మన కొడితే దెబ్బ ఎంతగట్టిగా ఉంటుందో అధికార పార్టీకి చూపిద్దాం..ఇదీ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే ఇచ్చే స్టేట్‌మెంట్. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన పెద్దగా బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. బడ్జెట్ సమావేశం రోజున మినహాయించి కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవటంతో గత ఏడాది కాలంగా బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు.
పార్టీ శ్రేణులు ఫాంహౌస్‌కి వెళ్లి కలిసినప్పుడు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం.. ఇక వస్తున్నా కాసుకోండి అంటూ హెచ్చరించడం.. ఆయన మాట్లాడే వీడియోను సదరు నేతలు సోషల్ మీడియాలో విడుదల చేయడం.. ఏడాదికాలంగా పరిపాటై పోయింది. కేసీఆర్ మాత్రం బయటకు వచ్చింది లేదు. తాజాగా.. మరోసారి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి డైలాగ్ వీడియో రిలీజ్ అయింది. ఫిబ్రవరి చివరిలో పెద్ద సభ పెడదాం.. కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నా.. నేను దెబ్బ కొడితే గట్టిగానే కొడతా అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో కేసీఆర్ ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని సెలవిచ్చారు.
కేసీఆర్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు సంతోషపడుతున్నప్పటికీ.. అదే సమయంలో వారిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. ఏడాది కాలంగా ఇలాంటి విమర్శలే చేస్తూ ప్రజాక్షేత్రానికి దూరమైన కేసీఆర్ ఈ సారైనా ఆయన చెప్పిన విధంగా ఫిబ్రవరి చివరిలో బయటకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగిస్తారా అన్న అనుమానం వేధిస్తుందంట. సొంత పార్టీ వారే ఆయనపై అంత అనుమాన పడుతుంటే.. మరోవైపు అధికారపక్షం నుంచి కేసీఆర్ వ్యాఖ్యలపై గట్టి రిటార్ట్‌లే పడుతున్నాయి.
కొడితే తాను మామూలుగా కొట్టనన్న KCR వ్యాఖ్యలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గట్టిగా కొట్టడం సంగతి అటుంచితే.. ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకోమని సీఎం రేవంత్ సలహా ఇచ్చారు. ట్విట్టర్లో లైకులు ఎక్కువగా వచ్చాయని KCR చెప్పుకుంటున్నారని, దీన్ని బట్టి ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: కేటీఆర్ ఫెయిల్.. మళ్లీ తెరపైకి కెసిఆర్, ప్రజల్లోకి వస్తారా.. లేక..?
అదలా ఉంటే కేసీఆర్ తాజా వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులే విశ్వసించడం లేదంట. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అంటూ గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్‌లో నుంచి ప్రకటనలు గుప్పించి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు.. అంతిమంగా పార్టీ క్యాడర్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి తప్ప మరెందుకూ పనికిరావడం లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు.. కేటీఆర్, హరీశ్ రావులు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ నేతలకు అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నారు. అయినా వారి మాటలను పట్టించుకోని కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
కేసీఆర్ వైఖరితో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుంది . అధికారం కోల్పోతే ఇక ప్రజలతో, పార్టీతో పనిలేదా అని గులాబీ శ్రేణులే చిర్రుబుర్రులాడుతున్నాయి. కనీసం అసెంబ్లీకి కూడా హాజరుకాకపోతుండటంతో ఇక కేసీఆర్ పనిఅయిపోయింది.. రాజకీయాల్లో యాక్టివ్ కావటం కష్టమేనన్న అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. దానికైనా కేసీఆర్ కట్టుబడి ఉంటారా లేదా అని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.