CM Chandrababu: పేదరికాన్ని నిర్మూలించడానికి ఏపీ సీఎం చంద్రబాబు రచిస్తున్న వ్యూహం పీ4. ఈ కొత్త విధానం ద్వారా 2029 నాటికి ఏపీలో పేదరికం నిర్మూల చేయాలని భావిస్తున్నారాయ. ఇక పోలవరంపై కూడా స్పెషల్ ఫోకస్ చేసిన చంద్రబాబు.. గోదావరి పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు.
24-03-2025 సోమవారం ( నీటి సమస్యకు పరిష్కార మార్గాలు)
వేసవి మొదలైంది. ఇకపై నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సీఎం చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి ముందుగానే చర్యలు మొదలుపెట్టారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖలు, విపత్తుల యాజమాన్య సంస్థ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లోనూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మార్కెట్లు, బస్టాండ్లు, కూలీ అడ్డాలు, జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు పెట్టాలని సూచించారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే చోట్ల ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయాలని చెప్పారు. స్కూల్స్‌లో కూడా డ్రింకింగ్ వాటర్ అందుబాటులో ఉంచాలని అన్నారు. వాటర్ బాటిల్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నీటి లభ్యత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడిక తొలగింపు చేస్తే మంచిన్నారు సీఎం. ఉపాధి కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల్లోపు పనులు పూర్తి చేసుకొని ఇళ్లకు వెళ్లేలా చూడాలని చెప్పారు చంద్రబాబు. పశువులకు నీరు అందించేందుకు తొట్టెల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.
24-03-2025 సోమవారం (బనకచర్లతో అద్భుత భవిష్యత్)
అమరావతి, పోలవరం తర్వాత సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు పోలవరం-బనకచర్ల. దీని కోసం ఈ ఏడాది జూన్ ఒకటికల్లా టెండర్లు పిలవాలని భావిస్తున్నారాయన. ఈ ప్రాజెక్టుపై అధికారులతో సీఎం సమీక్షించారు. నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఫలితాలను రాష్ట్రానికి చూపాలని అన్నారు ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలసంఘానికి త్వరగా పంపాలని చెప్పారు చంద్రబాబు. ప్రాజెక్టుకు 81వేల 900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా.
ఇదే విషయాన్ని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 12వేల 294 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు వివరించారు. అదే సమయంలో 11వేల 176 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇక.. 430 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఆస్కారం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇదే జరిగితే ఏడాదికి 247 కోట్ల రాబడి వస్తుందని ఓ లెక్క. ఈ ప్రాజెక్టు వల్ల సాధించే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులతో 8వేల 432 కోట్ల ఆదాయం వస్తుందని కూడా మరో అంచనా.
24-03-2025 సోమవారం (ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు)
ఓ వైపు పెద్ద కంపెనీలను ఆహ్వానిస్తూనే.. మరో వైపు స్టార్టప్‌ల కల్పనపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. వచ్చే అయిదేళ్లలో 20 వేల స్టార్టప్‌ల సృష్టించాలని టార్గెట్ పెట్టుకుంది. దీంతో కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29ని ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్‌లు పెట్టడానికి మంచి ప్లాన్‌తో వస్తే ప్రభుత్వం ఆర్థికసాయం కూడా చేస్తుంది. విద్యార్థులు, స్టార్టప్‌లకు ప్రారంభ గ్రాంట్‌గా 2 లక్షల వరకు అందిస్తుంది. అదే స్టార్టప్ ఉత్పత్తి దశకు చేరుకునే వరకు గరిష్ఠంగా 15 లక్షల వరకు విడతల వారీగా ఇస్తారు.
25-03-2025 మంగళవారం (భూ వివాదాలపై స్పెషల్ ఫోకస్)
మంగళవారం కలెక్టర్ల సదస్సులో భూ వివాదాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో భూ వివాదాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించాలని కలెక్టర్లు, రెవెన్యూశాఖ అధికారులకు టార్గెట్ పెట్టారు సీఎం. వైసీపీ ప్రభుత్వంలో భూదందాల కారణంగా ల్యాండ్ ఇష్యూస్ వచ్చాయని చెప్పారు చంద్రబాబు. కలెక్టర్లు జిల్లాలవారీగా పరిష్కరించగల అంశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలుపై ఏప్రిల్ ఆఖరులోగా నివేదికలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్లు దృష్టి పెడితే 95 శాతం వివాదాలు పరిష్కారమైపోతాయని సీఎం ఆలోచన. మిగతా వాటిని పరిష్కరించేందుకు విధాన నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు చంద్రబాబు.
