KCR: తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. డబల్ హ్యాట్రిక్ సాధించిన ఆయనకు 2023 అసెంబ్లీ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. ఓటమితో ప్రజల్లో జీరో అవడంతో.. ఇక ఆయన పార్టీలో హీరో అవ్వాలని డిసైడ్ అయ్యారట . ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి తానే పెద్ద దిక్కు అనేలా ప్రవర్తిస్తుండడంతో, సొంత పార్టీ నేతలే.. ఆయన ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారట. ఇవేం ఆధిపత్య పోకడలు అంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయనపై సొంత పార్టీలో ఎందుకంత వ్యతిరేకత?
ఎర్రబెల్లి చుట్టూ తిరిగిన వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ రాజకీయం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ రాజకీయం నడుస్తూ ఉండేది. మొన్నటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా.. ఎర్రబెల్లి దయాకర్ రావు కనుసన్నల్లో జరిగేది. పార్టీలో ఆయన చెప్పినట్టే నడిచేది. అధినేత కేసీఆర్ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయనతోనే అన్ని వ్యవహారాలు నడిపించేవారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎర్రబెల్లి వరుస విజయాలకు బ్రేక్ పడింది. వర్ధన్నపేటలో 1994లో మొదలైన ఎర్రబెల్లి విజయ పరంపర 2023 వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.
యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయిన ఎర్రబెల్లి దయాకర్
ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దయాకర్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ మాత్రం పట్టులేని కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి రాజకీయాల్లో ఆయన ప్రభ తగ్గుతుందనే టాక్ నడుస్తుంది. ఇంటా, బయటా దయాకర్ రావు ప్రాధాన్యత కోల్పోతున్నారనే చర్చ మొదలైంది. దయాకర్ రావు అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాటకు విలువ ఉండేది. పాలకులు ఆయన అడిగింది కాదనకుండా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదని గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను, ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవన్నపేట శివారులో నిర్వహించాలని అనుకున్నారు. సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జరిగిన మొదటి సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌లను పిలిచారు. దీంతో ఉద్యమ కాలం నుండి పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు బీఆర్ఎస్ అధిష్టానంపై అలక బూనినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న కేసీఆర్, ఆ నేతలందరినీ తన ఫాంహౌస్ కి పిలిపించుకుని మాట్లాడారంట.
సభావేదికను హైదరాబాద్ సమీపానికి షిఫ్ట్ చేయాలని కేసీఆర్
రజతోత్సవ సభ బాధ్యతల విషయంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఐక్యత రాకపోవడంతో ఒకదశలో సభావేదికను హైదరాబాద్ సమీపానికి షిఫ్ట్ చేయాలని కేసీఆర్ భావించారంట. రజతోత్సవ సభ నిర్వహణ పై మాజీ మంత్రి మల్లారెడ్డి తో సైతం కేసీఆర్ చర్చించారట. అయితే.. వరంగల్ జిల్లా నేతలు, బతిమాలుకోవడంతో.. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ నిర్వహించేందుకు కేసీఆర్ అంగీకరించినట్టు తెలిసింది. దేవన్నపేట వద్ద సభ జరిగితే దాని భాద్యతలు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతికి వెళ్లేవని, సభను దేవన్నపేట నుండి ఎల్కతుర్తికి మారేలా చేసి ఎర్రబెల్లి పెత్తన్నాని తగ్గించడానికి జిల్లా నేతలు ప్లాన్ ప్రకారం పావులు కదిపారన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది.
నచ్చిన నియోజకవర్గానికి వెల్లడానికి ఎర్రబెల్లి ప్రయత్నాలు
వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి అన్నీ నేనే..అనేలా ఎర్రబెల్లి వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తాను నచ్చిన నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే రజతోత్సవ సభ సైతం తన చేతుల మీదగా సక్సెస్ చేయాలని ఎర్రబెల్లి ప్రయత్నించారట. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావును రజతోత్సవ సభ బాధ్యతల నుండి తప్పించడమే కాకుండా ఆయన ఆశిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గాన్ని కూడా దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: చక్రం తిప్పిన బొత్స.. పరేషాన్‌లో కూటమి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయనకు ఎలాగైనా వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భాద్యతలు దక్కేలా చేసేందుకు ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజకీయ జన్మనిచ్చిన వర్ధన్నపేట నియోజకవర్గం కూడా దూరం అయినట్టే అని చర్చించుకుంటున్నారు.
అంతర్మథనంలో పడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
అటు అధికారం పోయి, ఇటు పార్టీలో సపోర్ట్ కూడా పోయి.. ఎర్రబెల్లి అంతర్మథనంలో పడ్డారంట. తాను ఒకటి తలిస్తే.. మరొకటి జరుగుతోందని, ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారంట. రజతోత్సవ సభ నిర్వహణ అంశంలో తన ప్లాన్ ఫెయిల్ కావడంతో.. బాధ్యతలను తానే వద్దనుకున్నానని ఎర్రబెల్లి తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారంట.
భారీగా జన సమీకరణతో తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్న ఎర్రబెల్లి
సభ నిర్వహణ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ప్రతి దానికి తననే బాధ్యుడ్ని చేసే చాన్స్ ఉందని, ఎవరికి ఏ లోటు జరిగినా తననే అడుగుతారని, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయని అందుకే తన పని తాను చేసుకుపోతున్నానని ఎర్రబెల్లి అంటున్నారంట. సభకు పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేసి దటీజ్ దయాకర్ రావు అనిపించుకుంటానని ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఎర్రబెల్లి ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో?