KCR: తెలంగాణాలో నీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.. నీటి కేటాయింపులు, హక్కుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చుకుని రాజకీయంగా పుంజుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ తగిన కార్యచరణను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్ని ఈ అంశం ఎంత వరకు కదిలిస్తుందన్నది సస్పెన్స్ గా మారింది.
సాధారణంగా నీటి సమస్యలు ఉధృతంగా ఉన్న సమయంలో చేసే పోరాటాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నీటి పోరాటానికి ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశాలు అంతంత మాత్రమే. అయినా గులాబీ పార్టీ నీటి అజెండాను ఎత్తుకోవడం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం కనిపిస్తోందంటున్నారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్ట్ లను బదిలీ చేయడం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నిధులు, కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలను లేవనెత్తుతూ తెలంగాణా ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్.
వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌కి తెలంగాణా నీటి వాటాలు అనే అంశం ఆయుధంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఉద్యమ సమయంలో తాము నీళ్ల కోసమే పోరాటం చేశామని పదే పదే గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ఏపీకి, మరో వైపు కేంద్రానికి లొంగిపోతుందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇక ఇదే అంశంతో క్షేత్ర స్థాయిలో తమ కేడర్ లో ఉత్సాహం నింపవచ్చని కేసీఆర్ భావిస్తున్నారట..
గతంలో కేసీఆర్ మాటలు తూటాల్లా పేలేవి.. ఆయన మాట్లాడితే రాజకీయం మారిపోయేది. కేసీఆర్ తన మాటల మంత్రాంగంతో పరిస్థితులను మార్చేసేవారు. కానీ ఇప్పుడాయన మాట్లాడితే ఆయన మాటల్లో అంత మ్యాటర్ లేదన్న టాక్ వినిపిస్తోంది.. కొన్ని నెలల క్రితం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ మాట్లాడిన విషయాలను ఎవరూ అంతగా పట్టించుకోలేదట.. అసలు ఆ సభ జరిగిందన్న విషయాన్నే మర్చిపోయారట.. అయినా కూడా పార్టీని గాడిలో పెట్టాలి కాబట్టి కేసీఆర్ ఈ నీటి ఉద్యమాన్ని అజెండాగా మార్చుకున్నారంట.
ఇటీవల బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. నీటి ప్రాజెక్ట్ ల సందర్శనలు, క్షేత్ర స్థాయి పోరాటాలతో ప్రజలను నమ్మించగలిగితేనే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారట.. లేదంటే బీఆర్ఎస్ ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఒక క్లారిటీ వచ్చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇప్పటికే కేసీఆర్ మాటల పవర్ తో రాజకీయాలను మార్చే రోజులు పోయాయని, నీటి ఉద్యమాలపై కూడా ప్రజలు నమ్మె పరిస్థితి పోతే ఇక బీఆర్ఎస్ ఉనికే కష్టమవుతుందని ఆ పార్టీ శ్రేణుల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయట.
Story by: Ajay, Big Tv