BJP Reaction On Raja Singh: ఇటీవల సీనియర్లే టార్గెట్ గా.. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలుంటాయా? లేక ఆయన కామెంట్లను సీరియస్‌గా తీస్కున్న అధిష్టానం.. సదరు నేతలపై ఫోకస్ పెడుతుందా? లేక రాజాసింగ్ పైనే రివర్స్ చర్యలు ఉండబోతున్నాయా? రాజాసింగ్ అసలెందుకిలా చేస్తున్నారు? ఆయన టార్గెట్ ఏంటి? లక్ష్యంగా చేసుకున్నది ఎవర్ని?? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలుంటాయా?
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడుతుంటే ఈ గొడవేంటి?కాంట్రవర్షియల్ కామెంట్స్ కి కేరాఫ్ అడ్రెస్.. బీజేపీ కాంట్రోస్ కి బ్రాండ్ అంబాసిడర్ రాజాసింగ్.. ఇటీవల చేసిన కామెంట్స్ తో బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? రాజాసింగ్ పై క్రమశిక్షణ చర్యలు తప్పవా? అధిష్టానం పెద్దలు ఆయనపై కన్నెర్ర చేశారా? లేక ఆయన అన్నదాంట్లో తప్పేముందని కొందరు రాజాకే సపోర్ట్ వస్తున్నారా? అన్న డిబేట్ కి ఇటు బీజేపీలోనే కాదు.. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లోనూ చర్చ నడుస్తోంది. రాజాసింగ్ కామెంట్ల కాకతో.. సొంత పార్టీ లీడర్లనే కంట్రోల్ చేయలేని మీరు ఇతర పార్టీలపై విమర్శలా? అన్న కామెంట్లు చేయడానికి తగిన స్కోప్ దొరికినట్టుగానూ తెలుస్తోంది. దీంతో బీజేపీ యేతర పార్టీలకిదో అదనుగానూ మారినట్టు సమాచారం.
ఒకప్పుడు ఏకీ ఎమ్మెల్యే.. ఇపుడు మేకయ్యాడా?
ఒకప్పుడు ఏకీ ఏక్ నెంబర్ ఎమ్మెల్యేగా ఉండిన రాజా సింగ్ ప్రస్తుతం ఏకుమేకులా తయారయ్యారని ఫీలవుతున్నారట. కాషాయ పార్టీ లీడర్లు. ఆయన వ్యవహారశైలి పూర్తి ఇబ్బంది కరంగా మారినట్టుగా చెప్పుకుని వాపోతున్నారట ఒకరికొకరు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న రాజాసింగ్ పై ఒక వర్గం ఎంత దుమ్మెత్తి పోస్తుందో.. మరో వర్గం మాత్రం అంతే బలంగా సపోర్టు చేస్తోందట. పార్టీలో పాతకాలం నాటి లీడర్ల వల్లే నష్టం జరుగుతోందని.. అధిష్టానం పెద్దలు ఈ విషయం సీరియస్ గా తీస్కోవాలని కోరుతున్నారట వీరు.
మింగలేని కక్కలేని విధంగా రాజాసింగ్ కామెంట్ల వ్యవహారం
అయితే రాజా సింగ్ కామెంట్ల పై అధిష్టానం పెద్దల రియాక్షనేంటన్న సస్పెన్స్ భారీ ఎత్తున కొనసాగుతోందట. రాజా సింగ్ వ్యాఖ్యలు తప్పని కొందరంటుంటే.. అందుకు రీజన్లు సైతం వీరు చూపుతున్నారట. రాజాసింగ్ చేసే ఈ కామెంట్ల వల్ల.. ప్రత్యర్ధి పార్టీలకు ఆయుధంగా మారుతోంది.. కాబట్టి ఆయన చేసిన కామెంట్లు తప్పుగా వాదిస్తున్నారు కొందరు. ఎవరు పవర్ లోకి వస్తే వారితో కొందరు బీజేపీ నేతలు రహస్య ఒప్పందాలు చేసుకుంటారనే కామెంట్ల కాక.. ఇప్పుడు కొందరి పాలిట మింగలేని కక్కలేని వ్యవహారంగా మారిందట. ఒక రకంగా చెబితే ఇటు అధిష్టానం పెద్దలను అటు స్థానిక నాయకత్వాన్ని డైలమాలో పడేశాయట. అంతగా రాజాసింగ్ ఫిట్టింగ్ పెట్టేశాడని అంతర్గతంగా ఒకరికొకరు మాట్లాడుకుం టున్నారట.
సీఎంలకు సలాం కొట్టి గులాం గిరి చేసేవారెవరంటూ అధిష్టానం ఫోకస్?
రాష్ట్ర బీజేపీలో సీఎంలకు సలాం కొట్టి గులాం గిరీ చేసే పాత నేతలు ఎవరా? అంటూ అధిష్టానం కూడా ఫోకస్ చేసిందని అంటున్నారు. రాజాపై చర్యలు తీస్కోవల్సిందేనని కొందరు కోరుతున్నా.. ఆయన అన్న మాటలనూ కేంద్ర పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే పాత నేతలపై రివర్స్ లో చర్యలుంటాయన్న చర్చ కూడా నడుస్తోంది.
