CM Chandrababu: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తాము నిర్దేశించుకున్న కీలక సూత్రాల అమలుకు.. కేంద్రం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ స్కీమ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక.. రాష్ట్రంలోని రైతులకు వారి భూములపై సమగ్ర హక్కులు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం. అమరావతి దేవతల రాజధాని అని.. వేంకటేశ్వరస్వామి దీవెనలతో అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఎంతమంది బాధపడినా అమరావతి డైనమిక్ సిటీ అని చెప్పారు. ఈ వారం జరిగిన క్యాబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచింది.
పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా.. వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్యాంపు ఆఫీసులో దీనిపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్- వీబీ జీ రామ్ జీ పథకంపై.. ప్రజలకు, లబ్ధిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ దిశగా పని చేస్తోందన్నారు. ఇప్పుడు నిర్దేశించుకున్న 10 సూత్రాల అమలుకు జీ-రామ్-జీ స్కీం ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
భూమితో రైతులకు భావోద్వేగ బంధం ఉంటుందని, ప్రాణాలు పోయినా దానిని వదులుకోడానికి సిద్ధపడరని సీఎం చంద్రబాబు అన్నారు. భూములపై సమగ్ర హక్కులు, భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కంటిపూడి సత్యసాయిబాబా అనే రైతుకు.. సీఎం స్వయంగా పట్టాదారు పాసుపుస్తకాన్ని అందించారు. పాసుపుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను సెల్ ఫోన్‌లో స్కాన్ చేయించి.. మ్యాప్ ద్వారా పొలం దగ్గరకు వెళ్లారు. ఎవరి ఫోటోలు లేకుండా.. రాజముద్రతో తమకు పట్టాదారు పుస్తకం ఇవ్వడం సంతోషంగా ఉందని రైతు సత్యసాయిబాబా సీఎంతో అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా రూపొందించామని సీఎం ప్రజా వేదికపై చెప్పారు. ప్రతి నెలా 2 నుంచి 9 వరకు.. గ్రామసభలు నిర్వహించి భూముల వివరాలన్నీ చదివి వినిపిస్తారని, భూయజమానులు సంతృప్తి చెందితేనే ఈ-కేవైసీ చేసి, 9న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని చెప్పారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ వారం జరిగిన క్యాబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలకు వేదికైంది. అమరావతిలోని కృష్ణా నది తీరంలో ప్రతిష్ఠాత్మక మెరీనా ప్రాజెక్టుతో పాటు, వేల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పర్యాటక రంగాన్ని ఏపీ ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్‌గా మార్చి, యువతకు భారీగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో.. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో 14 కొత్త సంస్థలు ఏర్పాటవుతాయి. రాష్ట్రంలో సరకు రవాణా రంగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు.. స్కూల్ కిట్ల పంపిణీ కోసం 944 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 5 వేల కోట్ల రుణానికి.. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. ఎక్సైజ్ విధానంలో భాగంగా బార్లపై ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను ఉపసంహరణ, కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు.. ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్‌కు ప్రమోషన్ ఇచ్చి గ్రూప్-2 స్థాయి ఉద్యోగం కల్పించాలని నిర్ణయించింది. సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు వివిధ సంస్థల భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తెలుగు సినిమా, సాంస్కృతిక, కళా, సాహిత్య మేళవింపుగా విజయవాడలో నిర్వహించిన అమరావతి – ఆవకాయ్ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై సాహిత్య చర్చలు, కవితా పఠనం, సంగీతం, నృత్యం, నాటకాలు, సదస్సులు నిర్వహించారు. కృష్ణా నదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉత్సవాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమరావతి దేవతల రాజధాని అని.. వేంకటేశ్వరస్వామి దీవెనలతో అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎంతమంది.. ఎంత బాధపడినా అమరావతి బెస్ట్ సిటీ.. డైనమిక్ సిటీ అని చెప్పారు. కృష్ణా నది దగ్గర.. గంట పాటు గడిపితే.. మెడిటేషన్ కూడా అవసరం లేదన్నారు చంద్రబాబు. అమరావతి గ్రీన్‌సిటీ అని, విజయవాడ క్లీనెస్ట్ సిటీ అని సీఎం చెప్పారు.
