BigTV English

China Vs America Space War: అంతరిక్షంలో యుద్ధం..! చైనా వద్ద యుద్ద ఉపగ్రహాలు.. అమెరికాపై దండయాత్ర షురూ!

China Vs America Space War: అంతరిక్షంలో యుద్ధం..! చైనా వద్ద యుద్ద ఉపగ్రహాలు.. అమెరికాపై దండయాత్ర షురూ!

అమెరికా-చైనా నడుమ అంతరిక్ష యుద్ధం..?

వెండితెరపై అద్భుతమైన గ్రాఫిక్స్‌తో అత్యున్నత స్థాయిలో కనిపించే స్టార్ వార్స్ గురించి అందరికీ తెలుసు. అయితే, రియల్ లైఫ్‌లో కూడా స్పేస్ వార్ జమానా వచ్చినట్లు ఉంది. అంతర్జాతీయ పరిణామాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి కూడా. అగ్రరాజ్యాల మధ్య అంతరిక్షంలో జరగబోయే యుద్ధాలకు పాదులు పడినట్లే కనిపిస్తోంది. అమెరికా చైనా నడుమ అంతరిక్ష యుద్ధం మొదలైందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. అగ్రదేశం అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోంది. అంతరీక్ష పరిశోధనా కార్యక్రమాల్లో అమెరికాను సవాలు చేస్తోంది. భూమిపై అన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా, పోటీగా డ్రాగన్ దేశం పనిచేస్తోంది. ఐటీ, టెక్నాలజీ, ఆర్థిక, మేధో పరిజ్ఞానంలో అమెరికాను క్రాస్ చేసే కార్యక్రమాలు చేపడుతోంది.


చైనా కక్ష్యలో యుద్ధానికి సిద్ధంగా ఉపగ్రహ కదలికలు

రెండు దేశాల మధ్య వైరుధ్యాలతో ఆకాశమే హద్దుగా పోటీ శృతిమించిపోతోంది. అంతరిక్షంలో సోవియట్ యూనియన్ ఆధిక్యత అంతరించిన తర్వాత అమెరికా ఆధిక్యత కొనసాగుతోంది. అయితే, దాన్ని కట్టడి చేయడానికి అంతరిక్షంలో అమెరికాకు ధీటుగా చైనా స్పేస్ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ బ్రేకింగ్ రిపోర్ట్‌ను యూఎస్ డిఫెన్స్ అధికారులు బయటపెట్టారు. దీని ప్రకారం, అమెరికా ప్రత్యర్థి దేశాలు తమ అంతరిక్ష పోరాట సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటున్నాయని.. చైనా కక్ష్యలో యుద్ధానికి సిద్ధంగా ఉపగ్రహ కదలికలున్నాయని యుఎస్ స్పేస్ ఫోర్స్ తెలిపింది. వీటిని స్పేస్‌లో “డాగ్‌ఫైటింగ్”గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

దళాలను నిర్వహించడం, శిక్షణ ఇవ్వడం…

యుఎస్ స్పేస్ ఫోర్స్ అనేది అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను కాపాడటానికి దళాలను నిర్వహించడం, శిక్షణ ఇవ్వడం, యుద్ధానికి సన్నద్ధం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించే సైనిక శాఖ. దీన్ని 2019లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థాపించారు. చైనా, రష్యా వంటి అమెరికా ప్రత్యర్థుల నుండి అంతరిక్ష ఆధారిత ముప్పులను ఎదుర్కోవడానికి ఈ ఫోర్స్ ప్రత్యేకంగా పనిచేస్తోంది. అయితే, యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ ఇటీవల మెక్‌అలీస్‌లో నిర్వహించిన వార్షిక రక్షణ కార్యక్రమాల సమావేశంలో మాట్లాడినప్పుడు ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అంతరిక్షంలో సమన్వయంతో కూడిన కదలికలను ప్రదర్శిస్తున్న ఐదు చైనా ఉపగ్రహాల తీరు చూస్తుంటే అధునాతన సైనిక వ్యూహాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. చైనా చేస్తున్న ఆపరేషన్ గురించి కూడా జనరల్ గుట్లీన్ వివరించారు.