25-03-2025 మంగళవారం ( శాటిలైట్స్‌తో రియల్ టైం గవర్నెన్స్)
వాట్సప్ గవర్నెన్స్, ఆర్టీజీ, వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌పై కొత్త ఆలోచనలను సీఎం కలెక్టర్ల సదస్సులో బయటపెట్టారు.
భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైతే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాల్ని కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. సాటిలైట్స్‌కు డ్రోన్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలను కనెక్ట్ చేస్తే ప్రజలకు రియల్‌టైమ్‌లో సేవలందించవచ్చని తెలిపారు. ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్నీ రియల్‌టైమ్‌లో కనిపెట్టేందుకు ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు.
25-03-2025 మంగళవారం (జిల్లా బాధ్యత కలెక్టర్లదే)
పనితీరులో అలసట కనిపించొద్దని కలెక్టర్లకు సీఎం సూచించారు. జిల్లాల ప్రగతి బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రజలే ముందు అనే భావనతో ప్రతి ఒక్కరిలో కనిపించాలని చెప్పారు. రాష్ట్ర పాలనపై ఒక సీఎం మార్క్ ఎలా ఉంటుందో.. అలాగే జిల్లాల పాలనపై కలెక్టర్ ముద్ర ఉండాలన్నారు. గది నుంచి బయటకు రాలేమనే అధికార దర్పం వద్దని వార్నింగ్ ఇచ్చారు. అన్నీ తెలుసనే అహాన్ని పక్కన పెట్టి కొత్తగా నేర్చుకోవాలనే ఆలోచనలో ముందుకు వెళ్లాలని సూచించారు. 9.74 లక్షల కోట్ల అప్పులు, వాటికి వడ్డీలను దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలని అన్నారు. అదే సమయంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని చెప్పారు. ఓ విజన్ తో ముందుకు వెళ్తేనే ప్రజలకు మంచి పాలనను అందిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయట పడేయొచ్చని తెలిపారు సీఎం.
26-03-2025 బుధవారం ( డివైడ్ అండ్ డెవలప్)
బుధవారం, మంగళవారం సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. అన్ని శాఖలు, జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా డివైడ్ చేసి అభివృద్ధి చేయాలని బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పారు. మొత్తం ఐదు హబ్‌లను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. కాబట్టి.. రాజమండ్రి, కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ది పనులను ఇప్పటి నుంచే మొదలు పెట్టాన్నారు సీఎం. ఈ ఏడాది నవంబరులో సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని.. దానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
26-03-2025 బుధవారం ( పర్యాటకమే ఏపీకి గేమ్ ఛేంజర్)
రాష్ట్ర అభివృద్ధికి పర్యాటక రంగం గేమ్ ఛేంజర్ కావాలన్నారు చంద్రబాబు. ఈ రంగంలో 20శాతం వృద్ధి సాధించాలని చెప్పారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకత ఉందని.. అంతర్జాతీయ స్థాయిలో టూరిస్టులను అట్రాక్ట్ చేసేలా టూరిజం ఈవెంట్లు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 టూరిజం ఈవెంట్లు నిర్వహించాలని టార్గెట్ పెట్టారు ముఖ్యమంత్రి.
26-03-2025 బుధవారం ( వర్క్ ఫ్రం హోంకు చేయూత)
ఎక్కువ మంది వర్క్ ఫ్రం హోం కల్చర్‌కి అలవాటు పడుతున్నారు. కాబట్టి దీనికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆలోచన. అందుకే రాష్ట్రమంతటా అంతర్జాతీయ స్థాయి బ్యాండ్ విడ్త్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్‌కు ఆరు లక్షల మంది సిద్ధంగా ఉన్నారని ఆయన దగ్గర ఉన్న లెక్క. మొత్తం 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం చేసేలా చూడాలని టార్గెట్ పెట్టారాయన. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పార.
