GVL Narasimha Rao: ఎప్పటి నుంచో పాపం ఆయనకు విశాఖ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అధ్యక్ష అనాలన్న కోరిక. గత ఎన్నికల్లోనే ఆ కోరిక తీరాల్సింది. కానీ ఏపీ కూటమి కట్టడంతో ఆయనకది అందని ద్రాక్షే అయ్యిందట. అయినా సరే తన ఆశ చావక.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే తీవ్ర యత్నం చేస్తున్నారట. మరి ఆ పెద్దమనిషి ఎంపీ ఆశలు నెరవేరే దారేది? అందుకు ఆయన ముందున్న అవకాశాలేంటి? ఇప్పుడు చూద్దాం.
విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసినోళ్లంతా వలసవచ్చిన వాళ్లే..
RSS పాత పరిచయాలతో 2029 విశాఖ ఎంపీ సీటు కోసం విశ్వయత్నం?విశాఖ లోక్ సభ స్థానానికి ఎంతో ప్రత్యేక స్థానముంది. ఇప్పటివరకు విశాఖ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలిచిన వాళ్లంతా ఎక్కువ శాతం వలస వచ్చిన వాళ్ళే కావడం మరో విశేషం.. ఒకరిద్దరు విశాఖలో స్థిరపడిన వారు తప్పించి.. కేవలం రాజకీయాల్లో రాణింపు కోసం విశాఖను ఎంపిక చేసుకుంటున్న వారు ఎందరో..
ప్రస్తుత ఎంపీ భరత్ సైతం.. గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన వారే
ప్రస్తుత విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్ కూడా గోదావరి ప్రాంత వాసులే.. ఈజీగా గెలుపు సాధించాలనుకునేవారి హాట్ ఫేవరేట్ గా మారింది విశాఖ. అందుకే ఈ సీటు సాధించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. గత ఐదేళ్లుగా అదే పనిలో ఉన్నారట మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.
గత 20 ఏళ్లుగా విశాఖలో గెలిచిన వారంతా బయటి వారే
2019 నుండి 2024 ఎన్నికల మధ్య సమయంలో.. ఇటు బిజెపి కార్యక్రమాలతో పాటు, అటు తన సొంత ఇమేజ్ ని పెంచుకోవడంలో భాగంగానే.. విశాఖ వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారట GVL.. గత 20 ఏళ్లుగా విశాఖ ఎంపీగా గెలిచిన వారంతా.. బయటివారే కావడంతో జివిఎల్ విశాఖ ప్రేమ వీడటం లేదట. ఇప్పటికీ ఈ సీటు మీద ఆయన ఆశ చావడం లేదట.
2004- నేదురుమల్లి, 2009- పురంధరేశ్వరి..
2004లో నేదురుమల్లి, 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవివీ సత్యనారాయణ.. ఇలా వీరందరూ ఇతర ప్రాంతాలకు చెందిన వారే… ఈ సెంటిమెంటే తనకు కూడా వర్తిస్తుందని భావించిన జీవీఎల్ గత ఐదేళ్లుగా.. విశాఖ వేదికగా తన కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.
జీవీఎల్ స్వస్థలం బాపట్ల జిల్లా, బల్లికురువ
GVL పుట్టింది ప్రస్తుత బాపట్ల జిల్లా బల్లికురువ గ్రామం.. GVL తండ్రి ముప్పై ఏళ్ళు పంచాయితీ సర్పంచ్ గా పని చేశారు. తండ్రి నుంచి వచ్చిన ఈ వారసత్వమే.. GVL కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసి ఉండొచ్చని అంటారు.. GVL ఉన్నత చదువులు గుజరాత్ లో జరగ్గా.. RSS బావజాలం ఎక్కువన్న GVL గత కొన్నేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగానూ పని చేసిన జీవీఎల్.. వాక్ చాతుర్యం, పట్టుదల చూసిన అధిష్టానం 2018లో యూపీ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపింది.. ఆనాటి నుంచి GVL అయితే ఢిల్లీ, లేకుంటే వైజాగ్ అంటూ బండి లాగిస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీల ఫ్లెక్సీల కన్నా విశాఖలో GVL ఫ్లెక్సీలే అధికం
విశాఖలో ఎలాగైనా సరే పాగా వేయాలన్న ఉద్దేశంతో.. ఇటు పార్టీ అటు పర్సనల్ ఎజెండాతో కూడిన కార్యకలాపాలతో వైజాగ్ కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు జీవీఎల్. అదెంతగా అంటే సిట్టింగ్ ఎంపీ ఫ్లెక్సీల కన్నా విశాఖ మొత్తం GVL ఫ్లెక్సీలే ఎక్కువగా కనిపించేంత.. గతంలో ఇటు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే అటు విశాఖ ఎంపీ సీటు కోసం విస్తృతంగా ట్రై చేశారట. ఏపీలో కూటమి ఏర్పడడం వల్ల ఈ ఛాన్సు టిడిపి నుంచి భరత్ ఎగరేసుకుపోవడంతో జీవీఎల్ ఆశలు అడియాశలయ్యాయట. ఎన్నికల తర్వాత గత ఏడు నెలల్లో కొంత రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఢిల్లీకే పరిమితం అవుతూ వచ్చారాయన.
