BJP: తెలంగాణలో ఏపీ ఫార్ములా వర్క్ అవ్వదా? ఏపీలో సమిష్టగా పని చేసిన కూటమి నేతలు అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు … ఆ స్థాయిలో తెలంగాణలో నేతలు పని చేయడం లేదా? జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బీజేపీ ఘోర పరాజయానికి కారణం అదేనా? ఆ క్రమంలో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన తెలంగాణలో ఏ విధంగా రాజకీయం చేయబోతున్నాయనేది హాట్ టాపిక్‌గా మారింది.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎన్డీఏ భాగస్వాయ్య పక్షాలుగా ఉన్న టీడీపీ ,జనసేన పార్టీలు కమలం పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించాయి. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. అదే కూటమిని తెలంగాణలోనూ కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలి అడుగు వేశారు. ఆపార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి ఇదే విషయం చెప్పారు. బీజేపీకి టీడీపీ, జనసేన మద్దతు తెలిపాయి. అయితే బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యాయి.
నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉంటే ఏ ఒక్క డివిజన్ లోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం చెప్పుకోదగిన ఓట్లను సైతం సాధించలేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లురాగా, ఈ ఉప ఎన్నికల్లో కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీ బరిలో దిగి డిపాజిట్ తెచ్చుకుంది. ఇప్పుడు కూటమితో వెళ్లి డిపాజిట్ కోల్పోవడం చర్చకు దారితీస్తోంది. గతం కంటే బైపోల్‌లో 8805 ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. దాంతో తెలంగాణలో ఏపీ స్ట్రాటజీ పనిచేయదనే టాక్ పార్టీ నేతల్లో నడుస్తోంది.
బీజేపీ ఈ ఫలితాలు ఎదుర్కోడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆంధ్రా సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరుల ఓటర్లు తమవైపు తిప్పుకోవడంతో కమలం పార్టీ నేతలు విఫలమయ్యారనే టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం టీడీపీ కేడర్ ను ఆకట్టుకునేలా అనేక ప్రయత్నాలు చేయగా…బీజేపీ నుంచి కనీస ప్రయత్నం కూడా జరగని విషయాన్ని ఎత్తిచూపుతున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇక ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పోటీపడిందని కూడా చెబుతున్నారు. కానీ, బీజేపీ మాత్రం టీడీపీ ఓటర్లకు దగ్గరయ్యే పని ఏదీ చేయకపోవడం వల్ల వారి ఓట్లను కోల్పోవాల్సివచ్చిందనే చర్చ రెండు పార్టీల నేతల్లో నడుస్తుందట.
కేంద్రంలో అటు ఏపీలో పొత్తుతో ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ తెలంగాణలో టీడీపీతో అనుబంధం కొనసాగించడానికి వెనుకాడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టీడీపీతో పొత్తు పెట్టుకుని పనిచేస్తే రాజకీయంగా వచ్చే విమర్శలకు ఎలాంటి సమాధానం చేప్పాలో అంతుపట్టక కాషాయ నేతలు సమతమతమవుతున్నారనే చర్చ ఉందట. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో వెళ్లిన పార్టీలు పరాజయం పాలయ్యాయి. దీంతో బీజేపీ టచ్ మీ నాట్ అనే ధోరణిలో టీడీపీ కేడర్‌తో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది.
తెలంగాణలో టీడీపీ విషయంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్లబోతుందనేది చర్చినీయంశంగా మారిందట. బైపోల్‌లో ఫలితం తర్వాత కమలం పార్టీ నేతలు రాబోయే స్థానిక సంస్థలు కావొచ్చు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీని దగ్గరకి తీసుకుంటురా…లేదా అనేది చర్చకు దారితీస్తుందట. టీడీపీ తెలంగాణలో సంస్థాగతంగా పటిష్టంగా లేకపోయినా…ఇప్పటకీ గ్రామాల్లోను, గ్రేటర్ పరిధిలోను, కొన్ని జిల్లాల్లో పార్టీకి నిర్ణయత్మక స్థాయిలో బలంగా ఉందనేది పొలిటికల్ విశ్లేషకులు చేప్పే మాట. అటు కేంద్రం, ఇటు ఏపీలోను టీడీపీతో కలిసి పని చేస్తున్న బీజేపీ…తెలంగాణలో మాత్రం టీడీపీని దూరం పెడితే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నష్టపోవాల్సి వస్తుందనే టాక్ నడుస్తుందట.
బైపోల్ రిజల్ట్‌తో మూడు పార్టీల పొత్తుపై ఆసక్తికర చర్చ నడుస్తుందట. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, నందమూరి సుహాసినితో పాటు పలువురు నేతలు పోటీకి ఆసక్తి చూపారట. అయితే చంద్రబాబు మాత్రం పోటీకి విముఖత చూపారు. బీజేపీ సైతం టీడీపీ నేతలను కలుపుకొని పోలేదని సమాచారం. ఈ పరిణామాలతో కూటమి నేతల్లోని అనైక్యత స్పష్టం కనిపించందనే చర్చ నడుస్తుందట…ఓటు బదాలాయింపులో మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఓటమిని చవిచూశారనే ప్రచారం జరుగుతుంది. ఏపీ రాజకీయలకు….తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల వేరు అనే చర్చ కమలం పార్టీ నేతల నుంచి వస్తుందట. అందుకే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీల విషయంలో అచితూచి వ్యవహారించాల్సి వస్తుందనే వాదన బీజేపీలో వినిపిస్తుందట.
తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా.. అసెంబ్లీ అయినా, స్థానిక , మున్సిపల్ ఎన్నికలు అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అనే టాక్ జోరుగా వినిపిస్తోంది. దీన్ని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతున్న పరిస్ధితి. అయితే జూబ్లీహిల్స్ అనుభవంతో బీజేపీ భవిష్యత్తులో అయినా తన విధానాన్ని సమీక్షించుకుంటే మంచిదని కొందరు సలహాలిస్తున్నారట. కానీ, టీ.బీజేపీ నేతలు ఏం ఆలోచిస్తున్నారనేదే అర్థం కావడం లేదని అంటున్నారట తెలుగు తుమ్ముళ్లు. మరి చూడాలి తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కమలనాథులు ఎప్పటికైనా తమ టార్గెట్ ఎలా రీచ్ అవుతారో?
Story by Apparao, Big Tv