(22-03-2025 శనివారం) ( టార్గెట్ సెంట్రల్ గ్రాంట్స్ )
కేంద్రం నుంచి వీలైనంత సాయం పొందాలి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రాపర్ గా వినియోగించుకోవాలి. ఇలా చేస్తే రాష్ట్రంలో ఆటోమేటిక్‌గా మౌలికసదుపాయాలు మెరుగుపడతాయని చంద్రబాబు ఆలోచన. శనివారం ఆర్థికశాఖపై నిర్వహించిన సమీక్షలో ఇదే విషయం స్పష్టం చేశారు సీఎం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నింటినీ రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని చెప్పారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఐదు శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆ నిధులు తేవాలని సీఎం వారిని ఆదేశించారు.
(21-03-2025 శుక్రవారం) ( విశ్వవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం )
సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమలలో పర్యటించారు. అక్కడ ఆయన కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలు చేపడతామని చెప్పారాయన. ఇందుకోసం వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణనిధి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులతోపాటు భక్తులిచ్చే విరాళాలతో పకడ్బందీగా ఆలయాల నిర్మాణాలు జరుగుతాయని అన్నారు. వాటి నిర్వహణ బాధ్యతలు స్థానికులకే అప్పగిస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు కట్టడానికి సంకల్పించామని చెప్పారు. ముఖ్యమంత్రులందరికీ లేఖ రాస్తామని.. వారు ముందుకొస్తే టీటీడీ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్నచోట శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు చంద్రబాబు.
(21-03-2025 శుక్రవారం) ( సప్తగిరులు శ్రీవారివే)
ఆలయాల నిర్మాణంతో పాటు తిరుమలలో శనివారం మరో కీలక ప్రకటన చేశారు సీఎం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఎలాంటి కమర్సియల్ నిర్మాణాలు జరగడానికి వీల్లేదని తేల్చేశారు. వైసీపీ హాయంలో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని రద్దు చేశారు. దీంతో పాటు.. వైష్ణవి వెర్సటైల్ వెంచర్, ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ వారికి కూడా కేటాయించిన భూములు రద్దు చేస్తామని చెప్పారు. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వీళ్లేదని తేల్చేశారాయన.
(20-03-2025 గురువారం) ( అందరూ మెచ్చేలా వర్గీకరణ)
గురువారం సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు సీఎం. 30 ఏళ్ల నిరీక్షణకు మంచి ముగింపు పలికామని తెలిపారు. వర్గీకరణపై ఎవరికీ అపోహలు అక్కర్లేదని ఎవరికీ నష్టం జరగదని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ చేశామని అన్నారు. 2026 జనగణన తర్వాత వర్గీకరణను జిల్లాల వారీగా అమలుచేస్తామని తెలిపారు సీఎం. మొత్తం 59 కులాలను కమిషన్ మూడు గ్రూపులుగా విభజించి, రిజర్వేషన్లు సిఫారసు చేసిందని చెప్పారు చంద్రబాబు. మొదటి గ్రూపులో రెల్లి, అనుబంధ ఉపకులాలకు 1%, రెండో గ్రూపులో మాదిగ, అనుబంధ కులాలకు 6.5%, మూడో గ్రూపులో మాల, అనుబంధ కులాలకు 7.5% చొప్పున రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
(20-03-2025 గురువారం) (కులవివక్షపై పోరాటం)
తాను మొదటి నుంచి అంటరానితనం, కులవివక్షపై పోరాటం చేస్తున్నానని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని ఏ వ్యక్తి కూడా చెప్పుకునే ధీన స్థితిలో ఉండకూడదని అన్నారు. అలాంటి సమాజం నిర్మాణం కోసమే తాను తపనపడుతున్నానని చెప్పారు. దీనికి పవన్ కల్యాణ్, బీజేపీ సహకరిస్తున్నారని తెలిపారు సీఎం. పేదరిక నిర్మూలన కోసం పీ4 విధానం అమలు చేస్తామన్నారు. సమాజంలోని 10 శాతం ధనవంతులు దిగువన ఉన్న 20% మందిని దత్తత తీసుకోవాలని చెప్పారు. ఉగాది రోజున ఈ పీ4 విధానం తీసుకొస్తామన్నారు సీఎం.
(19-03-2025 బుధవారం) (బిల్ ‘గ్రేట్’ మీట్ )
సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో పర్యటించారు. అక్కడాయన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. వైద్యం, ఆరోగ్యం, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయ రంగాలలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఇరువర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ఐదు రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలని ఈ ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు గేట్స్ ఫౌండేషన్ అవసరమైన సహకారం అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే విశ్లేషించి, వాటికి సమస్యలు పరిష్కారం తెలుసుకోనున్నానరు. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా వ్యసాయానికి ముందస్తుగా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
రాష్ట్ర పురోగతికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని ఆయన అన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని అన్నారు. ప్రజలకు సాధికారత కల్పించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలక భూమిక పోషిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ప్రయోజనాలు రాష్ట్రానికే కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలుందన్నారు సీఎం.
(19-03-2025 బుధవారం) (రాజధానికి రహదారి)
రాజధాని అమరావతిలో 40వేల 316 కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇ-13 రోడ్డును చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో కనెక్ట్ చేయడానికి 834 కోట్ల ఖర్చు చేయనున్నారు. ఇ-15 రోడ్డును 307 కోట్లతో పాత జాతీయ రహదారితో అనుసంధానం చేయనున్నారు. ఇక వీటితో పాటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో నుంచి తీసుకుంటున్న నిధులతో 15వేల 95 కోట్ల రూపాయల 37 పనులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సీఆర్‌డీఏ పిలిచిన టెండర్లు 22వేల 607 కోట్ల విలువైన 22 పనులకు లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేసేందుకు అనుమతిచ్చింది. 14వందల 72 కోట్ల వ్యయంతో విద్యుత్ సరఫరా లైన్ల రీరూటింగ్ పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేసింది.
