హీరో, విలన్ కొట్టుకుని.. కమెడియన్‌ను చంపేసినట్లు.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం చేసుకుంటూ, మధ్యలో గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయ్. అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నా.. మిస్సైల్స్ మాత్రం జనాలపైన, ఆయిల్ ఆయిల్ రిఫైనరీ పడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇరాన్ నుంచి వస్తున్న మిస్సైళ్లను అమెరికా సైనిక బలగాలు, ఆయా దేశాల రక్షణ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. అయితే, ఆయా దేశాల్లో ఏదో తెలియని ఆందోళన నెలకొంది. ఎందుకంటే.. ఇరాన్‌కు ఉన్న సైనిక శక్తితో పోల్చితే.. గల్ఫ్ దేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అమెరికా సపోర్ట్ ఒక్కటే వాటికి కలిసొచ్చే అంశం. అయితే, ఇరాన్ ఇప్పుడు తెగించి దాడులు చేస్తుంది. దానికి ఒక లక్ష్యం అంటూ ఏం లేదు. మిస్సైళ్ల వర్షం కురిపించడం ఒక్కటే దాని ప్రస్తుత స్ట్రాటజీ.
గల్ఫ్ దేశాల్లో కీలకమైనవి యూఏఈ, సౌదీ అరేబియాలే. ఈ దేశాలు ఆర్థికంగా బలమైనవి. జనాభా కూడా ఎక్కువే. ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్.. అమెరికా వంటి సంపన్న దేశాల్లో కూడా ఉండదు. ఒకప్పుడు కేవలం ఆయిల్ రిఫైనరీలకే పేరొందిన ఈ దేశాలు.. పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలో ఉండే ప్రతి సంపన్నులకు దుబాయ్, అబుదాబీల్లో నివాసాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ దేశాలు ఎంతగా డెవలప్ అయ్యాయో. ఇదే ఇప్పుడు ఇరాన్‌కు మింగుడు పడని విషయం. పైగా ఈ దేశాలకు అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉన్న స్నేహం మరింత రగిలిపోయేలా చేస్తోంది. అయితే, ఈ గల్ష్ దేశాలకు డబ్బులైతే ఉన్నాయి గానీ.. చెప్పుకోతగ్గ సైన్యం లేదు. దీనికి మరో కారణం.. ఈ దేశాలకు ఎవరితోనూ పెద్దగా వైరం లేకపోవడమే.
1979లో ఇరాన్ రెవల్యూషన్ జరిగింది. అప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. దానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్ సున్నీ, అరబ్ ముస్లీం దేశాలతో స్నేహం చేయడమే. ఇరాన్‌లో సియా ముస్లీంలు ఎక్కువ. ఇజ్రాయెల్ పూర్తిగా జుడాయిజాన్ని అనుసరిస్తుంది. పైగా తమకు ఇష్టంలేని సున్నీ, అరబ్, అమెరికా దేశాలతో స్నేహం చేస్తుంది. అందుకే.. పాలస్థీనాను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్‌ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (PIJ)లకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతూ ఇజ్రాయెల్‌పై దాడులు చేయిస్తుంది. పాలస్తీనా దాన్ని ఉద్యమంగా చెబుతుంది. ఇజ్రాయెల్ మాత్రం దాన్ని ఉగ్రవాదంగా చూస్తోంది. అయితే, ఇరాన్‌తో వైరం ఏర్పడటానికి ఇది ప్రధాన సమస్య కాదు. ఇరాన్ యురేనియం ఎన్‌రిచ్‌మెంట్, అణ్వాయుధాలను తయారు చేస్తుంది. ఇది ఎప్పటికైనా ఇజ్రాయెల్‌కు ముప్పే. అందుకే అమెరికాతో కలిసి దాడులు మొదలుపెట్టింది. అదే ఇప్పుడు.. చిలికి చిలికి గాలివానలా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసుకుంది. కానీ, దాని ప్రధాన లక్ష్యం ఆయా దేశాల్లో ఆయిల్ రిఫైనరీలను, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమేనని విశ్లేషకులు అంటున్నారు.
ఇజ్రాయెల్ వైరం తమ మెడకు చుట్టుకుంటుందని గల్ఫ్ దేశాలు మొదట్లో భావించలేదు. కానీ, ఎప్పుడైతే వారు పరస్పర దాడులు చేసుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి అప్రమత్తంగా ఉండటం మొదలుపెట్టారు. ముఖ్యంగా సౌది అరేబియా, ఖతార్ దేశాలు అమెరికాతో కొన్ని రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే, అంతకు ముందు అబ్రహం అకార్డ్స్ ఒప్పందం ఒకటి జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్, యూఏఈ, బహ్రైన్‌తో పాటు మొరాకో, సూడన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. సైనిక సహకారం, ఇంటిలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలపై ఒప్పందం జరిగింది. కాబట్టి.. ఇరాన్‌తో యుద్ధం వస్తే ఈ దేశాలన్నీ కలిసికట్టుగా దాడులు చేస్తేనే పైచేయి సాధిస్తారు. ఏ ఒక్క గల్ఫ్ దేశానికి ఒంటరిగా దాడి చేసే సత్తా లేదు.
గల్ఫ్ దేశాలకు.. అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ ఒక్కటే బలం. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలతో పోల్చితే.. ఈ దేశాలు దగ్గర ఉన్నవి అత్యాధునికమైనవి. అయితే ఈ దేశాలకు సైనిక బలం తక్కువ. అయితే, మిస్సైల్స్ దాడిని అడ్డుకోగలిగే అడ్వాన్సుడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. సౌదీ అరేబియా దగ్గర F-15, Typhoon ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ ఉంది. UAE వద్ద F-16, Mirage వంటి మోడ్రన్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, అవి కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ సాయంతో పోరాడటమే తప్పా వేరే మార్గం లేదు. పైగా భారీగా నష్టపోయే ఛాన్సులు కూడా ఈ గల్ఫ్ దేశాలకే ఎక్కువ. ఇరాన్ ఇప్పటికే ఆయా దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. గల్ఫ్ దేశాల వద్ద డబ్బులున్నా.. తమని తాము కాపాడుకొనేంత బలమైన సామర్థ్యం మాత్రం లేదు. ఇరాన్ దాడులతోనైనా భవిష్యత్తులో బలపడతారేమో చూడాలి.
Also Read: టార్గెట్ బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనమే ఇరాన్ టార్గెట్? ఎందుకంటే..