2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న GVL
ఎప్పటి నుంచో విశాఖపై మనసు పారేసుకున్న మాజీ ఎంపీ జీవీఎల్ తిరిగి యాక్టివ్ అయ్యారట. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 2019 నాటి నుంచీ ఢిల్లీ వైజాగ్ షటిల్ కొట్టిన.. జీవీఎల్.. ఎలాంటి అంశమైనా సరే విశాఖ వేదికగానే మీడియా ముందుకు వచ్చేవారు. అలా తన ఓన్ ఇమేజీని క్రియేట్ చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో సీటు రాక పోవడంతో కాస్త డీలా పడ్డ జీవీఎల్.. తిరిగి ఢిల్లీ టూ వైజాగ్.. ట్రావెలింగ్ మొదలెట్టేశారట. ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ.. తానింకా రేసులో ఉన్నానని చాటుకుంటున్నారట.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం రూ. 11, 400 కోట్లు ప్రకటించడంతో మళ్లీ యాక్టివ్
2024 ఎన్నికల తర్వాత ఒకట్రొండు సార్లు విశాఖ వచ్చినా.. గత ఏడు నెలులుగా అయితే ఆయన సైలెంటుగానే ఉంటూ వస్తున్నారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం 11 వేల 400 కోట్లు ఎప్పుడైతే కేటాయించిందో.. ఆ మరుక్షణం నుంచి విశాఖలో వాలిపోయి.. బీజేపీ స్టీల్ ప్లాంట్ కోసం ఇస్తున్న నిధులు ఇతర సహాయ సహకారాల గురించి వివరిస్తూ.. తన పాత పద్ధతి మొదలు పెట్టేశారట. దానికి తోడు ఈ ఏడు సంక్రాంతి సంబరాలు కూడా భారీగా నిర్వహించి.. తిరిగి తన విశాఖ అనుబంధాన్ని గాడిలో పెట్టే యత్నం చేశారట.
విశాఖ ఎంపీగా రెండో సారి నిలబడ్డ వారే లేరన్న సెంటిమెంట్
గత ఎన్నికల సంగతి అలా ఉంచితే.. ఈసారికి అంటే, 2029నాటి ఎన్నికలకు ఇప్పటి నుంచే జీవీఎల్ ముంత మసాలా నూరుతున్నట్టు తెలుస్తోంది. జీవీఎల్ ని ఊరిస్తున్న మరో విషయమేంటంటే.. విశాఖ ఎంపీ సీటు గెలిచిన ఏ అభ్యర్ధి కూడా రెండో సారి రిపీట్ అయ్యిందే లేదు. దీంతో గెలిచిన ప్రతి ఎంపీ కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉంటున్నారు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలనుకుంటున్నారీ నరసింహరావ్.
గతంలో మోడీ ప్రసాంగాలను అనువధించిన జీవీఎల్
గతంలో ఏపీకి ప్రధాని ఎప్పుడొచ్చినా.. ఆ ప్రసంగాన్ని తెలుగులో అనువదిస్తూ.. జీవీఎల్ మోడీకి దగ్గరగా మసులుతూ వచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉండటంతో.. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు జీవీఎల్ జాబ్ కొట్టేశారు. దీంతో జీవీఎల్ కి మోడీకి మధ్య రామ్మోహన్ అనే అడ్డంకి ఏర్పడ్డట్టు కనిపిస్తోంది.
RSS పాత పరిచయాలతో 2029 విశాఖ ఎంపీ సీటు కోసం విశ్వయత్నం?
ఇవన్నీ అలా ఉంచితే.. ఇటు బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు అటు RSS పాత పరిచయాలనూ వాడి.. ఎలాగైనా సరే 2029 విశాఖ ఎంపీ సీటు కొల్లగొట్టాలని చూస్తున్నారట GVL. ఇప్పటి నుంచే జీవీఎల్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత వరకూ కలిసి వస్తాయో తెలియాలంటే కొన్నేళ్ల పాటు ఎదురు చూడాల్సిందే అంటున్నారు కమలనాథులు.