India Pakistan War Update: బలూచిస్తాన్ బలం పుంజుకుంటోంది. భారత్ పాక్ ఉద్రిక్తతలు ఆ ప్రావిన్స్ కు కలిసి వస్తోంది. పాక్ కు గట్టి బుద్ధి చెప్పారంటూ పండగ చేసుకుంటున్నారు అక్కడి జనం. పాకిస్తాన్ పాలనలో దశాబ్దాలుగా దగా పడ్డామని, అత్యంత పేద ప్రావిన్స్ గా మిగిలిపోయిందన్న ఆవేదన బలూచ్ జనంలో ఉంది. కేవలం తమను అవసరాలకే వాడుకుంటున్న పాక్.. ఇక్కడ చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని అంటున్నారు. ఇక కథ మారిపోవాలంటున్నారు. ఎలాగైతే పాక్ విష కౌగిలి నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగిందో.. తమకూ అలాంటి విముక్తే కావాలని, అది భారత్ వల్లే సాధ్యమన్న నమ్మకంతో ఉన్నారు. ఇంతకీ ఇప్పుడు పాక్ ముక్కలు కావాల్సిందేనా? జరగబోయేదేంటి?
పెరిగిన బెలూచిస్తాన్ నిరసనలు
బలూచిస్తాన్ వాసులు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇదంతా చేయడానికి చాలా ఆవేదన ఉంది. చాలా ఆక్రందన ఉంది. తాము దగా పడ్డామన్న భావన ఉంది. తమ వనరులు, తమ శక్తి వాడుకుని వదిలేశారు తప్ప అభివృద్ధి చేయలేదన్న ఆవేశం బలూచిస్తానీల్లో ఉంది. అందుకే ఈ నిరసనలు, సంతోషాలు.
పేద ప్రావిన్స్‌గా ఉండిపోయిన బలూచిస్తాన్
ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ చూస్తుంటే పాకిస్తాన్ పరిస్థితి క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ లో అత్యంత పేద ప్రావిన్స్ గా బలూచిస్తాన్ ఉండిపోయింది. తమను పాక్ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారన్న ఆవేదన వారిలో ఉంది. అందుకే భారత్ దాడితో ఇక తమకు విముక్తి వస్తుందన్న ఉద్దేశంలో బలూచ్ వాసులున్నారు. ఎందుకంటే 1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. అప్పుడు కూడా పాక్ పాలకులు.. తమలో ఒక భాగంగా ఉన్న బంగ్లాదేశ్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దాంతో నిరసనలు ఎక్కువై.. చివరికి బంగ్లాదేశ్ వేరే దేశంగా అవతరించింది భారత్ సపోర్ట్ తో. ఇప్పుడు కూడా బలూచిస్తాన్ భారత్ పైనే ఆశలు పెట్టుకుంది. అయితే బంగ్లాదేశ్ విముక్తి సమయంలో పాకిస్తాన్ .. భారతీయులపై బెంగాలీలపై చేసిన అకృత్యాలను చూడలేక బలవంతంగా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో మాత్రం మన ప్రమేయం ఆ స్థాయిలో లేదు. అయినా సరే తమకు కొత్త ఉషోదయం వస్తుందన్న ఉద్దేశంతో బలూచ్ వాసులు ఉన్నారు.
పాక్ ఆర్మీ్కి, BLAకు అంతర్గత పోరు
తాజాగా కుచ్చి జిల్లాలోని మాచ్ ఏరియాలో బలూచిస్తాన్ లిబరేషన్ వేర్పాటు వాదులు పాకిస్తాన్ భద్రతా దళాల వాహనాన్ని IEDతో లక్ష్యం చేసుకున్నారు. ఈ పేలుడుతో ఆర్మీ వాహనంలో ఉన్న 12 మంది పాక్ రేంజర్లు చనిపోయారని, అందులో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ కూడా ఉన్నారని పాక్ ప్రకటించుకుంది. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వేర్పాటువాదుల్ని కూడా పాక్ సైన్యం హతమారుస్తూనే ఉంది. ఈ రక్తపాతం ఆగట్లేదు. పాక్ నుంచి వేరుపడుతాం అని పదే పదే డిమాండ్లు పెంచుతున్నారు. దీన్ని సహించలేని పాక్ పాలకులు.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనుక భారత్ ఉందని ఆరోపిస్తున్నారు. అక్కడ వేర్పాటు వాదాన్ని మనమే ప్రోత్సహిస్తున్నామంటున్నారు.