యూరోపియన్ యూనియన్ భారత రాయబారి హెర్వె డెల్ఫీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈయూ, భారత్ మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029లో భాగంగా తీసుకోబోతున్న.. బ్లూ వ్యాలీ ఇనీషియేటీవ్, ఏపీ అనుసరిస్తున్న కీలక మిషన్‌లు, పారిశ్రామిక కారిడార్లు లాంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చలు జరిపారు.
ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు సీఎం.ఏపీ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయాలని.. కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు. విభజన చట్టంలో అమరావతిని చేరుస్తూ.. పార్లమెంట్‌లో బిల్లుని ఆమోదించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఇక.. వైసీపీ పాలనలో ఏపీ కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్‌ను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చిందన్నారు సీఎం. గతేడాది అంతా కలిసి పనిచేయడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, రికార్డులను తారుమారు చేయడానికి
అమరావతికి చట్టబద్ధత కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయాలని కోరారు. విభజన చట్టంలో అమరావతిని చేర్చాలని.. దీనికోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని, ప్రజల ఆశలు నెరవేరుతాయని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి కూడా భరోసా ఉంటుందని తెలిపారు. కేంద్రం కూడా అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిలో.. ఏపీకి వెసులుబాట్లు కల్పించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి.. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్‌షాను అభ్యర్థించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పెంచాలని.. అమిత్ షాని కోరారు చంద్రబాబు. గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కేంద్రం చేయూతనివ్వాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, రెవెన్యూ లోటును పూడ్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దడానికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని.. ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ నుంచి తగినన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే సహా మొత్తం ప్రాజెక్టును, డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను వీక్షించారు. ప్రాజెక్టు సైట్ దగ్గరే.. సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని.. సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
రాష్ట్ర రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై ఈ వారం సమీక్ష నిర్వహించారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయని సీఎం అన్నారు. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా.. ఏపీలో స్వయం సహాయక సంఘాలు తయారుచేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ అంశాలపైనా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా SHG లు తయారు చేస్తున్న 23 వేలకు పైగా ఉత్పత్తులకు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్, మార్కెటింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. మహిళా సంఘాలు, మైక్రో ఎంట్రప్రెన్యూర్స్‌కు ఆర్థిక సుస్థిరత వచ్చేలా ఉత్పత్తులను వ్యవస్థీకృతం చేయాలని సూచించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణా నది తీరాన్ని.. మెరీనా వాటర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు.. సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. మెరీనా వాటర్ ఫ్రంట్‌లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బ్లూ – గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించే కొత్త బ్యారేజ్‌తో.. రాజధానికి నీటి వనరులు సమకూరతాయని వివరించారు. కృష్ణానదికి ఇరు వైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు.
వైసీపీ పాలనలో.. ఏపీ కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్‌ను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చిందని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. 2025లో అంతా కలిసి పనిచేయడంతో.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ వారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన 19 వేల 391 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలిపింది. వీటి ద్వారా ఏర్పాటయ్యే పరిశ్రమలతో దాదాపు 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. గత 13 సమావేశాల్లో 8 లక్షల 55 వేల కోట్ల పెట్టుబడులకు, 8 లక్షల 23 వేల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలిపారు. ఇదే ఉత్సాహంతో.. ఈ ఏడాది కూడా పనిచేయాలన్నారు సీఎం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో ఫలితాలు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్‌ని కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్మారకంగా జారీ చేసిన తపాలా శాఖ స్పెషల్ కవర్‌ను సీఎం ఆవిష్కరించారు. తెలుగు మహాసభలకు పెద్ద ఎత్తున జనం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలని చెప్పారు. ప్రపంచంలో వందల భాషలున్నా, 6 భాషలకు మాత్రమే ప్రాచీన హోదా లభించిందని, అందులో తెలుగు ఉండటం గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలుగు మహా సభలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగిన విషయమన్నారు.
ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌తో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదేవిధంగా.. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుతోనూ సీఎం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. భోగాపురంలో నిర్మించే జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యు సిటీకి భూమి ఇచ్చినందుకు అశోక్ గజపతిరాజుకు.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు.. ఈ వారం కూడా రివ్యూ నిర్వహించారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలని కోరారు. పౌర సేవలన్నీ క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అందించేలా కృషి చేయాలని ఆదేశించారు.
Story by: Anup, Big Tv