తెలంగాణ ఆర్టీసి ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (twu) కూటమిని ఓడించారు. తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కూటమి 5వేల మెజారిటీ గెలుపొందినట్టు తేలింది.
దీనిపై ఇంకా క్లారిటీ రిజల్టు రావాల్సి ఉంది. ఈనెల 17న అధికారికంగా ఫలితాలను వెల్లడిస్తారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి ఈయూ అనుబంధం సంఘం. దీనిపై సీపీఐ హర్షం వక్తం చేసింది. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లైనా కార్మికుల సమస్యలపై స్పందించలేదనే వ్యతిరేకత ఆర్టీసీ కార్మికుల్లో ఉంది.
సమ్మె సమయంలో కూడా సర్కార్ సమస్యలు తీర్చకపోగా.. పెండింగ్‌లోనే పెట్టిందనే అసంతృప్తి ఉంది. దీనికి తోడు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియపైనా కాలయాపన జరుగుతూ వస్తోంది. దీంతో ఈ ఎన్నికల ద్వారానైనా ప్రభుత్వానికి తమ అభీష్టాన్ని తెలియజేసి.. గెలుపు ద్వారా ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయినట్టున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 115 ఆర్టీసీ డిపోల్లో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి ఎన్నికలో 95 శాతం మంది కార్మికులు తమ ఓటును వినియోగించుకున్నారు. స్వయంగా ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు తెలిపిన టీడబ్లుయూ సంఘాన్ని గెలిపించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేశారు. అయినా అనుకున్న ఫలితాలు రాలేదు.
లోకల్ రీజియన్‌లో మాత్రం ప్రభుత్వం మద్దతు తెలిపిన కూటమి గెలిచింది. రాష్ట్ర స్థాయిలో ఈయూ గెలవడంతో పూర్తిగా అది బలమైన ప్రతిపక్ష పాత్రే పోషించనుంది. త్వరలో ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉంది. సమ్మెకు కూడా దిగేందుకు వెనుకాడబోమని నేతలు ఇప్పట్నుంచే ప్రకటించుకుంటున్నారు.
దీంతో సర్కార్‌కు ఇది గుదిబండలా మారే పరిస్థితులు లేకపోలేదు. మొన్న సమ్మెకు పోయిన నేపథ్యంలోనే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఓ డ్రైవర్ చనిపోవడంతో ఇది మరింత తీవ్రమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని .. ఈ సమ్మెను విరమింపజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడంలో విఫలమయ్యారు.
ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కూడా ప్రతికూలంగా రావడంతో ఆర్టీసీని కంట్రోల్ చేయడం ప్రభుత్వం చేతుల్లోంచి వెళ్లిపోయినట్టేనని భావించాలి. అయితే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా.. దీనిపై బీఆరెస్ మౌనంగానే ఉంది. తమ పాలనలో ఈ యూనియన్లను రద్దు చేసిన నేపథ్యం ఉండటంతో మళ్లీ ఆ పాత గాయాలను గెలుక్కున్నట్టువుతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది.