Operation Sindoor live updates| ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం బొక్కబోర్లా పడిపోయింది. బుధవారం అర్థరాత్రి తర్వాత భారత్‌లోని 15 కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడికి పాల్పడింది. ఈ స్థావరాల్లో అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, భటిండా, చండీగఢ్, నాల్, ఉదంపూర్, ఫలోడీ, అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, ఉత్తర్‌లాయ్, భుజ్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. అయితే భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి పాక్ దాడులను సమర్థంగా అడ్డుకుంది.
ఈ లొకేషన్లన్నీ మిలిటరీ స్థావరాలు, ఎయిర్ బేస్‌లు.. వీటిపై దాడి చేయడమంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించినట్లే. భారత అత్యాధునిక ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే తునాతునకలు చేసింది.
అనంతరం గురువారం మధ్యాహ్నం భారత్ ప్రతిదాడికి దిగింది. ఈ దాడుల్లో ఇస్లామాబాద్, సియాల్‌కోట్, లాహోర్, రావల్పిండిలపై భారత వాయు సైన్యం విరుచుకుపడింది. ముఖ్యంగా లాహోర్‌లోని పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా మేడ్ హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను భారత్ కు చెందిన హర్పీ కామికాజ్ డ్రోన్లు నేలకూల్చాయి. ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ కూడా ధృవీకరించింది.
లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ కూలిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన పాకిస్తాన్ సైన్యం.., బహవల్‌పూర్, గుర్జన్‌వాలా, చాక్వాల్, ఛోర్, రావల్పిండి, అతోక్, మియానో, కరాచీ, ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయని తెలిపింది. లాహోర్‌లో జరిగిన దాడుల్లో నలుగురు పాక్ సైనికులు గాయపడినట్టు, ఒక పౌరుడు మరణించినట్టు పేర్కొంది. భారత సైన్యం ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌ను వినియోగించి పాక్ క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా కూల్చేశాం’’ అని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడుల్లో పాక్ రాడార్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్టు తెలిపింది.
ఈ దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. గగనతలంలో దట్టమైన పొగ వ్యాపించిందని నివేదికలు వెలువడ్డాయి. యుద్ధ భయంతో సియాల్‌కోట్, కరాచీ, లాహోర్ సహా పలు విమానాశ్రయాలను పాకిస్తాన్ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. అమెరికా తన పౌరులకు పాక్‌ను తక్షణం విడిచి వెళ్లాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరిక జారీ చేసింది.
Also Read: యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రజలు ఇండియాను వ్యతిరేకించరు.. పాక్ ముస్లిం పెద్ద వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, భారత్ ఇస్లామాబాద్‌పై దాడులకు దిగిన సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం. పేలుళ్లతో నగరం కంపించడంతో సమీక్షను మధ్యలోనే నిలిపివేసి ఆయన బృందం సురక్షిత ప్రాంతానికి తరలించబడింది. అనంతరం షరీఫ్ నివాస పరిసరాలు ధ్వంసం కావడంతో, ఆయనను అత్యవసరంగా నగరానికి 25 కి.మీ. దూరంలో ఉన్న బంకర్‌కు తరలించినట్టు సమాచారం.
చైన ఆయుధాలే పాకిస్తాన్ కు దిక్కు.. అంతా డొల్ల
పాకిస్తాన్ గగనతల రక్షణ పూర్తిగా చైనా తయారీ ఆయుధాలపై ఆధారపడుతోంది. భారత్ ఇటీవల చేసిన వైమానిక దాడుల్లో లాహోర్, సియాల్‌కోట్‌లలో మోహరించిన హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–16 వంటి గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ వ్యవస్థలు ముందుగానే శత్రు క్షిపణులు, డ్రోన్లను గుర్తించి నాశనం చేయాల్సిన కీలక బాధ్యతను నిర్వర్తించలేకపోయాయి. ఇప్పటికే పాకిస్తాన్ వద్ద ఉన్న హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్‌డీ–2000, హెచ్‌క్యూ–16ఎఫ్‌ఈ వంటి వ్యవస్థలు చైనా నుంచే దిగుమతి చేయబడినవే. పైగా, వీటిలో సాంకేతిక లోపాలు, మెంటెనెన్స్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాకిస్తాన్ ఈ వ్యవస్థలను నవీకరించలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు నమ్మకంగా లేవని తాజా సంఘటనలు స్పష్టం చేశాయి.