష్టాన నేతలు… ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో ఆగకుండా, అవినీతి విమర్శల వరకు వెళ్ళటంతో అది వైసీపీకి ఆయుధంగా మారుతోంది. అలా ఒకే గూటి కింద ఉండి ఇరువురు పదేపదే విమర్శించుకోవడం రాజకీయ వర్గాలలో ప్రధాన చర్చకు దారితీస్తోంది… వైయస్ రాజశేఖర్ రెడ్డి బంధువుగా రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని తిరిగి వైసీపీలో చేరబోతున్నానే… అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఉగాది రోజు బాలినేని చేసిన ట్వీట్ రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు దారి తీస్తోంది…. నాయకుడంటే నాయకత్వం చెలాయించడమే కాదు, నమ్మకం, ఆదరణ, విశ్వాసం కల్పించాలని, పవన్ అలాంటి నాయకుడే అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన ట్వీట్ ఇటు జనసేన నేతలతో పాటు అటు వైసీపీ నేతలకు కూడా షాక్ ఇచ్చిందంటున్నారు… ఏదో ఒక రోజు తిరిగి మా పార్టీలోకి వస్తారని అటు వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. బాలినేని ప్రత్యర్ధులు ఆయన జనసేనను వీడతారని ప్రచారం చేస్తున్న తరుణంలోబాలినేని చేసిన ట్వీట్ అందరికీ చెంపపెట్టు లా మారిందట.
పవన్ కళ్యాణ్ నాయకుడు మాత్రమే కాదు… నమ్మకం…. ఆదరణ… ఆశ్రయం.. అని ఆకాశానికెత్తేస్తూ… తన కుమారుడితో కలిసి జనసేనానితో ఉన్న ఫోటోలను షేర్ చేయటం రాజకీయ వర్గాలను షేక్ చేస్తుందట… గతంలో ఉన్న పార్టీలో అవి దక్కలేదని …ఇప్పుడు జనసేనలో తనకు ఆ భరోసా ఉందని.. పవన్ కళ్యాణ్ పట్ల బాలినేని తన విశ్వాసం వ్యక్తం చేయడంతో, ఆయన పార్టీ మారేది లేదని స్పష్టం చేశారని అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న ప్రత్యర్థ వర్గానికి బాలినేని అలా చెక్ పెట్టారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లి కార్యాలయంలో సమావేశమైన జగన్ .. బాలినేని పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేయటం ఆసక్తి రేపుతోంది. ప్రకాశం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటాయనతో పని లేదన్నట్లు..పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాబోయే మంత్రి అని జగన్ వ్యాఖ్యానించారు. ఒంగోలు నియోజకవర్గానికి వైసీపీ ప్రత్యామ్నాయ నేత చుండూరి రవి అని ప్రకటించారు. జగన్ వ్యాఖ్యలు ఒంగోలు రాజకీయాలతో పాటు జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
వైసీపీకి ఇక బాలినేని అవసరం లేదు .. ప్రత్యామ్నాయం ఉన్నారు అని చెప్పడమే జగన్ ఉద్దేశమంటున్నారు. కాబోయే మంత్రి …కాబోయే ఒంగోలు అభ్యర్థి అని జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని తన తాజా ట్వీట్‌తో ధీటైన కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్‌కి, జనసేనానికి మధ్య తేడాలను కంపేర్ చేస్తూ… బాలినేని ట్వీట్ చేశారని, ఆ క్రమంలో తనకు పార్టీ మారే ఆలోచన లేదని తన అనుచరులకు స్పష్టం చేశారని అంటున్నారు. ఇదే సమయంలో మరో మారు భేటీ అవుదామని బాలినేనికి ఉపముఖ్యమంత్రి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యంపై కూడా జిల్లాలో పలు రకాల చర్చలు నడుస్తున్నాయి… ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న భూకబ్జాలు, కూటమి నేతలపై అవినీతి ఆరోపణలను బాలినేని జనసేనాని దృష్టికి తీసుకెళ్లారంట. ఆ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పినట్లు బాలినేని వర్గం అంటోంది. దాంతో ఏం జరగబోతుందో? అని ఆయన ప్రత్యర్ధి వర్గం ఆందోళన చెందుతుందంట.
త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు కూటమి పార్టీకి ఎంతవరకు మేలు చేస్తాయి? …. అవినీతి ఆరోపణలను టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్తే యాక్షన్ తీసుకుంటారా? అసలు ఒంగోలులో నిజంగా అవినీతి జరుగుతుందా? జరుగుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? …అని సామాన్యులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఒంగోలు కనిపిస్తోంది. ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న బాలినేని, దామచర్లల వార్‌తో ఒంగోలు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళన కూటమిశ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇక అంతలోనే బాలినేని మరో ట్టిస్ట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో సహా కలిసిన బాలినేని, అనంతరం ముగ్గురూ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేస్తూ.. పవన్ మా నాయకుడే కాదు నమ్మకం అంటూ పోస్ట్ పెట్టారు. కానీ, ఉదయం పెట్టిన ఈ పోస్ట్ తర్వాత డిలీట్ చేయడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకుండా తయారైందంట.
Story by Apparao, Big Tv
Also Read: Baleno vs Glanza: ఒకే ప్లాట్ ఫామ్, రెండు బ్రాండ్లు.. బాలెనో vs గ్లాంజా, రెండింటిలో ఏది బెస్ట్?