ఒకదానిని ఒకటి నియంత్రించుకుంటూ…

చైనా కక్ష్యలో.. కొన్ని వస్తువులు, ఒకదానిని ఒకటి నియంత్రించుకుంటూ.. ఒక సింక్రనైజ్డ్ ప్యాట్రన్‌లో కదులుతున్నట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ గమనించింది. ఇది ఎలా ఉందంటే.. ఈ ఉపగ్రహాలు యుద్ధం కోసం కక్ష్యలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించిందని జనరల్ గుట్లీన్ వెల్లడించారు. “అంతరిక్షంలో ఐదు వేర్వేరు వస్తువులు ఒకదానికొకటి లోపలికి, బయటకీ కదులుతున్నాయనీ.. రెండు కుక్కలు దాడికి ముందు ఒకదాని చుట్టూ ఒకటి గుడ్రంగా తిరుగుతూ.. ఒకదాన్ని ఒకటి నియంత్రించుకుంటూ కదిలినట్లు.. ఈ శాటిలైట్లు కూడా దాడికి రెడీ అవ్వడానికి మొహరించినట్లు కనిపిస్తున్నాయని గుట్లీన్ పేర్కొన్నారు. అందుకే, దీనిని అంతరిక్షంలో డాగ్‌ఫైటింగ్‌గా పిలుస్తున్నారు. ఇందులో భాగంగా.. ఒక ఉపగ్రహం నుండి మరొక ఉపగ్రహానికి కక్ష్యలో అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి చైనా ప్రత్యేక వ్యూహాలను రెడీ చేస్తున్నట్లు గుట్లీన్ పేర్కొన్నారు.

2024లో భూమి దిగువ కక్ష్యలో షియాన్-24C..

2024లో భూమి దిగువ కక్ష్యలో షియాన్-24C, షిజియన్-6 05A/B ఉపగ్రహాలతో చైనా కొన్ని కార్యకలాపాలు నిర్వహించినట్లు, జనరల్ గుట్లీన్ ధృవీకరించారు. మూడు షియాన్-24C ప్రయోగాత్మక ఉపగ్రహాలు, రెండు చైనీస్ ప్రయోగాత్మక స్పేస్ ఆబ్జెక్ట్‌లు, షిజియన్-6 05A/Bలతో కూడిన ప్రాక్సిమిటీ ఆపరేషన్ల సిరీస్‌ను చైనా నిర్వహించిందని తెలిపారు. వీటిని తక్కువ భూమి కక్ష్యలో గమనించినట్లు తెలుస్తోంది. వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ పరిశీలనలు జరిగినట్లు.. గుట్లీన్, బ్రేకింగ్ డిఫెన్స్‌కు రాసిన ఒక ఇమెయిల్‌లో పేర్కొన్నారు.

త్రీ-స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రాక్సిమిటీ ఆపరేషన్‌

కాగా.. కొలరాడోలోని అంతరిక్ష పర్యవేక్షణ సంస్థ లియోలాబ్స్ కూడా.. చైనా చేస్తున్న కార్యకలాపాలను ధృవీకరించింది. రష్యన్ అంతరిక్ష నౌక ద్వారా జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాలను.. ముఖ్యంగా, త్రీ-స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రాక్సిమిటీ ఆపరేషన్‌ను గుర్తించింది. రష్యన్లు ఈ త్రీ-స్పేస్‌క్రాఫ్ట్ RPO మధ్యలో ఉన్నట్లు” లియోలాబ్స్ ప్రతినిధి బ్రేకింగ్ డిఫెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

చైనా ఉపగ్రహాలు జియోసింక్రోనస్ కక్ష్యలో..

