Ongole Politics: ఆ లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ కూటమి పార్టీల శ్రేణులకు అంతుపట్టకుండా తయారైంది. ఒకరేమో వైసీపీ నుంచి ఓడి వచ్చి జనసేన పంచకు చేరారు. మరొకరేమో అత్యధిక మెజార్టీతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే .. ఇద్దరు ఎన్నో ఏళ్ల నుంచి ఒకే సెగ్మెట్లో ఢీ అంటే ఢీ అంటున్న వారే.. ఇప్పుడు ఒకే గూటికి చేరినా వారి మధ్య విభేదాలు రావణకాష్ట్రంలా రగులుతూనే ఉన్నాయంట. ప్రస్తుతం వారిద్దరి ఆధిపత్యపోరు చూసుకుందామంటే చూసుకుందాం రా.. అనే వరకు వెళ్లింది. ఇంతకీ ఎవరా ఆగర్భ శత్రువులు?
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఒకరిపై మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కడిగి పారేసుకుంటున్నారు. వైసీపీ నుండి జనసేన లో చేరిన మాజీమంత్రి బాలినేని ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దామచర్లపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. దీంతో ఒంగోలులో కూటమి లోని టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ పెరిగిపోతోందంట. మొదటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్‌ల మధ్య రాజకీయ వైరం ఉంది. 2012 ఉప ఎన్నికల నుండి వారు నాలుగు సార్లు ఒంగోలు బరిలో ప్రత్యర్ధులుగా పోటీ పడ్డారు. 2012 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికలలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 2014, 2024 ఎన్నికలలో దామచర్ల జనార్ధన్ విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్న 2019 – 2024 మధ్యకాలంలో వారిద్దరు సందర్భంగా లేకపోయినా ఒకరిపై ఒకరు కాలు దువ్వుతూ పరస్పర దూషణలు చేసుకున్నారు.
అంతటితో ఆగకుండా పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని శ్రీ వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన జనసేనలో చేరడాన్ని ఒంగోలు జనసేన నాయకులతో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వర్గం గట్టిగా వ్యతిరేకించింది. పార్టీలో తీసుకోవద్దని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఒత్తిడి తెచ్చేలా గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని జనసేనలో చేరే లాంఛనం పూర్తైంది. మొదట ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించి, దానికి జనసేనానిని పిలిచి బలప్రదర్శన చేద్దామనుకున్న బాలినేని, త చడీచప్పుడు లేకుండా తాడేపల్లి జనసేన ఆఫీసులో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దాంతో పొత్తు ధర్మం పాటిస్తూ బాలినేని , దామచర్ల కలిసి పని చేస్తారని ఒంగోలు వాసులు భావించారు. సీన్ కట్ చేస్తే .. షరా మామూలుగానే ఆ ఇద్దరు విమర్శల పర్వాన్ని డోసు పెంచి మరీ కొనసాగిస్తూనే ఉన్నారు.
Also Read: Vijay Rashmika: సొంత గ్రామానికి విజయ్ రష్మిక .. గ్రామస్తులందరికీ పసందైన భోజనం!
గడిచిన రెండు రోజులుగా దామచర్ల, బాలినేనిల ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. జనసేన పార్టీ సభ్యత్వాల నమోదుకు ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి .. దామచర్ల జనార్ధన్ తో పాటు ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో ఉద్వేగానికి గురై, తనకు ఒక్కగానొక్క కుమారుడిని టార్గెట్ చేసి, దామచర్ల వర్గీయులు విమర్శలు గుర్తిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. బాలినేని అంతటితో ఆగకుండా, ఒంగోలు నగరంలో భారీగా భూకబ్జాలు జరుగుతున్నాయని దామచర్ల వర్గంపై ఆరోపణలు చేశారు. నష్టపోయిన ప్రజలు తనను కలుస్తున్నారని వారి రక్షణ కోసం తాను ఎంతవరకైనా పోరాటం చేస్తానని ఒంగోలులో తన సత్తా ఏంటో చూపిస్తానని సవాలు విసిరారు. ఎమ్మెల్యే అవినీతి పెరిగిందని, దానికి బాధితులు రాసిన లెటరే సాక్ష్యమని ధ్వజమెత్తారు. లెటర్ రాసిన వాళ్లని ఇంటికి పిలిపించుకుని రాజీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు.. త్వరలోనే వస్తా ప్రశ్నిస్తా అంటూనే …దానికి జనసేనతో సంబంధం లేదని, తన వ్యక్తిగతం అని సెలవిచ్చారు. ఒంగోలులో జరుగుతున్న అవినీతి భూకబ్జాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు సీఎం చంద్రబాబుకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
బాలినేని సవాళ్లు, ఆరోపణలపై దామచర్ల ఉద్వేగానికి గురై గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడో ఒకసారి వచ్చి రెచ్చగొట్టి వెళ్ళటం కాదు, ఇప్పటివరకు ఐదు సార్లు గెలిపించిన ఒంగోలు ప్రజలకు ఏమి చేశావో సమాధానం చెప్పాలని బాలినేనిని టార్గెట్ చేశారు. తనపై లెటర్లు రాసి, పాంప్లెట్లు ముద్రించి పంచింది కూడా బాలినేనే అని మండిపడ్డారు..సంబంధం లేని విషయంలో ఎస్పీకి ఫోన్లు చేయించాడని, లెటర్లు రాసిన వ్యక్తిని అప్పగిస్తానంటూ రాజీ ప్రయత్నం చేశాడని మీడియా ముఖంగా ఆరోపించారు. ఒంగోలు కి గంజాయి పరిచయం చేసిందే బాలినేని తనయుడు అంటూ, ఇప్పటికైనా పద్దతులు మార్చుకోవాలని దామచర్ల తీవ్ర అభియోగాలు మోపారు. విమర్శలు ఒక స్థాయి వరకు ఓకే కానీ, నీచంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పై కూడా విమర్శలు చేయటం సరైన పద్ధతి కాదని విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన కబ్జాలన్నీ వెలికి తీస్తామని హెచ్చరించారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని చురకలు అంటించారు.
ఎక్కడో హైదరాబాదులో కూర్చుని రాజకీయం చేయటం కాదు.. ఒంగోలులో ఉండి మాట్లాడాలని బాలినేనికి దామచర్ల సూచించారు. తనపై చేసిన ఆరోపణలు, విమర్శలను . ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని దామచర్ల హెచ్చరించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రిల వాగ్యుద్దం ఒంగోలులో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్షం వైసీపీ వారి తతంగాన్ని చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తోంది. ఏది ఏమైనా ఒంగోలులో నిజంగా భూకబ్జాలు జరిగిఉంటే, అవి బయటకు వస్తాయా?…. కబ్జా కోరల నుండి బాధితులకు ఊరట దొరుకుతుందా?… అసలు దామచర్ల, బాలినేని చేసుకుంటున్న ఆరోపణల్లో నిజమెంత? అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి.
Story By: Apparao, Big Tv
Also Read: KTR Criticism: అధఃపాతాళానికి హైదరాబాద్.. నగరంలో ప్రతీది స్కామే.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు