Vittal Reddy Vs NarayanaRao Patel: మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్దరికి అసలు పడటం లేదంట.. నారాయణరావు రాజకీయాలకు అంటీ ముట్టనట్లు ఉంటూ ఎన్నికలకు నెల రోజులు ముందే కాంగ్రెస్ కండువా కప్పుకొని అసెంబ్లీ ఎన్నికలలో ముధోల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు .. విఠల్‌రెడ్డి కారు గుర్తుపై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల ముందు హస్తం గూటికి చేరారు .. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆ ఇద్దరూ చెరో రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినవారే .. అలాంటి వారి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ముధోల్ కాంగ్రెస్ క్యాడర్ పార్టీ ఫ్యూచర్‌పై బెంగ పెట్టుకుంటోందంట.
ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావుపటేల్, విఠల్‌రెడ్డి
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావుపటేల్, విఠల్‌రెడ్డిలకు అస్సలు పడటం లేదట.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది . అయినా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగే సమయంలో ఇద్దరు నేతల అనుచరగణం మధ్య సఖ్యత లేక తరచు గొడవలు పడుతుంటారు .. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య గొడవతో అది కాస్తా రసాభాస అయింది.
బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయంపాలై విఠల్‌రెడ్డి
ఆ క్రమంలో ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయం నారాయణరావు పటేల్ వర్సెస్ విఠల్ రెడ్డి అన్నట్లుగా కొనసాగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికలలో నారాయణరావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, విఠల్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్‌గా నారాయణరావు పటేల్ కొనసాగుతున్నారు. విఠల్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నారాయణరావు పటేల్ 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారి, ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొని కారు గుర్తుపై పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు.
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నారాయణరావు
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉన్న నారాయణరావు పటేల్ తర్వాత ఇతర పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. చాలాకాలం తర్వాత మళ్లీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ముధోల్ టికెట్ దక్కించుకుని మరోసారి ఓటమి చవిచూశారు. తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న పలు మార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి మంత్రిగా పనిచేశారు. విట్టల్ రెడ్డి మొదట బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నెల రోజులు తిరగకముందే గులాబీ పార్టీలో చేరి 2018లో రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Also Read: జగన్‌కి బుగ్గన హ్యాండ్?
మాజీ ఎమ్మెల్యేల తీరుతో క్యాడర్‌కు కొత్త చిక్కులు
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విఠల్‌రెడ్డి, గత ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. అయితే తాజాగా వీరిద్దరి తీరు క్యాడర్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందంట. ఈ ఇద్దరు నేతల తీరు కారణంగా కార్యకర్తలు ఏదైనా సమస్య వస్తే ఎవర్ని కలవాలో కూడా తెలియక సతమతమవుతున్నారంట. ఓ మాజీ ఎమ్మెల్యే కొన్ని కండిషన్స్ పెడుతుంటారంట. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే క్యాడర్‌ని కలుస్తారంట. సాయంత్రం 6 దాటితే చాలు ఇంటి మెయిన్ గేట్ మూసివేస్తారంట
మంత్రుల పర్యటనల సందర్భంగా జన సమీకరణల విఫలం
మరో మాజీ ఎమ్మెల్యే తమ పాత క్యాడర్ కు మాత్రమే అందుబాటులో ఉండి, మిగతా కేడర్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారంట. గతంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కల పర్యటనల సందర్భంగా జన సమీకరణ చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నప్పటికీ, తాను వేరే ఊర్లో ఉన్నట్టు సీన్ క్రియేట్ చేశారట. తాను స్థానికంగా లేనని తప్పించుకోవడానికి చూడగా, సదరు మాజీ ఎమ్మెల్యే స్థానికంగానే ఉన్నట్లు క్యాడర్ చెప్పడంతో మంత్రులు అవాక్కయ్యారట. ఈ విషయంపై పార్టీ క్యాడర్లో ఇప్పటికే చర్చ నడుస్తోంది. అలా ఆ ఇద్దరి వ్యవహారం అధిష్టానానికి ఏ మాత్రం అంతు పట్టకుండా తయారైందంట. ఆ ఇద్దరు నేతలు ఇలా అంటీముట్టనట్టు ఉంటే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి..? పార్టీ భవిష్యత్తు ఏంటని కార్యకర్తలు తెగ బెంగ పెట్టేసుకుంటున్నారంట ఇప్పుడు.