CM Chandrababu: రేపటి జనరేషన్ అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లడమే విజనరీ లీడర్ క్వాలిటీ. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా ముందుంటారు. అందుకే భవిష్యత్ అవసరాల కోసం రాజధానిలో మరో 30 వేల ఎకరాల భూ సేకరణపై దృష్టి పెట్టారు. ఇక మరో 16 కంపెనీల పెట్టుబడులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీసీల రక్షణకు చట్టం తీసుకురావడంపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని స్వయంగా సీఎం ప్రకటించారు.
07-04-2025 సోమవారం (ఆరోగ్యాంధ్ర దిశగా)
ఆరోగ్యాంధ్ర దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. వైద్యం కోసం ప్రజలు ఎక్కువ దూరం వెళ్లకుండా అందుబాటులో అన్ని వసతులతో ఆస్పత్రులను నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించాల్సిన సేవలపై సోమవారం సచివాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు చెప్పారాయన. రాష్ట్రంలో పలు వ్యాధులతో బాధపడుతున్నవారిలో 80 శాతం మంది గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి వాటితోనే సతమతమవుతున్నారని తెలిపారు సీఎం.
దీంతో ఆయా సమస్యలపై తాము ఫోకస్ చేస్తున్నామని అన్నారు. జిల్లాలవారీగా ఎక్కడ ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో, వాటికి కారణాలేంటో సర్వేల ఆధారంగా ఆయన వివరించారు. వీటికి చెక్ పెట్టేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలోనూ 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని చెప్పారు. వీటిని పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, మిగతా 105 చోట్ల ప్రాధాన్య క్రమంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అక్కడే చంద్రబాబు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. రాజధాని అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశంలో పీపీపీ విధానంలో 25 మెడిసిటీలు ఏర్పాటు చేస్తామని రీసెంట్‌గా కేంద్రం ప్రకటించింది. అందులో ఒకటి అమరావతికి వస్తుందని సీఎం వివరణ. ఈ మెడిసిటీ 200 ఎకరాల్లో ఉంటుంది. 100 ఎకరాల్లో ఆస్పత్రులు, 40 ఎకరాల్లో నివాస భవనాలు, 40 ఎకరాల్లో వాణిజ్య భవనాలు, 20 ఎకరాల్లో సేవా కేంద్రాలు ఉంటాయని అన్నారు చంద్రబాబు.
07-04-2025 సోమవారం (రాజధానికి నిధులు)
రాజధాని అమరావతి నిర్మాణ కోసం కేంద్రం మరో 4,285 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. ఇందులో కేంద్రం నిధులు 750 కోట్లు కాగా.. మిగిలిన డబ్బు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చిన రుణాల నుంచి ఇచ్చింది. ఈ రెండు బ్యాంకులు కలిపి రుణం ఇచ్చేందుకు సీఆర్డీఏతో గతంలో ఒప్పందం చేసుకున్నాయి.
07-04-2025 సోమవారం (ఆక్వా రంగంపై ఫోకస్)
అమెరికా సుంకాల ప్రభావం ఏపీ ఆక్వా రంగంపై పడింది. దీంతో ఈ రంగం కుదేలు కాకుండా, ఆక్వా రైతులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టారు సీఎం చంద్రబాబు. సోమవారం రైతులు, ఎగుమతి వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. రైతుల ఇబ్బందులపై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక వినియోగం పెంచడంపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు సీఎం. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు సీఎం. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తోందని.. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగాన్ని సంక్షోభంలోకి పోనివ్వనని స్పష్టం చేశారాయన. ఇక ఎగుమతి దారులతో కూడా మాట్లాడి రైతులకు నష్టం లేకుండా చూడాలన్నారు. 100 కౌంట్ రొయ్యకు 220 రూపాయలకు తగ్గకుండా ధర చెల్లిస్తామని ఎగుమతి వ్యాపారులు సీఎంకు హామీ ఇచ్చారు.
