E-Paper
Advertisement

China Population Crisis: వన్ చైల్డ్ నుంచి నో చైల్డ్ దాకా.. చైనా యువత ఎందుకు వెనకడుగు వేస్తోంది?

China Population Crisis: వన్ చైల్డ్ నుంచి నో చైల్డ్ దాకా.. చైనా యువత ఎందుకు వెనకడుగు వేస్తోంది?

China Population Crisis: పుట్టేవాళ్లు తక్కువైపోయారు.. చనిపోయేవాళ్లు ఎక్కువైపోయారు. ఫలితంగా.. చైనాలో కొన్నేళ్లుగా జనాభా క్షీణిస్తూ వస్తోంది. అక్కడ జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. గ్రాండ్ ఓల్డ్ చైనా.. ఇప్పుడు ఓల్డ్ పీపుల్‌కి గ్రౌండ్‌గా మారుతోందా? జిన్ పింగ్ ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా.. పరిస్థితులు మార్పు ఎందుకు రావట్లేదు?

జననాలు తగ్గి, మరణాలు పెరిగి… చైనాలో జనాభా అలారం

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదీ అంటే.. ఒకప్పుడు అంతా ఠక్కున చెప్పే ఆన్సర్.. చైనా. కానీ.. ఇప్పుడది మారింది. జనాభా విషయంలో చైనాని.. భారత్ రీప్లేస్ చేసేసింది. జనాభా తగ్గడం దాకా ఓకే. కానీ.. తగ్గుతూ పోతూ ఉంటే? ఇదే.. ఇప్పుడు చైనాని తెగ టెన్షన్ పెట్టేస్తోంది. ఆ దేశంలో జనాభా తగ్గుదల క్రమంగా క్రైసిస్‌గా మారుతోంది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా చైనాలో జనాభా తగ్గింది. పదేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే.. 2025లో దాదాపు కోటి మేర జనాభా తగ్గుదల నమోదైంది. చైనా ప్రభుత్వ డేటా ప్రకారం.. ఆ దేశ జననాల రేటు కూడా వెయ్యి మందికి 5.63కి పడిపోయింది. ఇది.. 1949లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రికార్డు స్థాయిలో కనిష్ఠం. ఇదే సమయంలో.. చైనాలో మరణాల రేటు వెయ్యికి 8 మందికి పెరిగింది. 1968 తర్వాత ఇదే అత్యధికం. 2025 చివరి నాటికి చైనా జనాభా దాదాపు 34 లక్షలు తగ్గి.. 140.4 కోట్లకు చేరుకుంది. చైనాలో గతేడాది 79 లక్షల 20 వేల మంది శిశువులు జన్మించారు. 2024తో పోలిస్తే.. 16 లక్షల మేర తగ్గింది. గతేడాది.. చైనాలో కోటీ 13 లక్షల మంది చనిపోయారు. గడిచిన ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం.

రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా బర్త్ రేటు..

చైనాలో ఇప్పుడు జననాల కంటే మరణాలే ఎక్కువ నమోదవుతున్నాయ్. 2025లో ఆ దేశంలో బర్త్ రేటు ఏకంగా 17 శాతం పడిపోయింది. ఇది ప్రతికూల అంశమని.. అక్కడి ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే.. చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. దశాబ్దాల పాటు వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేయడం వల్లే.. ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. క్రమంగా వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల చైనా ప్రభుత్వం.. యువత పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనాలని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం.. వన్ చైల్డ్ పాలసీని సైతం రద్దు చేసింది. దాని స్థానంలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది. అయినా.. జననాల రేటు పెరగకపోవడంతో 2021లో ఒక జంట ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తామని ప్రకటించారు.

యువత పెళ్లిళ్లకు దూరం.. చైనా జనాభా సమీకరణాలు మారుతున్నాయా?