అయితే, అమెరికాకు చెక్ పెట్టే దిశగా.. చైనా, రష్యాలు తమ అంతరిక్ష సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటున్నాయని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. ఉపగ్రహాలు గతంలో దగ్గరగా కదిలినప్పటికీ, ఒకేసారి పలు ఉపగ్రహాలను సమన్వయం చేయడం ఒక పెద్ద ముందడుగుగా పరిగణిస్తున్నారు. చైనా ఉపగ్రహాలు జియోసింక్రోనస్ కక్ష్యలో అమెరికా ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయని కూడా నివేదికలు చెబుతున్నాయి. సాంకేతిక ప్రయోజనాలు తగ్గుతున్నందున అమెరికా స్పేస్ ఫోర్స్ వీటి మరింత పరిశీలించాల్సిన ఉందని గుట్లీన్ వెల్లడించారు.

డిఫెన్స్‌ను బలోపేతం చేసే దిశగా అమెరికా

ఈ ఉపగ్రహాలను సమన్వయం చేసే సామర్థ్యం సాంకేతికతలో ఒక కొత్త పరిణామంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితి అంతరిక్షంలో పెరుగుతున్న ముప్పులను మరింత ఎక్కువ చేస్తున్నట్లు అమెరికా భావిస్తోంది. చైనా భూకక్ష్యలో చేస్తున్న కార్యకలాపాలను నిరోధించడానికి.. అవసరమైతే, ఈ దిశగా చైనాను ఓడించడానికి.. అమెరికా స్పేస్ ఫోర్స్ తన డిఫెన్స్‌ను బలోపేతం చేస్తుందని జనరల్ గుట్లీన్ వెల్లడించారు.

ఒకప్పుడు అంతరిక్షంలో సోవియట్ యూనియన్‌కు, అమెరికాకు మధ్య పోటీ

ప్రస్తుతం, అంతరిక్షంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు అంతరిక్షంలో సోవియట్ యూనియన్‌కు అమెరికాకు మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. తర్వాత కాలంలో సోవియట్ పతనం తర్వాత.. అమెరికాకు ప్రత్యర్థిగా చైనా రంగంలోకి దిగింది. అప్పటి వరకూ స్పేస్ టెక్నాలజీలో అమెరికాకు.. ఇతర అగ్రదేశాలకు మధ్య సామర్థ్యంలో గ్యాప్ ఉండేది. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ సాంకేతిక పురోగతిలో చాలా ముందుంది. చైనా, రష్యాలు కూడా ఆ స్థాయిని చేరుకోడానికి విఫల ప్రయత్నాలు చేశాయి.

గణనీయంగా తగ్గుతూ వస్తున్న సామర్థ్య అంతరం

అయితే, ప్రస్తుతం ఆ సామర్థ్య అంతరం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అమెరికాకు పోటీగా చైనా టెక్నాలజీని పరుగులు పెట్టిస్తోంది. ఈ నేపధ్యంలో.. అన్ని రంగాల్లోనూ అమెరికా తన దృష్టిని మార్చుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించే స్థాయి నుండి ఇప్పుడు డిఫెన్స్‌ను డెవలప్ చేసుకోవాలనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు, అంతరిక్షంలో డాగ్‌ఫైట్‌కు చైనా, అమెరికాలు అన్నీ సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.

