AP CM Progress Report: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత-పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 16 నెలలుగా ఈ కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సూచించారు. పొదుపు చర్యల్లో భాగంగా దీనికి సంబంధించి ఈసారి ఆన్‌లైన్‌లో రివ్యూ చేశారు. అదేవిధంగా.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. అక్కడ.. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి వ్యర్ధాలు సేకరిస్తున్న స్వచ్ఛరథం డ్రైవర్ నవగపు ప్రసాదరావుతో మాట్లాడారు. సార్టింగ్ కన్వేయర్ సిస్టమ్ దగ్గర పనిచేస్తున్న సిబ్బందితోనూ మాట్లాడారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారైన ఉత్పత్తులను పరిశీలించారు.
నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని కూడా సీఎం తిలకించారు. తన మనసుకు దగ్గరైన నాలుగు కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూల స్తంభాలని తెలిపారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళనే తన జీవితాశయమని స్పష్టం చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఇక.. ఐటీడీఏల ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ దగ్గర గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్ కోటును కొనుగోలు చేసి ధరించారు. సముద్ర తీరప్రాంతాల్లో పెంచే సీవీడ్ సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులకు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్‌ను చూసి అభినందించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. AMCAతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీలోని ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేశారు. మిసైళ్లు, హ్యాండ్ గ్రేనేడ్, ఆధునిక తుపాకులు, ప్రోటో టైప్ ఫైటర్ జెట్ లాంటి రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. పుట్టపర్తి పర్యటనలో.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భగవాన్ సత్యసాయిబాబా ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయి కుల్వంత్ హాలులోని సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
అమరావతిలోని క్యాంప్ ఆఫీసులో ఈ వారం పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి 306 కోట్లకు పైగా పరిహారం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగోసారి పరిహారం అందించింది. దాదాపు 30 వేల మంది నిర్వాసితులకు 2,250 కోట్ల పరిహారం చెల్లించారు. అదే విధంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలలో నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల తాళాలను సీఎం అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62 ఎకరాలు, ల్యాండ్ టూ ల్యాండ్ కింద 520 ఎకరాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. నిర్వాసితులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామన్నారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు చంద్రబాబు.
Also Read: భూమి కింద ఉండే వింత నగరం.. ఇక్కడ ఇళ్లు, చర్చిలు అన్నీ భూగర్భంలోనే!
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ వారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనపై కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శుద్ధ ఇంధన రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా క్యాబినెట్ చర్యలు తీసుకుంది. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడుల ఆమోదంపై చర్చించింది. కర్నూలు విమానాశ్రయం పీపీపీ మోడల్‌లో అభివృద్ధి ప్రతిపాదన చర్చకు వచ్చింది. సాగునీటి కాల్వల విస్తరణ, రోడ్లు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలపైనా చర్చించారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. MSMEలకు నిధుల సౌలభ్యానికి ప్రత్యేక ఏర్పాటుపై చర్చించింది.
ఈ వారం వివిధ శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై.. సీఎం చంద్రబాబు ఈ వారం సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి ఏపీ సొంత రెవెన్యూ ఆదాయం లక్షా 10 వేల కోట్లకు పైగా నమోదైంది. ఇందులో.. జీఎస్టీ నుంచి 33 వేల 679 కోట్లు, గనుల శాఖ నుంచి 10 వేల 300 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 11 వేల 47 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి లక్షా 27 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
15 శాతం వృద్ధి రేటు సాధించి స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వారం ప్రణాళిక శాఖపై రివ్యూ చేసిన సీఎం.. ఇకపై జీఎస్డీపీ అంచనాలను రియల్‌టైమ్ మానిటరింగ్ ద్వారా రూపొందించేలా ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుడతామన్నారు. జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్, ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సర్వేలు, కేపీఐల ఆడిటింగ్ లింక్ లాంటి అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రతీ నెలా, ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో ట్రాక్ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. జీఎస్డీపీ విధానాన్ని అర్థం చేసుకునేలా, అంచనాలు వేగంగా రూపొందించేలా అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-ఏపీలో నియంత్రణా వ్యవస్థపై ఈ వారం రివ్యూ చేశారు. సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వాడకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ అతిపెద్ద ఆర్థిక నేరంగా మారిందని సీఎం దృష్టికి తెచ్చారు. ఏపీలో ఇప్పటి వరకూ సైబర్, ఆర్థిక నేరాల్లో 652 కోట్ల మేర కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం- బ్యాంకర్లతో కలిసి 116 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడగలిగారు. ఫిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్ము కోల్పోతున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో.. వాటి నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు కూడా సైబర్ నేరాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
Also Read: ఏంట్రా బాబూ ఈ వింత? చెట్లకు వేలాడే బొమ్మల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసమే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని తెలిపారు.
