MLC Elections 2025: ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆ పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు బూస్టప్‌గా మారుతుందని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ దూకుడు పెంచుతున్నాయి. ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తూ ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు పక్కా వ్యూహరచనతో ముందుకెళ్తున్నాయి. ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు సార్లు ఏలిన గులాబీ పార్టీ మాత్రం చేతులెత్తేయం హాట్ టాపిక్‌గా తయారైంది.
కేవలం ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు అడపాదడపా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ గులాబీ శ్రేణులలో జోష్ ను నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ, పోటీకి దూరం కావడం పలు చర్చలకు దారితీస్తుంది. బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉన్నందున గులాబీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఓటమి భయంతోనే పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతుంది. మొత్తమ్మీద పోటీకి దూరమవ్వాలన్న నిర్ణయం గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకి బీఆర్ఎస్ నుండి ముఖ్య నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ దిశగా ఆశావాహులు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హై కమాండ్ మౌనంగా ఉండడంతో నాయకులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలై ఈనెల 3వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థలలో సరైన బలం లేకపోవడంతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్న అపవాదును బీఆర్ఎస్ మూటగట్టుకుంది. దాంతో ఈ ఎన్నికలలో తమకు ఓటమి ఖాయమని ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన గులాబీబాస్ దానిపై నోరు మెదపడం లేదంట.
Also Read: టీ – కాంగ్రెస్ అలర్ట్.. అసలు పార్టీలో ఏం జరుగుతోంది..?
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నాలుగు జిల్లాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారంట. ఈనెల 10న నామినేషన్ లకు చివరి తేదీ కావడం.. కేవలం గంటల వ్యవధి మిగిలి ఉన్నా హై కమాండ్ స్పందించకపోవడంతో.. ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారట. కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ రవీందర్ సింగ్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజారాం యాదవ్, వీరితోపాటు మరో ఇద్దరు ముఖ్య నాయకులు పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీగా పుట్టి.. బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్నాక ఆ పార్టీకి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ లో అధికారం చేయి జారడం, పార్లమెంటు ఎన్నికల్లో ఖాతా తెరవక పోవడం మధ్యలో జరిగిన ఎమ్మెల్సీ , కంట్రోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం సన్నగిల్లడంతో రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు … ఏది ఏమైనప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటమి భయంతో దూరం అయిందా? లేకపోతే బీజేపీతో లోపాయికారీ ఒప్పందమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.