వ్యక్తిగత యూనిట్లుగా విడిపోయే ‘నెస్టింగ్ డాల్’ ఉపగ్రహాలు

ఇటీవల అమెరికా తమ పరిశీలనలో చైనా కక్ష్యలో.. వ్యక్తిగత యూనిట్లుగా విడిపోయే రెండు ‘నెస్టింగ్ డాల్’ ఉపగ్రహాలను చూసినట్లు పేర్కొంది. వీటికి అమెరికా స్పేస్ షిప్‌ను నీడలా వెంటాడే సామర్థ్యం ఉందనీ.. అలాగే, ఈ ఉపగ్రహాల్లో దాడి చేయడాని వీలుగా గ్రాప్లింగ్ ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, అంతరిక్షంలో దాడులు చేయడం కోసం రష్యా ఇటీవల అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడాన్ని కూడా అమెరికా ఎత్తి చూపుతోంది. అందుకే, అమెరికా తన సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని పదే పదే చర్చిస్తోంది. గతేడాది, రష్యా.. అంతరిక్షంలో ప్రమాదకరమైన అణ్వాయుధ పోటీని నిరోధించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని వీటో చేసింది. కాగా, ఈ పరిణామం తర్వాత రష్యా ఏదో భయంకరమైన విశ్వ ఉద్రిక్తతకు సిద్ధమవుతుందనే భయాలు వచ్చాయి.

1967లో అమెరికా-రష్యాతో కూడిన అంతర్జాతీయ ఒప్పందం

1967లో అమెరికా-రష్యాతో కూడిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. అంతరిక్షంలో అణ్వాయుధాలను, ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేయవద్దని, మోహరించవద్దని తీర్మానించారు. అన్ని దేశాలనూ కోరిన ఈ తీర్మానంతో అలాంటి కార్యక్రమాలను నిషేధించాలని ఒప్పందం విజ్ఞప్తి చేసింది. అయితే, రష్యా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. దీనికి చైనా గైర్హాజరైంది. అయితే, 13 ఇతర దేశాల మద్దతు ఉన్నప్పటికీ రష్యా వీటోతో ఈ తీర్మానం ఆమోదించబడలేదు.

అమెరికాపై ‘ఎలాంటి యుద్ధం’ అయినా చేస్తామన్న చైనా

అయితే, ప్రస్తుతం అమెరికా ప్రత్యర్థులైన చైనా, రష్యాలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా.. పెద్దమనిషి ఒప్పందానికి వ్యతిరేకంగా ముందుకెళ్లడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇక, ఈ నెల ప్రారంభంలో, డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికాబద్ధమైన సుంకాలపై రేగిన తీవ్ర వివాదాల మధ్య.. అమెరికాపై ‘ఎలాంటి యుద్ధం’ అయినా చేస్తామని చైనా బెదిరించిన తర్వాత.. చైనా తన రక్షణ వ్యయాన్ని 7.2% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపధ్యంలో.. చైనా-అమెరికాలు రాబోయే యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

2025 ఆర్థిక ఏడాదికి, $29.6 బిలియన్ల యూఎస్ బడ్జెట్‌

నానాటికీ ఎక్కువ అవుతున్న ముప్పులు వల్ల.. అంతరిక్షంలో అమెరికా ఉనికిని బలోపేతం చేయడానికి యూఎస్ స్పేస్ ఫోర్స్ పిలుపునిచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరానికి, $29.6 బిలియన్ల బడ్జెట్‌ అవసరం ఉందని స్పేస్ ఫోర్స్ అభ్యర్థించింది. ఇది గత సంవత్సరం కంటే $690 మిలియన్ల ఎక్కువగా ఉంది. ప్రత్యర్థి దేశాల్లో పెరుగుతున్న సామర్థ్యాలను ఎదుర్కోగల సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి.. ఈ నిధులు చాలా ముఖ్యమైనవిగా స్పేస్ ఫోర్స్ పేర్కొంటోంది.

18 ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా

ఇక, శాటిలైట్ విన్యాసాల ద్వారా చైనా తన వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడమే కాకుండా.. మొత్తం అంతరిక్ష ఉనికిలో కూడా దూకుడును పెంచడంపై అమెరికా నిఘా పెంచింది. 2023లో, ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ టెక్నాలజీకి పోటీగా.. చైనా ప్రతిష్టాత్మకమైన “థౌజండ్ సెయిల్స్” ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రాజెక్ట్‌‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 18 ఉపగ్రహాలను ప్రయోగించింది. అలాగే, చైనా తన స్పేస్ స్టేషన్ పరిమాణాన్ని కూడా రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ఇతర దేశాల ఉపగ్రహాలను బందీలుగా చేసే చైనా

