KCR Reentry Telangana Politics | తెలంగాణ రాజకీయాల్లో పదేళ్ల పాటు శాసించిన బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఒకప్పుడు చెప్పిందే వేదం.. కానీ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. అయితే, బిఆర్ఎస్‌గా పేరు మారిన తర్వాత ఈ పార్టీకి రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, బిఆర్ఎస్ ప్రతిపక్షపార్టీగా పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రతిపక్షంలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం పార్టీ నాయకత్వంగా కనిపిస్తోంది.
ఇంతకాలం పార్టీని నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, తన రాజకీయ వారసుడిగా కొడుకు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ను నిలిపే యత్నం చేస్తున్నారు. అయితే, బిఆర్ఎస్‌లో మరో ప్రధాన నాయకుడైన హరీష్ రావు కూడా పార్టీ కోసం కృషి చేస్తూ ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకున్నారు. మరోవైపు కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటూ రాజకీయంగా వెనుకంజ వేసింది. కేసులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని చూస్తే తెలుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం కోసం జనం దృష్టిని ఆకర్షించేందుకు నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు. ఈ కారణాలతోనే అధికారం చేపట్టి పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించారు.
Also Read: బీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న ఆ రెండు జిల్లాలు
కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిఆర్ఎస్ నాయకత్వం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ వైఫల్యాలకు కేటిఆర్, హరీష్ రావు, కవిత నాయకత్వ లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే, ఇటీవల బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ తిరిగి రాజకీయ రంగంలోకి దిగుతారని సంకేతాలు ఇస్తున్నారు. 2025 ప్రారంభం నుంచి కేసీఆర్ తిరిగి బహిరంగ సభలు, ఉద్యమాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారని సమాచారం.
బిఆర్ఎస్ కార్యకలాపాలను పునఃసమీక్షించేందుకు కేసీఆర్ కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు. మునుపటి ఎన్నికల్లో తప్పిదాలను సరిదిద్దుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న విధానాలను ప్రశ్నించడానికి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నారని బిఆర్ఎస్ నేతలు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో యువతకు పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ తాజాగా తన ఎర్రవెల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యి.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవకతవకలను ప్రజల ముందుకు తీసుకురావాలని సూచించారు. రైతులను సమీకరించి, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాలతో 2025లో బిఆర్ఎస్ కొత్త వ్యూహంతో ప్రజల మధ్యకి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసిఆర్ నాయకత్వంలో మరోసారి కొత్త కమిటీలు, బహిరంగ సభలు, ప్రజా ఉద్యమాలతో బిఆర్ఎస్ మళ్లీ తన ప్రభావాన్ని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ ప్రయత్రాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.