YCP BIG Shock To Roja: నగరి వైసీపీలో మాజీ మంత్రి రోజా కథ ముగిసినట్లేనా? రోజాని రాజకీయంగా అనామకురాలిని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంటి పోరు తప్పించుకోవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతుంటే.. రోజా విషయంలో ఆయనకు జగన్ కూడా పర్మిషన్ ఇచ్చారా? జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తుంది. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు జగదీష్ వైసీపీ బాట పట్టనున్నారు. ఆయన నగరి వైసీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్నారంట. ఆయనకు ఆ పదవి దక్కేలా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారని.. రోజాకి జిల్లాలో సెగ్మెంట్ లేకుండా చేయడమే ఆయన వ్యహమని ప్రచారం జరుగుతోంది. దానికి జగన్ కూడా ఓకే చెప్పారన్న ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది.
కీలక నేతల వలసలతో వైసీపీకి పలు సెగ్మెంట్లలో నాయకత్వ లేమి స్పష్టం కనిపిస్తుంది. ఒక వైపు పోయేవారు పోతుండగానే.. పార్టీ పెద్దలు కొందరు నేతలకు చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారంట.. ఉమ్మడి చిత్తూరుజిల్లా నగరి నుంచి రెండు సార్లు బొటాబొటీ మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి రోజా గత ఎన్నికల్లో 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.. అప్పటి నుంచి ఆమె నగరికి పూర్తిగా దూరమై .. అప్పుడప్పుడు ప్రభుత్వంపై విమర్శలతో వీడియోలు రిలీజ్ చేస్తూ గడిపేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైసీపీ పతనం స్టార్ట్ అయ్యింది. ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన పలువురు ముఖ్య నేతలు.. వైసీపీని వీడుతున్నారు. మరికొందరు పార్టీ మారడానికి తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, తాజాగా రాజ్యసభ సభ్యులు సైతం జగన్‌కు గుడ్ బై చెప్పి.. తలోదారి చూసుకున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకుల కొరత ఏర్పడింది.
ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్న నాయకుల్ని కాపాడుకోవడంతో పాటు.. కొత్త వారిని చేర్చుకోవడానికిఏ పార్టీ అయినా.. ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తారు. కానీ, వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోందట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని.. నగరిలో బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే.. గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్‌ని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారంట. తన అన్న నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌తో విభేదిస్తున్న జగదీష్ నగరిలో వైసీపీ ఫ్లెక్సీలతో అప్పుడే హడావుడి మొదలుపెట్టేశారు.
జగదీష్ చేరికపై రోజాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదట. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలనే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలలో రోజా నాయకత్వాన్ని నగరి వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల నుంచి.. జడ్పీటీసీల వరకు చాలా మంది వైసీపీ నాయకులు రోజాని వ్యతిరేకించి.. రోజాకు వ్యతిరేకంగా పని చేశారు. ఇప్పటికీ ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత జగన్‌కు రోజాపై అనేక ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే.. ఇక రోజా సేవలకు సెలవు చెప్పాలని జగన్ డిసైడ్ అయ్యారట.
వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ.. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలిని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రోజాకు ఎర్త్ పెట్టడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారంట … ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది .. ప్రభుత్వం మీదా ప్రజలకు నమ్మకముంది. వైసీపీ హయాంలో జరిగిన దందాలు రోజుకొకటి బయటపడుతున్నాయి.
కొన్నిచోట్ల వైసీపీ తిరిగి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది .. గతంలో జరిగిన దాడులు, దౌర్జన్యాల గురించి సామాన్య జనం కూడా నోరు తెరచి చెప్పుకుంటున్నారు.ఇలాంటి స్థితిలో వైసీపీలో చేరడం అంటే ఖచ్చితంగా అది ఓ రకంగా సాహసమే .. అలాంటిది గాలి జగదీష్ వైసీపీలో చేరడానికి కారణమేమిటి అంటే అది మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యూహమని అంటున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణిచి వేయడమే లక్ష్యంగా అటు జగన్‌తో పాటు కింది స్థాయి నాయకులు కూడా ప్రయత్నించారు.. ఆ సామాజికవర్గం లెక్కలతోనే అమరావతి రాజధానిని లేకుండా చేయాలని చూశారు.
