Telangana : కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ క్లైమాక్స్ కు వచ్చినట్లే. ఫైనల్ గా కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ తో విచారణకు ముగింపునకు రాబోతోంది. మొత్తం ఖుల్లంఖుల్లాగా రిపోర్ట్ ఇప్పటికే రెడీ అయింది. జరిగిన నష్టమెంత? ఇంజినీర్లు చెప్పిందేంటి? నిర్ణయాలు ఎవరివి? అజాగ్రత్త ఎవరిది? అంతా రెడీగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ జవాబులతో కథ తేలిపోనుంది. అయితే కమిషన్ ఎంక్వైరీ ఫుల్ గరంగరంగా సాగే అవకాశం ఉంది. జస్టిస్ ఘోష్ ప్రశ్నలు, కేసీఆర్ సమాధానాలు అంతా హైపిచ్ లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
విచారణకు కేసీఆర్ సై..
కమిషన్ ఇప్పటికే 100 మందికి పైగా అధికారులను విచారించింది. ఫైనల్ గా మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు రావాలని డిసైడ్ అవడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇకపై మరో ఎత్తు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ క్లైమాక్స్ లో ఫుల్ ఫోర్స్ కనిపించబోతోందంటున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీ సమస్యలపై విచారణకు రావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు పంపింది. జూన్ 5న కేసీఆర్. జూన్ 6న ఈటల, జూన్ 9న హరీష్ రావు రావాలన్నది కమిషన్. మే 20న పంపిన ఈ నోటీసులు ఇప్పటికే వారికి అందాయి కూడా. సో మొన్నటిదాకా కేసీఆర్ వెళ్తారా వెళ్లరా అన్న డౌట్లు ఉండేవి. కానీ వెళ్లాలని డిసైడ్ అయ్యాకే పొలిటికల్ గా మ్యాటర్ హీటెక్కడం మొదలైంది.
కవిత కోసమేనా?
ఓవైపు ఇంట్లో కవిత ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. తనదారిలో తాను చాలా స్పీడ్ గా వెళ్తున్నారు కవిత. దీంతో బీఆర్ఎస్ లో కలవరం పెరుగుతోంది. ఈ టాపిక్ పై ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. సో ఇప్పటికే ఓడిపోయి, నిరాశలో ఉన్న బీఆర్ఎస్ శిబిరంలో ఇదో అలజడిగా మారిపోయింది. ఈ సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి హాజరవ్వాలని డిసైడ్ అయ్యారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
కేసీఆర్ లెక్క ఇదేనా?
కాళేశ్వరం క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరైతే పరిస్థితి ఏంటి.. గైర్హాజరైతే వచ్చే నష్టమేంటి.. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకే కేసీఆర్.. అడుగు ముందుకువేశారంటున్నారు. నిజానికి కాళేశ్వరం కుంగుబాటుపై 2023 డిసెంబర్లో అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. అప్పుడు హరీష్ రావు లేచి.. ప్రాజెక్టుపై BRS దర్యాప్తుకు సిద్ధంగా ఉందని, మేడిగడ్డ బ్యారేజీ సమస్యలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జిని నియమించాలని డిమాండ్ చేశారు. సో అంత ఆవేశంగా ఆనాడు విచారణకు డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కమిషన్ ముందు హాజరుకాకపోతే తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్తాయని గ్రహించారు. అందుకే ఏదైతే అదైంది.. విచారణకు వెళ్లాలని డిసైడ్ అయ్యారంటున్నారు.
హరీష్‌రావుతో మారథాన్ మీటింగ్స్
కాళేశ్వరం విచారణ విషయాలపై కేసీఆర్, హరీష్ రావు ఇప్పటికే మూడుసార్లు సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య ఫాంహౌజ్ లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.. ఎలాంటి జవాబులు ఇద్దాం.. వేటికి ఇవ్వొద్దు.. వేటితో కౌంటర్ చేద్దాం.. ఏవి ముట్టుకోవద్దు.. ఇలాంటి వాటిపై డీప్ డిస్కషన్ నడుస్తోందంటున్నారు. నిజానికి కాళేశ్వరం విచారణకు వెళ్లొద్దని కేసీఆర్ డిసైడ్ అయి ఉంటే.. అది ఆయనకే నష్టం కలిగించే అవకాశం ఉండేది. ఎందుకంటే ఏదో దాచే ఉద్దేశంతోనే దూరంగా ఉన్నారన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు చేసే ఛాన్స్ ఉండేది. అందుకే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. కానీ అక్కడే మరో ట్విస్ట్ కూడా కేసీఆర్ కు వెల్ కమ్ చెబుతోంది.
ఎంక్వైరీకి రావాల్సిందే..
సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సాక్షులను పిలిపించే అధికారాలు న్యాయ కమిషన్లకు ఉంటాయి. నోటీసు జారీ చేసిన ఏ వ్యక్తి అయినా కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని గతంలో కోర్టులు తీర్పులు కూడా ఇచ్చాయి. గతంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను విచారించిన అప్పటి జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్… సమన్లు జారీ చేసినప్పుడు, చంద్రశేఖర్ రావు హైకోర్టులో నోటీసును సవాలు చేశారు. కానీ నోటీసును రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్‌ను నాడు కోర్టు కొట్టివేసింది. తర్వాత ఆయన కమిషన్‌కు లిఖితపూర్వక సమాధానం పంపారు. సో ఇప్పుడు హాజరవక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కమిషన్ విచారణపై ఉత్కంఠ..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ లోపాల గురించి పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ఇంజినీర్ల నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామిషన్ చేసిన మ్యాటర్ ను కేసీఆర్ ముందుంచడం ఖాయమే. అయితే ఈ ఎంక్వైరీలో కమిషన్ ఏం ఆశిస్తుంది.. కేసీఆర్ చెప్పే జవాబులు ఎలా ఉండబోతున్నాయన్నదే ఉత్కంఠగా మారింది. అయితే కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్ట్ కాదు.. ఒక విప్లవాత్మక ప్రాజెక్టు అని డిఫెండ్ చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
కేసీఆర్ వెర్షన్ ఇదేనా?
ఈ ప్రాజెక్టు ద్వారా 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, గోదావరి నది నీటిని ఎత్తిపోసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం వంటి విషయాలను హైలైట్ చేసేలా ఫాంహౌజ్ లో వ్యూహాలు నడుస్తున్నాయంటున్నారు. కాళేశ్వరం ద్వారా చెరువులు, బావులు, భూగర్భ జలాలు పెరిగాయని, భూముల ధరలు పెరిగాయన్న వెర్షన్ ను ప్రస్తావించే ఛాన్స్ ఉంది. పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన వాళ్లు చెప్పి వెళ్లారు. వాటికి కేసీఆర్ ఆన్సర్ ఎలా ఉంటుందన్నదే ఈ మొత్తం ఎంక్వైరీలో టర్నింగ్ పాయింట్ కాబోతోంది. అయితే అక్కడే ట్విస్టులు కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ చాలా సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు తన మానస పుత్రిక అని, మెదడు రక్తం కరిగించి ఆలోచించి కట్టించానన్నారు.
NDA రిపోర్ట్ అంటూ పొలిటికల్ టర్న్
సో కేసీఆర్ తనను తాను కాపాడుకునేలా, నిర్ణయాలు సమిష్టిగా, సాంకేతిక నిపుణుల సలహాల ఆధారంగా తీసుకున్నామని, తాను ఒక్కడే బాధ్యున్ని కాదని వాదించే అవకాశం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, కాంట్రాక్టర్ల బాధ్యతలను హైలైట్ చేయొచ్చంటున్నారు. ఇదే కాదు.. చాలా ప్రాజెక్టులకు సమస్యలు వస్తాయని, వాటిని రిపేర్ చేసుకుని వాడుకుంటే సరిపోతుందన్న పాయింట్ కూడా చెప్పే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందుకు సర్దార్ సరోవర్ డ్యామ్ కాలువలు, పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకుపోవడం, రిపేర్ చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ పై ఆలోచిస్తున్నారు. మేడిగడ్డ కుంగిన తర్వాత భారీ వరదలు వచ్చినా తట్టుకుని నిలబడిందన్న విషయాన్ని హైలెట్ చేయొచ్చు. ఇప్పటికే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు NDSA రిపోర్ట్ ను NDA రిపోర్ట్ గా ఆరోపిస్తున్నారు. సో కమిషన్ ప్రశ్నలను పొలిటికల్ రివేంజ్ గా చూపే అవకాశాలు కూడా లేకపోలేదు.
మామా,అల్లుడు మేధోమథనం
ప్రాజెక్టు ఖర్చు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారం కాదని, రైతుల ఆదాయాన్ని పెంచిందని, భూముల విలువను పెంచిందని చెప్పే అవకాశం ఉంది. రాజకీయ కక్ష తప్ప మరొకటి లేదు అన్న పాయింట్ ను హైలెట్ చేసేలా ఫాంహౌజ్ లో చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఈ ప్రాజెక్టును రైతుల కోసం కాకుండా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం నిర్మించారని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. సో మ్యాటర్ ఏంటంటే.. కమిషన్ నోటీసులపై ఎలా రియాక్ట్ అవ్వాలి? విచారణ సమయంలో కమిషన్ అడిగే ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇవ్వాలా? లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలా? అన్న దానిపైనా కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విచారణకు వెళ్లి వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది. విజిలెన్స్ రిపోర్ట్, NDSA రిపోర్ట్, తాజాగా L&T ఏం చెప్పిందన్న విషయాలపై స్టడీ చేస్తున్నారు. సో విచారణకు టైం దగ్గరపడుతుండడంతో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. విచారణకు వెళ్తే జాతీయ స్థాయిలో అటెన్షన్ కేసీఆర్ వైపే ఉండబోతోంది. కవిత మ్యాటర్ సైడ్ అవుతుందన్న లెక్కలూ వేసుకుంటున్నారు.
Story By : Vidhya Sagar Reddy