కొన్నేళ్లుగా చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలోనూ భారీగా తగ్గుదల నమోదవుతోంది. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు 61 లక్షలు మాత్రమే! 2023తో పోలిస్తే 20 శాతం తగ్గాయ్. గత 45 ఏళ్లలో ఇదే అత్యల్పం కూడా! చైనా వ్యాప్తంగా.. పదేళ్లుగా పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతూనే వస్తోంది. 2025లో మాత్రం చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. చైనాలో జననాలు భారీగా తగ్గడానికి మరో వింత రీజన్ తెరమీదికొచ్చింది. అదే.. స్నేక్ ఇయర్! చైనా క్యాలెండర్ ప్రకారం.. 2025 వుడ్ స్నేక్ నామ సంవత్సరం. ఇలా సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం వేళ ఏళ్ల నాటి సంప్రదాయం. 12 ఏళ్లకు 12 జంతువుల పేర్లు ఉంటాయి. అలా.. పాము పేరిట వచ్చే ఏడాదిలో.. పిల్లల్ని కనేందుకు అనువైనది కాదనేది చైనీయుల నమ్మకం. ఈ కారణంగా.. 2025లో జననాల రేటు బాగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటం చైనా నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ వృద్ధుల సంఖ్య 32 కోట్లు దాటేసి చాలా కాలమైంది. మొత్తం జనాభాలో ఇది 23 శాతం!

ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు జనాభా సవాల్

ఏళ్లు గడుస్తున్నకొద్దీ.. వృద్ధుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే వస్తోంది. ఇదే సమయంలో.. పనిచేసే వయసు వారి సంఖ్యలోనూ తగ్గుదల నమోదవుతోంది. 2035 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 40 కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయ్. కార్మికుల లభ్యత భారీగా తగ్గుతుండటంతో.. రిటైర్మెంట్ వయసుని పురుషులకు 63 ఏళ్లకు, మహిళలకు 58 ఏళ్లకు పెంచేసింది చైనా ప్రభుత్వం. ఏదేమైనా.. చైనా జనాభా తగ్గుముఖం పడుతూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితి నిపుణులు అంచనా వేస్తున్నారు. 2100 సంవత్సరం నాటికి ఆ దేశం ప్రస్తుత జనాభాలో సగానికి పైగా కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన.. 2011 నాటికి చైనా జనాభా 63 కోట్లకు పడిపోతుంది. దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడిలా పాపులేషన్ క్రైసిస్‌లో ఇరుక్కోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తగ్గుతున్న జనాభా ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై.. ఆర్థిక, సామాజిక ప్రభావం చూపుతుంది. ఇప్పటికే శ్రామిక శక్తి తగ్గిపోయింది. దాంతో డబ్బు ఖర్చు పెట్టడం కూడా తగ్గిపోతుంది. చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నారు. తమను తాము చూసుకోవాల్సిన వారు, ప్రభుత్వ చెల్లింపులపై ఆధారపడాల్సిన వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు.. పెన్షన్ ఫండ్ సైతం క్షీణిస్తోంది. పెరుగుతున్న వృద్ధుల జనాభా సంక్షేమానికి తగినంత నిధులను సృష్టించడానికి చైనా దగ్గర తగిన సమయం కూడా లేదని చెబుతున్నారు.

వన్ చైల్డ్ నుంచి నో చైల్డ్ దాకా…

జనాభా నియంత్రణ కోసం.. దశాబ్దాల పాటు చైనా అనుసరించిన రూల్స్, వన్ చైల్డ్ పాలసీనే.. ఈ పరిస్థితి కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనేందుకు వీల్లేదనే నిబంధనని.. 1980 నుంచి డ్రాగన్ ప్రభుత్వం అత్యంత కఠినంగా అమలు చేసింది. జనాభా తగ్గిపోతుండటంతో.. పదేళ్ల క్రితమే ఈ నిబంధనని ఎత్తేసింది. అయినా లాభం లేదు. చైనా పబ్లిక్ ఎక్కువ మంది పిల్లల్ని కనట్లేదు. అసలు.. అక్కడి యువత.. పిల్లల్ని కనడంపై ఎందుకు ఆసక్తి చూపట్లేదు?

చైనా జనాభా సంక్షోభం.. డ్రాగన్ దేశం వణికుతోంది..

ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న చైనాకు.. సొంత జనాభానే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోయింది. నాలుగేళ్లుగా జననాల కంటే మరణాల సంఖ్య కోట్లలో ఉంటుండటం.. బీజింగ్‌ని వణికిస్తోంది. పిల్లల్ని కనడం దేశభక్తి అని జిన్‌పింగ్ పిలుపునిచ్చినా.. కండోమ్‌లపై ఏకంగా 13 శాతం పన్ను వేసి పడగొట్టినా.. చైనా యువత మాత్రం పెళ్లిళ్లు చేసుకొని, పిల్లల్ని కని, వారిని పెంచడం.. తమ వల్ల కాదని, ఆర్థికంగా బలంగా లేమని తేల్చి చెప్పేస్తున్నారు. ఫలితంగా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు వెలుగొందిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. 1949 తర్వాత ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోవడంతో.. జనాభా సంక్షోభం ముదురుతోంది.