Also Read: రూటు మార్చిన జగన్.. పెద్ద స్కెచ్చే వేశారుగా..!
ఆ సామాజికవర్గానికి చెందిన వారిని చాలా వరకు ఇబ్బందులు పెట్టారు.. వారి వ్యాపారాలను స్థంభింపచేసారు. బలవంతంగా లాక్కోవడానికి కూడా తెగబడ్డారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నపుంగనూరు నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వేధించారు.. నగరి లో కూడా అదే జరిగింది.మాజీ మంత్రి రోజా సైతం ఇదే పనిచేశారు. అయితే అక్కడ పెద్దిరెడ్డి వర్గీయులుగా చెప్పుకుంటున్న వారందరిపై కక్షసాధింపు ధోరణిలో పనిచేశారు. 2019 నుంచి 24 వరకు వారిని అచేతనావస్థలో ఉంచారు. దాంతో పాటు వారికి రావాల్సిన పదవులు రాకుండా అడ్డుకున్నారు. తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నా రోజా సీటు దక్కించకున్నారు.
గాలి జగదీష్‌కు 2019 ముందు నుంచి సోదరుడుగాలి భాను ప్రకాష్ తో విభేదాలు ఉన్నాయి. 2019లో తన సోదరుడిని ఓడించడానికి పెద్ద ఎత్తున నిధులు కుమ్మరించాడని ప్రచారం ఉంది. అయితే రాజకీయంగా ఎదగాలనే కోరికతో ఉన్న అతన్ని టీడీపీ అధిష్టానం దగ్గరకు తీయలేదు. దీంతో పెద్దిరెడ్డితో గాలి జగదీష్ జతకట్టాడంట. 2024లో జగదీష్ వైసీపీ నుంచి పోటీ చేస్తాడని ప్రచారం కూడా జరిగింది. పెద్దిరెడ్డి కూడా ఆ దిశగా గట్టిగానే ప్రయత్నించారంట. అయితే రోజా పట్టు వదలకుండా తన నగరి సీటు సాధించుకున్నారు. నగరి చరిత్రలో అత్యంత ఘోరంగా ఓటమి పాలైన నేతగా రికార్డులకు ఎక్కారు.
ముందు నుంచి పెద్దిరెడ్డితో విభేధిస్తున్న రోజా.. ఓటమి తర్వాత కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వేదికల మీదా మాట్లాడారు. దీంతో పాటు అంతర్గతంగా పెద్దిరెడ్డి వ్యతిరేక టీమ్‌ను తయారు చేయడానికి రోజా ప్రయత్నించారంట.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకొమ్మన్నప్పుడు చిత్తూరు ఇన్ చార్జ్ విజయానందారెడ్డి బాహాటంగా వ్యతిరేకించాడని, తర్వాత రోజా,నారాయణస్వామి దానికి అనుకూలంగా మాట్లాడారని తెలుస్తోంది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన్ కరుణాకర్ రెడ్డిని నియమించారు.
సరిగ్గా టైమ్ చూసుకుని పావులు కదిపిన పెద్దిరెడ్డి.. నగరిలో రోజాకు వ్యతిరేకంగా గాలి జగదీశ్‌ని తెరపైకి తెచ్చారంట. జగన్ కూడా జగదీష్ విషయంలో సానుకూలంగా ఉన్నారని.. చేరిక లాంఛనం పూర్తయ్యాక.. జగదీష్‌ని నగరి వైసీపీ ఇన్చార్జ్‌గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే రోజా వర్గీయులు దాన్ని కొట్టి పారేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కొత్తగా పుత్తూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని, అందుకే గాలి జగదీష్ చేరుతున్నారని అంటున్నారంట. మొత్తానికి రోజా విషయంలో జగన్ నిర్ణయం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.