Cancer Drug Prices: స్వేచ్ఛ బ్యూరో: క్యాన్సర్ మందులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై మార్జిన్ ను గరిష్టంగా 30శాతానికి పరిమితం చేసింది. ఈ మార్జిన్ పరిమితి వర్తించే క్యాన్సర్ మందుల జాబితాను త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు సుప్రీం కోర్టుకు తెలియచేసింది. దాంతో ఏటా క్యాన్సర్ రోగులై రెండున్నర వేల కోట్ల రూపాయల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి అదేశాలు..
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిన బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న రోగులను కొన్ని ఫార్మా కంపెనీలు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయంటూ కొన్నిరోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైఏ విషయం తెలిసిందే. 170 నుంచి 700 శాతం మార్జిన్ పై క్యాన్సర్ మందులను విక్రయిస్తున్నట్టు పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు క్యాన్సర్ మందులను అంతంత మార్జిన్ తో విక్రయించటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తీసుకున్న చర్యల గురించి న్యాయస్థానానికి తెలియచేయాలని స్పష్టం చేసింది.
కేంద్రం కీలక నిర్ణయం..
ఈ క్రమంలో కేంద్రం క్యాన్సర్ మందుల ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలియచేసిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 30శాతం వాణిజ్య మార్జిన్ వర్తించే క్యాన్సర్ మందుల జాబితాను త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు పేర్కొన్నారు. మార్కెట్ పరిణామాలు, ప్రజారోగ్య అవసరాల ప్రాతిపదికన తక్కువ ధర ఉన్న మందులను మినహాయించి మిగిలిన వాటిని ఈ జాబితాలో క్రమానుగతంగా చేరుస్తామని చెప్పారు. కాగా, కేవలం క్యాన్సర్ మందులకే పరిమితం కాకుండా ఫార్మాస్యూటికల్ మార్కెట్ అంతటికీ దీనిని వర్తించేలా చూడాలని ఇప్పటికే సుప్రీం కోటు తెలిపింది. ఈ కేసులో ఈనెల 27న మరోసారి విచారణ జరగనుంది.
Also Read: ఓట్ చోరీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మోదీ, షాపై ఫైర్