26-03-2025 బుధవారం ( నియోజకవర్గానికో జాబ్ మేళా)
యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పనపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ జాబ్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వచ్చే కలెక్టర్ల సదస్సులోగా దీన్ని పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి మూడు, ఆరు నెలలకొకసారైనా జాబ్ మేళాలు జరగాలని స్పష్టం చేశారు. తొమ్మిది నెలలైనా ఇంకా నైపుణ్య గణన ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు సీఎం. ఆ ప్రక్రియ త్వరగా పూర్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దీని కోసం స్థానికంగా ఉన్న పరిశ్రమలతో కనెక్ట్ కావాలని చెప్పారు.
26-03-2025 బుధవారం ( నేతన్నకు చేయూత)
బుధవారం ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, వపర్‌లూమ్‌లకు 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ పథకం అమలుకు నిర్ణయించింది. దీనికి సంబంధిచిన ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలకు, 10వేల 534 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం జరగనుంది. ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
26-03-2025 బుధవారం ( లులూకి భూ కేటాయింపులు)
విశాఖలో లులూ గ్రూప్‌కు భూములు కేటాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీఐఐసీకి అప్పగించింది. దీని కోసం విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 13.43 ఎకరాల హార్బర్ పార్కు భూములను ఏపీఐఐసీకి తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ భూముల్లో చిల్డ్రన్స్ ఎమ్యూజ్‌మెంట్ పార్కు, ఫుడ్‌కోర్టు, 8 స్క్రీన్‌లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్‌లను నిర్మించేందుకు లులూ సంస్థ ప్రతిపాదించింది.
26-03-2025 బుధవారం ( జపాన్ కంపెనీలకు ప్రత్యేక MSME పార్క్)
జపాన్‌కు చెందిన పెట్టుబడిదారుల కోసం శ్రీసిటీ సమీపంలో ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జపాన్ ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబును బుధవారం కలిసింది. జపాన్‌తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ ఆలోచన అని చంద్రబాబు వారికి చెప్పార. శ్రీసిటీలో ఇప్పటికే జపాన్‌కు చెందిన పలు సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరిన్ని సంస్థలను ఆకర్శించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
27-03-2025 గురువారం (పుష్కరాల ముందే పోలవరం పూర్తి)
సీఎం చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని చెప్పారు సీఎం. 2027 ఆగస్టులో గోదావరికి పుష్కరాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుంటే 2027 ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి అవుతుందని అన్నారు. ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబరుకు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా 2027లోనే పోలవరం పూర్తి చేయడం ఖాయమని అన్నారాయ.
పునరావాస కాలనీల నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. దీంతో కోసం 972 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు సీఎం. తొలి దశ 1ఏలో ఇప్పటికే 14వేల 309 కుటుంబాలను తరలించామని గుర్తు చేశారు. మరో 6వేల 700 కుటుంబాలను తరలించాల్సి ఉందని అన్నారు. జగన్ రాజకీయ కక్షతోనే ప్రాజెక్టులో ఇంత విధ్వంసం జరిగిందని సీఎం ఆరోపణ. పోలవరంలో రివర్స్ టెండర్ల వల్ల 5వేల 282 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ప్రాజెక్టులో అదనంగా 2వేల 782 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విద్యుత్తు కేంద్రంలో 2వేల 500 కోట్లు నష్టపోయామని సీఎం వివరణ.
27-03-2025 గురువారం (పోలవరంతో టూరిజానికి ఊపు)
ప్రాజెక్టు పూర్తి అయితే పోలవరంలో టూరిజం కూడా డెవెలప్ చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు దగ్గర 4 ఐల్యాండ్‌లు ఉన్నాయి. ఆ కొండలపై హోటళ్లు నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన. పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
27-03-2025 గురువారం (ఇఫ్తార్ విందులో సీఎం)
గురువారం సీఎం చంద్రబాబు ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్నారు. మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లింలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా అన్ని విధాలుగా ముస్లిం మైనారిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి 5వేల 300 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.