జనాభాని పెంచేందుకు చైన ప్రభుత్వం చేపట్టిన చర్యలు

జనాభాని పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యల్ని చేపట్టింది. ఒక్కో కాన్పుకు 3600 యువాన్లు ఇస్తామని ప్రకటించింది. ప్రతి పిల్లాడి పెంపకం కోసం ఏటా కొంత నగదు ఇస్తామంటోంది. కొన్ని ప్రావిన్సులు అదనపు నగదు ప్రోత్సాహకాలు, ఎక్కువ ప్రసూతి సెలవులు కూడా ఇస్తున్నాయి. అయినా సరే.. పిల్లల్ని కనేందుకు జనం ఆసక్తి చూపట్లేదు. ఇలా కాదని.. కండోమ్‌ల వాడకాన్ని తగ్గించే చర్యలకు దిగింది చైనా. అంతేకాదు.. కండోమ్‌లతో పాటు గర్భ నిరోధక మాత్రలపైనా ఎడాపెడా పన్నులు వేసింది. ఇదే నెలలో మరో 13 శాతం పన్నుల్ని పెంచింది. డే కేర్ సెంటర్లు, కేజీ స్కూళ్లకు కూడా పన్ను మినహాయింపుల లాంటి చర్యలకు దిగింది. అయినప్పటికీ.. జనాభా పెరుగుదలలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. పైగా.. ఈ విధానాలు వివాదాలకు దారితీస్తున్నాయ్. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, ఇతర పరికరాలపై అధిక పన్నులతో.. అనుకోని గర్భధారణలు, హెచ్ఐవీ కేసులు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం

ఏ దేశంలోనైనా జనాభా పెరగాలంటే మహిళల సగటు సంతాన సాఫల్య రేటు 2.1 కంటే మించి ఉండాలి. కానీ.. చైనాలో 2020 నాటికే 1.3కి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశాలలో చైనా ఒకటి. దీంతో పాటు తైవాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి తూర్పు ఆసియా దేశాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం.. పిల్లల్ని కనే విషయంలో ఆసక్తి లేకపోవడమే! ఇందుకు.. పిల్లల పెంపకం వ్యవహారం ఖరీదుగా మారడమే కారణం. 18 ఏళ్ల దాకా చదువు, ఇతర సౌకర్యాలు కల్పనకు.. సరాసరి 76 వేల డాలర్లు ఖర్చు అవుతున్నట్లు అంచనాలున్నాయ్. దీనికితోడు జీవన వ్యయం పెరగడం, భరించలేని ఒత్తిళ్ల మధ్య జనం అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని కని పెంచడం తమ వల్ల కాదని.. చైనీయులు చేతులెత్తేస్తున్నారు. చాలా మంది యూత్ అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు. వీలైనంత కాలం.. సింగిల్‌గానే మిగిలిపోతామంటున్నారు.

చైనాలో జనన రేటు తగ్గుదల.. ఆర్థిక భారమా, స్వేచ్ఛా కోరికా?

చైనాలో పిల్లల్ని పెంచడమనేది ఓ భారీ ఆర్థిక భారంగా మారింది. పిల్లల్ని పెంచడం అత్యంత ఖరీదైన దేశాల్లో.. చైనా కూడా ఒకటని రిపోర్టులు చెబుతున్నాయ్. పిల్లల గురించి నిత్యం ఆందోళన చెందకుండా, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడపాలనే కోరికతో పాటు అనేక అంశాలు జననాల రేటు తగ్గడానికి కారణంగా కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా పని చేసే యువశక్తి తగ్గిపోవడం చైనా ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారింది. 2035 నాటికి చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 40 కోట్లకు చేరుతుందని అంచనాలున్నాయ్. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి.. చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పిల్లల్ని కనేవారికి నగదు బహుమతులు, సెలవులు ప్రకటిస్తున్నప్పటికీ.. పెరిగిన ఖర్చులతో పోలిస్తే అవి చాలా తక్కువనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దశాబ్దాల పాటు పిల్లల్ని ఎక్కువగా కనొద్దని కఠినంగా చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమని చెబుతోంది. కానీ.. సమాజంలో వచ్చిన మార్పులు, ఆర్థిక భారాలతో.. చైనా యువత పిల్లలు లేని జీవితమే సుఖమనే నిర్ణయానికి వచ్చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చైనాలో పని చేసే చేతులు తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగి.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×