BIG TV LIVE Originals: మన దగ్గర పెళ్లి వయసు వచ్చినా చేసుకోకపోతే.. పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్? అంటూ ఎగతాళి చేస్తాం. కానీ, డెన్మార్క్ లో పెళ్లికాని వారికి విచిత్ర సన్మానాలు చేస్తుంటారు. 25 ఏళ్లు నిండినా ఇంకా పెళ్లి కాని వారికి విచిత్రమైన సన్మానం చేస్తారు. సదరు యువతి లేదంటే యువకుడిని స్నేహితులు, కుటుంబ సభ్యులు కుర్చీకి లేదంటే కరెంటు స్తంభానికి లేదంటే చెట్టుకు కట్టేసి దాల్చిన చెక్క పొడి చల్లుతారు! ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది.
ఇంతకీ ఏంటీ దాల్చిన చెక్క సంప్రదాయం?
25 ఏళ్ల వయసు ఉన్న అవివాహితులకు డెన్మార్క్ లో దాల్చిన చెక్క పొడి చల్లే సంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వారిని స్తంభానికి కట్టేసి ఒక్కొక్కరు పిడికెడు దాల్చిన చెక్క పొడిని చల్లుతారు. మసాలా దినుసులతో ముంచేస్తారు. అందరూ ఆహ్లాదంగా నవ్వుతూ ఈ వేడుక జరుపుతారు. ఒంటరి జీవితాన్ని ఎగతాళి చేస్తూ ఇలా చేస్తారు. ఒకళే 30 సంవత్సరాల వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోకపోతే, ఆ సంప్రదాయం మరింత ఘాటుగా మారుతుంది. ఈసారి ఏకంగా కారం లేదంటే, మిర్యాల పొడి చల్లుతారు. కొన్నిసార్లు కోడిగుడ్లు కూడా విసురుతారు.
ఈ సంప్రదాయం ఎలా వచ్చింది?
డెన్మార్క్ లో ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. దీని వెనుక ఓ చారిత్రక నేపథ్యం ఉంది. సుగంధ ద్రవ్యాల వ్యాపారులు చాలా కాలం క్రితం దాల్చిన చెక్క, మిరియాలు లాంటి సుగంధ ద్రవ్యాలను అమ్ముతూ చాలా దూరం ప్రయాణించేవారు. చాలామంది వారి సంచార జీవనశైలి కారణంగా ఒంటరిగా ఉండేవారు. కాలక్రమేణా, 25 సంవత్సరాల వయస్సులో ఒంటరిగా ఉండటం వల్ల వారిని పెళ్లి వైపు ఆలోచించేలా వారిని కట్టేసి దాల్చిన చెక్క పొడి చల్లి పెళ్లి చేసుకోమని చెప్పేవారు. 30 ఏళ్ల వరకు చేసుకోపోతే, ఘాటైన మిర్యాల పౌడర్ చల్లేవారు. ఈ ఆచారం 1960లలో మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ అక్కడ సజీవంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.
ఈ వేడుకలు ఎలా జరుపుతారంటే?
పెళ్లి కాని యువతీ, యువకుల 25వ పుట్టిన రోజున స్నేహితులు, కుటుంబ సభ్యులు దాల్చిన చెక్క పౌడర్ తో రెడీగా ఉంటారు. వారిని ఏదైనా స్తంభానికి గట్టిగా కట్టేసి దాల్చిన పౌడర్ విసురుతారు. ఒంటరి జీవితం గురించి జోక్ చేస్తూ పొడి చల్లుతూ ఎంజాయ్ చేస్తారు. 30 ఏళ్ల వయసులో ఉన్నా పెళ్లి చేసుకోకపోతే, ఘాటైన మిరియాల పొడి, గుడ్లు విసురుతారు. చాలా మంది 25 ఏళ్ల వయస్సు వారు ఈ సరదా వేడుక కోసం ఎదురు చూస్తారు. కొందరు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ చారిత్రక వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు యూత్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అదే సమయంలో తాము సింగిల్ గా ఉన్నామనే సిగ్నల్ కూడా ఇస్తారు. ఒకవేళ మీరు కూడా డెన్మార్క్ లో ఉంటే 25 ఏళ్ల లోపు చేతికి రింగ్ ఉండేలా చూసుకోండి. లేదంటే మీకూ దాల్చిన చెక్క సన్మానం తప్పదు!
Read Also: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.