28-03-2025 శుక్రవారం ( అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ)
శుక్రవారం సీఎం చంద్రబాబు ఐఐటీ మద్రాస్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌కు వెళ్లారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని ఆయన చెప్పారు. ఐఐటీ మద్రాస్‌తో కలిసి దీన్ని సాధ్యం చేసే పనిలో ఉన్నామని అన్నారు సీఎం. క్వాంటమ్ టవర్‌ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతికతలు అందులో ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. 1995లో ఐటీ ఎలా మొదలుపెట్టానో, 2025లో ఏఐ గురించి అలాగే ఆలోచిస్తున్నానని చెప్పారు.
ఏపీకి వచ్చేందుకు గూగుల్ సుముఖత తెలిపిందని, డాటా సెంటర్‌ను పెడుతున్నట్లు వివరించారు. విశాఖ నుంచి సింగపూర్ దాకా సముద్రగర్భంలో సీ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ మాత్రమే కాదు.. దేశం జెట్ స్పీడ్‌తో డెవెలెప్ అవుతుందని చెప్పారు సీఎం. భవిష్యత్ అంతా భారత్‌దేనని తెలిపారాయన. 2028 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి రావచ్చని అంచనా వేశారు. 2047 నాటికి మొదటి లేదా రెండో స్థానానికి వచ్చే అవకాశాలున్నాయని చెప్పార.
29-03-2025 శనివారం ( టూరిజం అభివృద్ధికి హోటల్స్ నిర్మాణం)
శనివారం హోటల్స్ అసోసియేషన్‌ల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. టూరిజం అభివృద్ధిలో తామూ భాగస్వామ్యం అవుతామని వారు సీఎంని కోరారు. అరకు లోయ, విశాఖతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు కావాలని కోరారు ఏపీకి ఉన్న తీరం పొడవునా 20 నుంచి 25 ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందని సీఎం వారికి చెప్పారు. అంతర్జాతీయ సంస్థలన్నింటినీ ఒకే వేదికపై తీసుకొచ్చి దానిపై ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారు చంద్రబాబు. రాష్ట్రం గ్రోత్ రేట్‌ను 8 శాతం నుంచి 22 శాతానికి తీసుకెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. ఫెడరేషన్స్ ఆఫ్ హోటల్స్, రెస్టారెంట్ అసోసియేషన్ సమావేశాన్ని విజయవాడ లేదా విశాఖలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం వారికి సూచించారు.
30-03-2025 ఆదివారం ( పేదరికం నిర్మూలనకు పీ4 వ్యూహం)
20 ఏళ్లు ముందుగా ఆలోచించడం, వినూత్న ఆలోచనలకు తెరలేపడం సీఎం చంద్రబాబు స్టైల్. ఈ విజనే ఆయనకు ఓ ప్రత్యేకమైన సీఎంగా గుర్తింపును తెస్తున్నాయి. ఆదివారం కూడా మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు సీఎం. ఎప్పటి నుంచో చెబుతున్న పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలోని 20 శాతం మంది పేదవారిని 10 శాతం మంది ధనవంతులు దత్తత తీసుకోవాలి. ఇలా సమాజంలో పేదరికాన్ని అరికట్టాలని సీఎం ఆలోచన. దీని కోసం ఈ పీ4 విధానాన్ని తీసుకొచ్చారాయన. ఇక్కడ ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఏమీ లేదు. పేదవారిని, ధనవంతులను ఓ గొడుగు కిందకు తీసుకొస్తారు. ఆ తర్వాత డబ్బున్న వారు పేదవారికి సాయం చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చేయాలని సీఎం లక్ష్యం. మొదట దశలో 20 లక్షల కుటుంబాలకు పేదరిక విముక్తి కలిగించాలని భావిస్తున్నారు సీఎం.
30-03-2025 ఆదివారం ( ఉగాది వేడుకల్లో సీఎం)
సీఎం చంద్రబాబు ఆదివారం ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది 3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీంతోపాటు సీఎం ఉగాది రోజున కీలక నిర్ణయం తీసుకున్నారు. 38 కోట్ల రూపాయల సీఎం సహాయనిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం హయాంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 281 కోట్లు రిలీజ్ చేశారు.