ఈ వారం వివిధ శాఖల పనితీరుపై చేసిన రివ్యూలో సీఎం కీలక సూచనలు చేశారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో నిత్యం తనిఖీలు చేపట్టాలన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. తప్పు చేయాలంటేనే నేరస్థులు భయపడేలా పోలీసింగ్ ఉండాలని మరోసారి స్పష్టం చేశారు సీఎం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలన్నారు.
వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించేలా రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్లమీద గుంతలు కనపడకూడదన్నారు సీఎం. కొన్ని జిల్లాల్లో బస్సులకు డ్యాష్ క్యామ్‌లు పెట్టి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారని చెప్పారు. టెక్నాలజీపరంగా పెద్ద ఎత్తున పరిశోధన చేపట్టేలా ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. పరిపాలనలో ముందస్తు ప్రణాళిక, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అస్సాంలో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అస్సాం ముఖ్యమంత్రికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అస్సాం, ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా
సభా ప్రాంగణంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో సంభాషించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లతో పాటు నిధుల కేటాయింపులపై చర్చించారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. 2027 గోదావరి పుష్కరాల లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం అందించాలని కోరారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, హర్ ఖేత్ కో పానీ ప్రోగ్రామ్‌లో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ, ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులకు 285 కోట్లు విడుదల చేయాలని కోరారు.
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ బిజినెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సీఐఐతో తనకు దశాబ్దాల కాలంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్, టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే అంశాలపైనే గట్టి పోటీ నెలకొందన్నారు. వీటిని అందిపుచ్చుకున్న దేశాలే అగ్రగామిగా నిలుస్తాయని చంద్రబాబు విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ అగ్రస్థానానికి చేరుకునేందుకు.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు. టెలికాం డీరెగ్యులేషన్.. ఓపెన్ స్కై పాలసీ.. విద్యుత్ సంస్కరణల వంటి విప్లవాత్మక మార్పులు దేశంలో ఎన్నో ఆవిష్కరణలకు దారితీశాయన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండటం వల్ల పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఏపీ ఇప్పటికే ప్రోజ్యూమర్ విధానాన్ని పాటిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. సోలార్ రూఫ్ టాప్స్ ద్వారా ప్రజలే విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని.. మైక్రో గ్రిడ్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గిస్తున్నామని చెప్పారు.
ఏపీలో 20 లక్షల మంది రైతులు.. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల భూసారం పెరగడమే కాకుండా.. ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ లభిస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీ.. బయో గ్యాస్.. ఇథనాల్.. ఈవీ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని.. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రధాని ప్రకటించిన 8 అంశాల నేషనల్ మిషన్ గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి ఇల్లు, ప్రతి పొలం, ప్రతి పరిశ్రమ ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ స్వయం సమృద్ధిని సాధించాలని కోరారు. భారత్ ఇక అన్‌స్టాపబుల్ అని.. త్వరలోనే గ్లోబల్ జెయింట్‌గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read:జుట్టు చూస్తే ట్రంప్.. రూపం చూస్తే దున్నపోతు.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వింత జీవి!
Story by: Anup, Big Tv