Indian Recruits: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో బాంబుల మోత… నిమిష నిమిషానికి ప్రాణభయం. ఇలాంటి నరకంలోకి మన దేశ యువకులు నెట్టబడుతున్నారు. సెక్యూరిటీ గార్డులు, ఆర్మీ హెల్పర్లు అంటూ ప్రైవేట్ ఏజెంట్లు ఎర వేసిన మాయమాటలు నమ్మి దాదాపు 259 మంది భారతీయులు రష్యా సాయుధ దళాల్లో చేరారు. తీరా అక్కడికి వెళ్లాక సాధారణ ఉద్యోగాలు కాదు… ఏకంగా తుపాకీ చేతికిచ్చి ముందంజలో యుద్ధం చేయిస్తున్న ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 51 మంది భారతీయులు ఈ పోరులో ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భారత ప్రభుత్వం స్పందన..
ఈ దారుణంపై భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రష్యా ప్రభుత్వంతో వరుస దౌత్య చర్చలు జరిపి… ఇప్పటివరకు 139 మంది భారతీయులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే, ఇప్పటికీ మరో 69 మంది మనవాళ్లు అక్కడి ఆర్మీలోనే చిక్కుకుపోగా… వారి ఆచూకీ కనిపెట్టి, ఎలాగైనా వెనక్కి రప్పించేందుకు విదేశాంగ శాఖ రష్యాతో ముమ్మర సంప్రదింపులు జరుపుతోంది.
విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరిక
డబ్బు ఆశతో ప్రాణాలను పణంగా పెట్టవద్దని విదేశాంగ శాఖ ఖచ్చితంగా చెబుతోంది. ఆర్మీ ఉద్యోగాలైనా, భారీ జీతాల ఆఫర్లు వచ్చినా సరే… రష్యాకు వెళ్లే సాహసం చేయవద్దు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకుండా, కేవలం ప్రభుత్వం గుర్తించిన మార్గాల ద్వారానే విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలని కేంద్రం స్పష్టం చేస్తోంది.
Also Read: మల్కారం క్వారీలో విషాదం.. ఈతకోసం వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!