పాక్ భూభాగంలో 44 శాతం బెలూచిస్తాన్
2వేల సంవత్సరం నుంచి బలూచ్ ప్రజలు స్వయం నిర్ణయాధికారం కోసం, పాకిస్తాన్ నుంచి వేరుపడడం కోసం BLA హింసాత్మక పోరాటాన్ని ప్రారంభించింది. BLAను పాకిస్తాన్, UK, US ఉగ్రవాద సంస్థల లిస్టులో చేర్చాయి. బలూచ్‌లో ఎక్కువ మంది సున్నీ ముస్లింలు ఉన్నారు. బలూచిస్తాన్ లో మైదాన ప్రాంతం, అలాగే ఎడారి ప్రాంతం, పర్వతాలతో నిండిన ప్రాంతాలుగా ఉంది. అంతే కాదు.. పాకిస్తాన్ లో ఎక్కువ భాగం బలూచిస్తానే ఉంది. పాక్ భూభాగంలో 44 శాతం బెలూచిస్తాన్ ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న నాలుగు ప్రావిన్స్ లలో బలూచిస్తాన్ అతి పెద్దది. ఇది ఈశాన్యంలో ఖైబర్ పఖ్తుంఖ్వా, తూర్పున పంజాబ్, ఆగ్నేయంలో సింధ్ అనే పాక్ ప్రావిన్సులతో సరిహద్దులుగా ఉంది. ఇది పశ్చిమాన ఇరాన్ ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. సౌత్ లో అరేబియా సముద్రంతో సరిహద్దులుగా ఉంది.
పాక్‌లో బలూచ్ విలీనం చుట్టూ వివాదం
1947లో భారతదేశం విభజన తర్వాత, బలూచిస్థాన్ పాకిస్తాన్‌లో భాగమైంది. అలా ఏకపక్షంగా విలీనమే వివాదాస్పదమైంది. బలూచిస్థాన్‌లోని ఎక్కువ ప్రాంతాన్ని పాలించిన కలాత్ ఖాన్ ప్రారంభంలో స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించాడు. కానీ 1948లో పాకిస్తాన్‌లో చేరాలని ఒత్తిడి పెరగడంతో విలీనం తప్పలేదు. ఈ విలీనాన్ని చాలా మంది బలూచిస్థాన్ వాసులు బలవంతమైన చర్యగా భావించడంతో, వేర్పాటువాదానికి దారి తీసింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తిరుగుబాట్లు 1948-50, 1958-60, 1962-63, 1973-1977లో జరిగాయి. 2003లో ప్రారంభమైన తిరుగుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. సో పాకిస్తాన్ ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనన్న సంకేతాలు పంపుతోంది. ఇక వినేదే లేదు.. తగ్గేదేలేదంటోంది బలూచిస్తాన్.
బెలూచిస్తాన్‌లో ఎవరైనా అదృశ్యమయ్యారంటే మళ్లీ దొరకరు. దొరికినా ఆ శవాలను గుర్తు పట్టడం కూడా వీలు కాదు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ పన్నాగాలే. చాలా దారుణాలకు తెగబడుతుండడంతోనే బెలూచ్ వాసులు…, ఈ అరాచకాలు ఇక చాలు అనుకుంటున్నారు. అందుకే తిరగబడుతున్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? చైనా ఇన్వాల్వ్ అవుతుందా? పాక్ ముక్కలవ్వాల్సిందేనా?
పాకిస్తాన్‌లో ముదురుతున్న అంతర్గత సంక్షోభం
భారత్‌తో పాకిస్తాన్ యుద్ధం చేసేకంటే ముందే.. ఇంటిపోరును అధిగమించాల్సి ఉంది. ఎందుకంటే అంతర్గత సంక్షోభం ఓ స్థాయిలో ఉంది. ఇటు భారత్ తో యుద్ధం కంటే బలూచిస్తాన్ సహా ఇతర సమస్యల నుంచి బయటపడడం కీలకంగా ఉంది. సో పాక్ ఆర్మీ ఇంటిపోరుతోనే సతమతమవుతోంది. అలాంటప్పుడు ఎటాక్ చాలా కష్టమే. ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో ఏం జరగబోతోందన్నది చాలా కీ ఫ్యాక్టర్ గా మారింది. నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు వారిని సముదాయించడం పాక్ పాలకులకు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పుడు అలా కాదు. కథ కంప్లీట్ గా మారిపోయింది. బలూచిస్థాన్ విస్తీర్ణం పరంగా పాకిస్థాన్‌లోని అతిపెద్ద రాష్ట్రమే అయినా జనాభా పరంగా అతిచిన్నది. అందుకే పాక్ ఆర్మీ ఈ ప్రాంత జనంపై రెచ్చిపోతోంది.
బలూచ్‌లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రోగ్రామ్
బలూచిస్తాన్ విడిపోతామంటే ఓకే అనే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఎందుకంటే చైనా ప్రాయోజిత బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బలూచిస్తాన్ మీదుగానే వెళ్తోంది. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. CPECని ఆర్థిక వరంలా పాక్ చూస్తుండగా, స్థానికులకు ఉపయోగం చేయకుండా వనరులను దోపిడీ చేయడానికి మరొక ప్రయత్నంగా చాలా మంది బలూచ్ వాసులు దీన్ని చూస్తున్నారు. ఇటీవలి కాలంలో పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు, సిబ్బందిపై, ముఖ్యంగా చైనా జాతీయులపై దాడులు పెరిగాయి. CPECలో భాగమైన కీలక గ్వాదర్ ఓడరేవు బలూచిస్తాన్‌లోనే ఉంది.
పాక్ GDPలో బలూచ్ వాటా 3 శాతం కంటే తక్కువే
1970లలో పాక్ GDPలో బలూచిస్తాన్ వాటా 4.9 శాతం నుంచి ప్రస్తుతం 3 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇంతకంటే ఘోరం ఉంటుందా. దాంతో పాకిస్తాన్‌లోని అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటిగా బలూచ్ ఉండిపోయింది. పాకిస్తాన్‌లో అత్యధిక మరణాలు, పేదరికం, తక్కువ అక్షరాస్యత రేటును బలూచిస్తాన్ లోనే ఉంది. క్వెట్టాలో మూడింట ఒక వంతు ఇండ్లకే నీటి వసతి ఉందంటే అభివృద్ధి ఎంత తక్కువగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో ఆర్థికంగా వెనుకబడ్డ వారు, పేదవారిగా బలూచ్ వాసులు నిలిచిపోయారు. పాక్ మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో బలూచ్ వాటా కేవలం 5 శాతం మాత్రమే. ఎడారి వాతావరణం, అభివృద్ధి లేకపోవడం ఇవన్నీ సమస్యలను పెంచాయి. ఇంత చేస్తే బలూచిస్తాన్ లో బంగారం, వజ్రాలు, వెండి రాగి వంటి సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. కానీ ఏం లాభం? ఏదీ దగ్గరకు రాదు. అందుకే ఈ ప్రతిఘటనలు.
బెలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు
ఒక ఆందోళన చెలరేగితే.. వారిని చర్చలకు పిలవడమో.. శాంతియుత మార్గాల ద్వారానో, లేదంటే అభివృద్ధి చేసి చూపించి వారిని శాంత పరచాలి. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ రియాక్షన్ సైనిక చర్యతో ముడిపడి ఉండడం, అణచివేయడంతో మరింతగా ఆందోళనలు పెంచుతున్నారు బలూచ్ వాసులు. దీంతో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆవేదన ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం పాకిస్తాన్‌లో 2011 నుంచి 10 వేల మందికి పైగా బలూచ్‌లు అదృశ్యమయ్యారు. ఇంటి పోరును తగ్గించుకోని పాకిస్తాన్.. బలూచ్ వేర్పాటువాద గ్రూపులకు భారత్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తోంది. అయితే మనదేశం వాటిని ఖండించింది. కానీ అంతర్జాతీయ వేదికలలో బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రస్తావిస్తోంది.
అన్ని విషయాల్లో ఏకాకిగా మారిన పాక్
బలూచిస్తాన్ విషయంలో భారత్ మరో అడుగు ముందుకు వేస్తుందా.. అన్నది కీలకంగా మారింది. పాకిస్తాన్ కు ఉన్న అతిపెద్ద బలహీనత బలూచిస్తానే. రాజకీయ, సైనిక అవినీతి బలోచ్ సమాజాన్ని దోపిడీకి గురిచేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ చర్యలు, మరోవైపు భారత్ నుంచి వస్తున్న వార్నింగ్స్, ఇంకోవైపు అమెరికా సపోర్ట్ లేకపోవడం పాకిస్థాన్‌ను ఏకాకిని చేస్తున్నాయి. దీంతో పాక్ భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. బలోచిస్థాన్ సమస్య ఆ దేశ పరిస్థితిని మరింత పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో బలూచిస్తాన్ తన నియంత్రణలోనే ఉందని పాకిస్థాన్ సైన్యం నిరూపించుకోవాల్సి ఉంది. సింధూ జల ఒప్పందానికి భారత్ గుడ్ బై చెప్పడంతో పాకిస్థాన్ వద్ద తార్బేలా, మంగ్లా, చష్మా అనే మూడు నదుల్లోని నిల్వ సదుపాయాలు మాత్రమే మిగిలాయి. పరిమితమైన నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులు కేవలం 9.7 శాతం అవసరాలకే సరిపోతాయి.
Also Read: జగన్ అడ్డాలో టీడీపీ పండుగ
గతేడాది అంతర్జాతీయ ద్రవ్య నిధి అందించిన 7 బిలియన్ డాలర్ల సాయంతో పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖరీదైన ఆయుధ సామగ్రిని సమకూర్చుకోవాల్సి రావడం పాక్ కు ఆర్థికంగా పెను భారం. బలూచ్ విషయంలో ఇరాన్ కూడా పాకిస్థాన్ వైఖరిని తప్పు పడుతోంది. బలోచిస్థాన్‌లో సున్నీ వేర్పాటువాద సంస్థ అయిన జైష్ అల్ అద్ల్‌ను పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. ఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు 2023 డిసెంబరులో ఇరాన్‌లోని ఒక పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి 11 మంది పోలీసుల్ని హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా బలూచ్ విషయంపై భారత్ ను సంప్రదించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.