Rs.100 crore Drugs Seized: రేషన్ బియ్యానికికే కాదు.. కాకినాడ పోర్టు డ్రగ్స్‌కు అడ్డంగా మారిందా? తెలంగాణలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ వెనుక మూలాలు ఏపీలో బయటపడుతున్నాయా? తెలంగాణ పోలీసులు సీజ్ చేసిన లారీ ఏపీలోని ఓ రాజకీయ నేతకి చెందినదా? కాకినాడ నుంచి ముంబైకి ఈ డ్రగ్స్ తీసుకెళ్లడం వెనుక ఎవరున్నారు? గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయా? అవుననే అంటున్నారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి ప్రాంతంలోని అంతరాష్ట్ర చెక్ పోస్టు ఉంది. భారీ ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, డీఆర్ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ టీమ్‌లు కలిసి ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నాయి.
పోలీసుల చెకింగ్ విషయాన్ని ముందుగా పసిగట్టి లారీని అక్కడి వదిలి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. అందులో చెక్ చేయగా దాదాపు 100 కోట్ల విలువైన డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్స్‌ను ఏపీలోని కాకినాడ నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చివరకు లారీని సీజ్ చేసి చిరాగ్‌పల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
డ్రగ్స్‌పై ఇంకాస్త లోతుగా విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఈ మాదక ద్రవ్యాలను కాకినాడ పోర్టు నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లారీ ఎవరిది అన్న దానిపై లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. ఏపీలోని ఓ వైసీపీ నేతకు చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: బాయ్‌ఫ్రెండ్‌తో తల్లి నిద్రిస్తుండగా తుపాకీతో కాల్చిన పిల్లాడు.. ప్రమాదవశాత్తు జరిగిందన్న పోలీసులు!
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేషన్ మాఫియాను పట్టుకునేందుకు కాకినాడ పోర్టుకి వెళ్లారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న షిప్‌ను అడ్డుకుని వాటిని సీజ్ చేశారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్.. పోలీసు, పోర్టు అధికారులను ప్రశ్నించారు. రేషన్ బియ్యమే కాకుండా డ్రగ్స్, గంజాయి వంటివి స్మగ్లింగ్ చేసే అవకాశముందని హెచ్చరించారు.
లేటెస్ట్‌గా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పట్టుబడిన డ్రగ్స్ కూడా కాకినాడ పోర్టు నుంచి ముంబైకి తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టులో ఇటీవల సెక్యూరిటీ గట్టిగా మొహరించడంతో రోడ్డు రవాణాను ఆశ్రయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనివెనుక రాజకీయ నేతల హస్తమున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి అధికారుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.