(18-03-2025 మంగళవారం) (అసెంబ్లీలో అరకు కాఫీ)
అరకు కాఫీని విస్తృత స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆ కాఫీని అందుబాటులోకి తెచ్చింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అసెంబ్లీ లాబీల్లో మూడు స్టాళ్లను ఏర్పాటు చేయించింది. ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఆ కాఫీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు ఇచ్చారు. సేంద్రియ పొడి కావడంతో కాఫీ టేస్టీగా ఉందని వారు చెప్పారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం చెప్పారు. ఇలాంటి ఉత్పత్తులను ఇంకా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
(17-03-2025 సోమవారం) (కేబినెట్ కీలక నిర్ణయాలు)
సోమవారం మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతన్నల ఇళ్లకు నెలకు 200, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయించారు. 40 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో జరగనున్న పనులకు సంబంధించి సీఆర్‌డీఏ చేసిన తీర్మానాలకు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం -2025 ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పేరును తాడిగడప మునిసిపాలిటీగా మార్చాలని నిర్ణయించింది. ఇక స్టార్టప్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
విద్యార్థులు ప్రారంభించే స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్టార్టప్‌ను బట్టి 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు సాయం అందించే అవకాశం ఉంది. ఇంధన రంగంలో ప్రీమియర్ ఎనర్జీస్, దాల్మియా సిమెంట్, లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, సత్యవీడు రిజర్వ్ ఇన్‌ఫ్రా సిటీ, ఇండోసోల్ సోలార్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 2014-19 టైంలోనే విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు అంతా సిద్ధమైందని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ, తర్వాత ప్రభుత్వం మారడంతో లులు వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ప్రయత్నాలు జరిపి విశాఖతో పాటు అమరావతి, తిరుపతిల్లోనూ మాల్స్ ఏర్పాటునకు ఒప్పించామని అన్నారు సీఎం.
(17-03-2025 సోమవారం) ( విజన్ 2047 ఫిక్స్)
ప్రభుత్వం సంపదను సృష్టించి ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు.. సంపదని సృష్టించుకునేలా ప్రజలు కూడా తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. పేదల తక్షణ అవసరాలు తీరుస్తూనే దీర్ఘకాలంలో వారు స్వశక్తితో ఎదిగేలా చూస్తామని చంద్రబాబు సోమవారం అసెంబ్లీలో చెప్పారు. విజన్ 2047 గురించి మాట్లాడుతూ వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం ఇలా అన్ని స్థాయుల్లోనూ పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారాయన. నియోజకవర్గాల వారీగా విజన్ ఎజెండా అమలుతో స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని ఆయన ప్లాన్. ఈ విజన్‌లో ప్రజల అభిప్రాయాలను తీసుకొని వారిని భాగస్వాములను చేస్తామన్నారు సీఎం.
రాష్ట్రంలోని 26 జిల్లాల విజన్ డాక్యుమెంట్లు తయారుచేసి, త్వరలో కలెక్టర్ల సదస్సులో విడుదల చేస్తామని అన్నారు సీఎం. నియోజకవర్గాలకు మూడు నమూనాలు ఇచ్చామని చెప్పారు. వాటి ఆధారంగా డాక్యుమెంట్లు తయారుచేయాలని సూచించారు. దానికి పది సూత్రాలు ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాల విజన్ ప్రణాళికలను తయారుచేశామన్నారు. తానొక్కడినే పనిచేస్తే సరిపోదని, ఎమ్మెల్యేలంతా పని చేయాలని పిలుపునిచ్చారు.
2047 విజన్‌లోనే 2029 కూడా భాగమని అన్నారాయన. 2029 నాటికి టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని పని చేస్తామని చెప్పారు. ఏం చేశామో ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాల్సిందేనని అన్నారు సీఎం. దాని కోసం ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఆమోద యోగ్యంగా లేకపోతే కోరుకున్న చోటే స్థలం ఇస్తామని అన్నారు. దీంతో పాటు.. ప్రతీ ఇంటికి వాటర్ కనెక్షన్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇంటింటికీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తాని.. అవకాశమున్న మేర పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలన్నారు సీఎం. డిజిటల్ అనుసంధానంలో భాగంగా ఇంటింటికీ వైఫై సౌకర్యంతో పాటు 5జి లేదా 6జి బ్యాండ్‌విడ్త్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక వీటితో పాటు నదుల అనుసంధానం, రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు చంద్రబాబు
(16-03-2025 ఆదివారం)( అమరావతికి హడ్కో అడుగులు )
ఈ ఐదేళ్లలోనే ఏపీకి బలమైన రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో ఓవైపు పాలన చేస్తూనే మరోవైపు రాజధాని నిర్మాణంపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం సీఎం సమక్షంలో సీఆర్డీయే, హడ్కో కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం రాజధానిలో పనులకు హడ్కో 11వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేయనుంది. ఈ రుణ మంజూరుకు జనవరి 22న ముంబయిలో జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు.
(16-03-2025 ఆదివారం)(పొట్టి శ్రీరాములకు గట్టి గౌరవం)
ఆదివారం సీఎం చంద్రబాబు తన ఇంట్లో పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకొన్నారు చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన సేవలకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడే ఓ పార్కునూ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా మార్చడమే తమ సంకల్పమని అన్నారు సీఎం. ఈ ఉగాదికి పీ-4 విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీన్ని జయప్రదం చేస్తే సమాజంలో సుస్థిరత ఉంటుందని సీఎం ధీమా. రాబోయే ఐదేళ్లలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పని చేసి.. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలనూ మెరుగుపరుస్తామని చెప్పారు.