అయితే, ప్రస్తుత పరిణామాలతో చాలా చిక్కులు వచ్చేలా ఉన్నాయి. చైనా ఉపగ్రహాలు ఏదో ఒక రోజు అనూహ్యంగా, అమెరికా లేదా దాని అనుబంధ అంతరిక్ష వ్యవస్థలపై దాడి చేయొచ్చనే సందేహాలు పెరిగాయి. ఎందుకంటే, ఇప్పటికే.. చైనా ఉపగ్రహాలు, ఇతర దేశాల ఉపగ్రహాలను బందీలుగా ఉంచే.. అంటే, వాటి కార్యకలాపాలను నియంత్రిచగల గ్రాప్లింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసి, ప్రదర్శించింది. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి.. అమెరికా ఉపగ్రహాలు సేకరించే కీలకమైన డేటాను పంపకుండా చైనా నిరోధించవచ్చనే ఆందోళన కూడా ఉంది.

2019లో రష్యా “నెస్టింగ్ డాల్ ” వ్యూహం మాదిరి ప్లాన్

ఇక, రష్యా అభివృద్ధి చేస్తున్న సామర్థ్యాలలో కూడా ఇలాంటి పురోగతులను అమెరికా గుర్తించింది. ఇది సమస్యను మరింత క్లిష్టతరం చేయడానికి అవకాశం ఉంది. 2019లో రష్యా “నెస్టింగ్ డాల్ ” వ్యూహాన్ని ప్రదర్శించింది. ఇందులో, ఒక ఉపగ్రహం అమెరికా ఉపగ్రహాలను ట్రాక్ చేయడానికి ఒక చిన్న క్రాఫ్ట్‌ను మోహరించింది. అయితే, ఇలాంటి టెక్నాలజీని అమెరికా ఇప్పటి వరకూ అడ్డుకోలేకపోయింది. కాబట్టి, ఈ పరిస్థితి, అంతరిక్షంలో భవిష్యత్తులో రాబోయే యుద్ధంలో అమెరికా సైన్యం సంసిద్ధత ఎంతుందనే ప్రశ్నలను లేవనెత్తుతుంది.

అమెరికా అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి చర్యలు

ప్రస్తుతం, చైనా, రష్యా వంటి దేశాలు శాటిలైట్ టెక్నాలజీ, వాటి కార్యాచరణ సామర్థ్యాలను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా తన అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి పెడుతోంది. తన ప్రత్యర్థులను అరికట్టడానికి.. దాడి సామర్థ్యాలు పెంచుకోడానికీ.. బహుముఖ వ్యూహంతో స్పందించడానికి అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటోంది. అందులోనూ.. అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు నిస్సందేహంగా సవాళ్లతో నిండిపోయింది. అగ్ర దేశాల మధ్య పోటీతో పాటు అనూహ్య పరిణామాల నేపథ్యంలో.. సాంకేతిక ఆవిష్కరణ, సైనిక సంసిద్ధతలో ముందంజలో ఉండేలా చూసుకోవడం అత్యవసరంగా మారింది.

సవాళ్లతో కూడిన అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు

దీని ద్వారా అమెరికాకు పెరుగుతున్న ఆపదలను నావిగేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ గుట్లీన్ చెప్పినట్లుగా… అమెరికా తన అంతరిక్ష సామర్థ్యాలకు సంబంధించి కీలకమైన దశలో ఉంది. పెరుగుతున్న పోటీదారులు.. అంతరిక్ష రంగంలో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో… అమెరికా తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం, ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అలాగే, ఇన్నోవేషన్లను పెంచాలి. పలు కీలక రంగాల్లో భద్రతకు మరింత వేగవంతమైన విధానం ప్లాన్ చేయాల్సి ఉంది.

 

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×