గతంలో ఒక స్టాండప్ కమెడియన్ వ్యవహారంలో సస్పెన్షన్
అయితే కొందరు మాత్రం రాజాసింగ్ పై గట్టిగానే మండి పడుతున్నారట. రాజాసింగ్ కి ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేసి.. అందులో చలిమంట కాచుకోవడం ఒక అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఆయనపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బుద్ధి రావడం లేదని బాహటంగానే మాట్లాడుకుంటున్నారట. గతంలో ఒక స్టాండప్ కమెడియన్ పై చేసిన వాఖ్యలకు ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. తిరిగి ఎన్నికల ముందు తీస్కుని ఎమ్మెల్యే టికెట్ సైతం ఇచ్చింది. ఆయనపై ఎంతటి కఠిన చర్యలు తీస్కుంటున్నా.. గోషామహల్ ప్రజలు తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో మనమేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భరోసా రాజాసింగ్ లో వచ్చినట్టుగా భావిస్తున్నారు. అందుకే ఆయన సీనియర్లనూ వదలకుండా వెంటాడుతున్నారనీ.. చెప్పుకుంటున్నారు.
మరీ పాత సామాన్లతో పోల్చడమేంటన్న ఆగ్రహం
మరీ దారుణమైన విషయమేంటంటే.. రాజాసింగ్ కి సీనియర్లంటే కనీస గౌరవ మర్యాదలు లేదనీ.. అందుకు పాత సామాన్లతో పోల్చడమే ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు కొందరు కమలనాథులు. అయినా వాళ్లమైనా పనికిరాని వస్తువులా.. అలా బయట పడేయటానికని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఈ పాతకాపులు.
రాజా ప్రభావం గోషామహల్ కే పరిమితం అంటూ కొందరు లైట్
రాజాసింగ్ తనదైన శైలిలో నిప్పయితే రగిలించారు. కానీ రాష్ట్ర కార్యాలయంలో ఆ మంట ఏ మేరకు తగలబెడుతుంది.. అన్న చర్చోప చర్చలు చేస్తున్నారట. రాజాసింగ్ ఏమంత స్టేట్ లెవల్ లీడర్ కాదనీ. ఆయన మాటల ప్రభావం కేవలం గోషామహల్ కి మాత్రమే పరిమితమనీ.. అంటున్నారట. అలాంటి లీడర్ కామెంట్లకు ఇక్కడెవరూ నిక్కర్లు తడుపుకోవల్సిన పనే లేదని మరి కొందరు లైట్ తీస్కుంటున్నారట. అయితే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే.. రాజాసింగ్ చీకట్లో విసిరిన రాయి తగిలింది ఎవరికి? సీఎంలకి గులాం కొడుతోందెవరు? అన్నది ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారిందట. ఆ మాట కూడా అదే ఫ్లోలో రాజాసింగ్ అనేసి ఉంటే.. ఒక క్లారిటీ వచ్చి ఉండేదని కూడా మాట్లాడుకుంటున్నారట.. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో.
అధికార పార్టీలతో రహస్యంగా అంటకాగుతున్నదెవరు?
ఇప్పుడు అందరి డిబేట్ ఒకటే. సీఎంతో సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటున్నది ఎవరు? అధికార పార్టీలతో రహస్యంగా అంటకాగుతున్నదెవరు? తెలంగాణలో బీజేపీ పవర్ లోకి రాకుండా అడ్డుకుంటోంది ఎవరు? కేంద్ర బీజేపీ లక్ష్యాలను , తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతోన్నదెవరు? అనే సందేహాల తుట్టెను రాజా సింగ్ తట్టిలేపారనీ. రాజాసింగ్ పై చర్యలు తీసుకోడానికి బదులు..ఈ దిశగా వారిని ఐడెంటిఫై చేయాలని కోరుతున్నారు కొందరు రాజాసింగ్ సపోర్టర్స్. వీరిలా చేస్తే స్టేట్ లో బీజేపీ పవర్ లోకి ఎలా వస్తుందని రాజా విసిరిన ప్రశ్నాస్త్రం అంత మాములుది కాదనీ భావిస్తున్నారు కొందరు కమలనాథులు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెడుతుంటే ఈ గొడవేంటి?
అసెంబ్లీలో ఏకంగా అధికారానికి నిచ్చెనలు వేసిన కాషాయదళానికి.. భారీ ఎదురు దెబ్బ తగలడం.. లోక్ సభ ఎన్నికల్లో కాస్త ఊరటనిచ్చింది తెలిసిందే. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయబావుటా ఎగురవేసిందీ విధితమే. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని అందరూ భావిస్తుంటే.. రాజాసింగ్ చేసిన ఈ కామెంట్ల కాక.. కొత్త చర్చకు తెరలేపిందట. ఈ టైంలో రాజాసింగ్ ఇలా సొంత పార్టీ లీడర్లనే టార్గెట్ చేయడం కరెక్టేనా? అంటూ కొందరు రాజాసింగ్ పై గరం గరం అవుతున్నారట. మరి ఈ టైంలో.. రాజాపై చర్యలుంటాయా? లేక ఆయన టార్గెట్ చేసిన వారిని ఐడెంటిఫై చేస్తారా? తేలాల్సి ఉందంటున్నారు.
రాజా సింగ్ కామెంట్లకు అంత సీనుందా?
మొత్తం మీద గోషామహల్ ఎమ్మెల్యే ఘోష సొంత పార్టీలో చిచ్చు రగల్చగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకొక అస్త్రంగా మారినట్టు సమాచారం. ఎన్నిక ఏదైనా గెలుపు తమదేనని చెప్పుకు తిరిగే కాషాయ దళానికి.. రాజాసింగ్ దెబ్బ మాములుగా తగలడం లేదని గుసగుసలాడుతున్నారట. అయితే ఎంత లేదన్నా రాజా ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై పడే అవకాశం లేక పోలేదని అంచనా వేస్తున్నారట కొందరు. అయితే రాజా సింగ్ కామెంట్లకు అంత సీనుందా? లేదా తేలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందేనంటారు సగటు కాషాయ కార్యకర్తలు.