Earthquake India| భారత పొరుగు దేశం నేపాల్ లో శుక్రవారం సాయంత్రం స్వల్ప తీవ్రత గల భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌లో 5.0 తీవ్రతతో ఈ భూకంపం గర్ఖాకోట్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో, 20 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈ ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంలో కూడా పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకండ్లపాటు కంపించినట్లు నివేదికలు వచ్చాయి.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఈ భూకంపం శుక్రవారం సాయంత్రం 7.52 గంటలకు నమోదైంది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాల్లోని పలు చోట్ల భూమి కంపించడం గమనించబడింది.
భూకంపానికి కారణాలివే..
నేపాల్ హిమాలయ ప్రాంతంలో భారత టెక్టోనిక్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్ మధ్య రాపిడి వల్ల ఈ భూకంపం ఏర్పడింది. భారత ప్లేట్ ప్రతి సంవత్సరం సుమారు 4-5 సెంటీమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ యూరేషియన్ ప్లేట్ కిందకి జారిపోతోంది. ఈ ప్రక్రియ వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ సారి భూకంపం తక్కువ తీవ్రత కలిగినప్పటికీ, దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో విస్తృతంగా కనిపించింది.
ఉత్తర భారతదేశం భూగర్భంలో ఏం జరుగుతోంది?
ఉత్తర భారతదేశం.. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణులు, భూకంపాలకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉన్నాయి. ఈ ప్రాంతం సిస్మిక్ జోన్ 5, జోన్ 6 లోకి వస్తుంది. ఇక్కడ భూకంప తీవ్రత MSK IX లేదా దానికన్నా ఎక్కువగా ఉండవచ్చు. భారత ప్లేట్ ఒత్తిడి వల్ల భూమి లోపల శక్తి పేరుకుపోతుంది. ఈ శక్తి తరచూ బయటకు రావాలని ప్రయత్నిస్తోందని, ఈ కారణంగా ఈ ప్రాంతంలో సిస్మిక్ కార్యకలాపాలు జరుగుతాయని నిపుణులు తెలిపారు.
Also Read: అవినీతిపరులైన జడ్జిలకు శిక్షలు లేవా?.. కానీ టీచర్లను తొలగిస్తారా?.. సుప్రీంపై మండిపడిన దీదీ
వరుస భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి?
నేపాల్, ఉత్తర భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవించడం టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల జరుగుతోంది. 2015లో నేపాల్‌లో సంభవించిన 7.8 తీవ్రత గల భూకంపం ఈ ప్రాంతంలో భూమి లోపల కదలికలు తీవ్రంగా ఉన్నాయని నిర్ధారించింది. చిన్న తీవ్రత గల భూకంపాలు క్రమంగా ఒత్తిడి విడుదల చేస్తాయి, కానీ పెద్ద భూకంపాలు ఒకేసారి భారీ శక్తిని విడుదల చేసి భారీ నష్టాన్ని కలిగిస్తాయి.
భవిష్యత్తులో భారీ భూకంపం వచ్చే ప్రమాదం.. హెచ్చరిస్తున్న నిపుణులు
నిపుణులు హెచ్చరికల ప్రకారం.. హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం (8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత) వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంది. గత 50 ఏళ్లలో ఈ ప్రాంతంలో నాలుగు పెద్ద భూకంపాలు సంభవించాయి. 1897 షిల్లాంగ్ భూకంపం, 1905 కాంగ్రా భూకంపం, 1934 బీహార్-నేపాల్ భూకంపం, 1950 అస్సాం-టిబెట్ భూకంపం. సిస్మాలజిస్టులు శక్తి పేరుకుపోతున్నదని హెచ్చరిస్తూ.. ఆ శక్తి ఎప్పుడు, ఎక్కడ బయటకు వస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదని తెలిపారు.
ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపాలు
ఇటీవల జపాన్‌లో కూడా భూకంపాలు సంభవించాయి. గత 24 గంటల్లో జపాన్‌లో నాలుగు సార్లు భూమి కంపింది. హోక్కాయిడో ఒట్రాడాలో 4.7 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. అలాగే రెండు రోజుల క్రితం కాగోషిమా నిషినూమోటో కేంద్రంగా 6.2 తీవ్రత గల భూకంపం సంభవించింది.
పపువా న్యూ గినియాలో భారీ భూకంపం:
మరోవైపు, పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌లో 6.9 తీవ్రతతో ఈ భూకంపం పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కిమీ దూరంలో, 10 కిమీ లోతులో సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీనివల్ల సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
అంతకుముందు మార్చి 28న మయన్మార్, థాయ్‌లాండ్‌లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో మయన్మార్‌లోనే మూడువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడగా, పలు మంది గల్లంతయ్యారు. ఆ దేశంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.