07-04-2025 సోమవారం (సుపరిపాలనకు సలహా మండలి)
సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మరింత పారదర్శకంగా సుపరిపాలనను అందించాలని అన్నారు. దీని కోసం ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారాయన. గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ మద్రాస్, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులు ఈ సలహా మండలిలో సభ్యులుగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు వాట్సప్ గవర్నెన్స్ వంటి సాంకేతిక మార్గాల ద్వారా అందించే చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవలు పొందడంలో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.
07-04-2025 సోమవారం (ఆర్థిక వృద్ధి భేష్)
సీఎం చంద్రబాబు సోమవారం ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2014-19 మధ్య జీఎస్‌డీపీలో 13.49 శాతం వృద్ధి నమోదు చేశామన్నారు సీఎం. అదే సమయంలో జాతీయ స్థాయిలో జీడీపీ వృద్ధి రేటు 10.98 శాతమేనని గుర్తు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.32 శాతానికి పడిపోయిందని విమర్శించారు. దీని వలను రాష్ట్రం 76వేల 195 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయిందని తెలిపారు. 2024-25లో ఆర్థిక వృద్ధి రేటులో 12.02 శాతంతో రాష్ట్రం రెండో స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
08-04-2025 మంగళవారం (నీటి వినియోగానికి జలహారతి)
వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలి.. తద్వారా సాగు, తాగు నీటి అవసరాలను తీర్చుకోవాలి.. ఇదీ సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అందులో భాగంగానే సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్లాలని గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తున్నారు. ఇదొకటే కాదు.. వరద జలాలను ఏ విధంగా వినియోగించాలనే దానిపై జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి చైర్మన్ గా సీఎం చంద్రబాబే ఉంటారు. ఏ ఏ ప్రాంతాలను నీటి కొరత ఉంది? ఆ ప్రాంతాలను వరద నీటిని ఎలా తరలించాలి అనే అంశాలపై ఈ కార్పొరేషన్ చర్చించి పరిష్కరిస్తుంది.
08-04-2025 మంగళవారం (సూక్ష్మ సేద్యంలో మనమే ఫస్ట్)
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం మన కంట్రోల్ ఉంటుందని సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతారు. అందుకే.. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారీ ప్రకృతి సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆయన ఆలోచనలు రాష్ట్రానికి ఓ ఘనత సాధించాయి. 2024-25లో లక్షా 17వేల 880 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం చేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే రాయలసీమలో తక్కువ నీటితో పంటలు పండించి సత్ఫలితాలు సాధించడంలో రైతులు సక్సెస్ అయ్యారు. అక్కడ కొన్నేళ్లుగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. సూక్ష్మ ఎరువులను కూడా బిందుసేద్యంతో పాటే మొక్కలకు అందించే ఫర్టిగేషన్ విధానం అమలవుతోంది. దీనివల్ల దిగుబడులు పెరగడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతోంది.
08-04-2025 మంగళవారం (పీ4 పురోగతికి ప్రత్యేక సొసైటీ)
పీ4 పురోగతిపై సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి సీఎం ఛైర్‌పర్సన్‌గా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయనుంది. డిప్యూటీ సీఎం వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఇక జిల్లా చాప్టర్‌కు జిల్లా మంత్రి ఛైర్‌పర్సన్‌గా, నియోజకవర్గ చాప్టర్‌కు ఎమ్మెల్యే ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. మండల, గ్రామస్థాయిల్లో కూడా సొసైటీలు ఏర్పాటు చేస్తారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి దాతలను గుర్తించాలని అన్నారు సీఎం. దాతలు ఎవరెవరు ఎంతెంత సాయం చేశారు? బంగారు కుటుంబాలకు ఇంకా ఎంత అవసరమవుతుంది అన్న వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యం.
08-04-2025 మంగళవారం (రాజధాని నిర్మాణానికి మరిన్ని టెండర్లు)
రాజధాని అమరావతిలోని ఇ-13 రోడ్డుని NH-16తో అనుసంధానించేందుకు, ఇ-15 రోడ్డుని మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ మంగళవారం టెండర్లు పిలిచింది. ఇ-15కి 70 కోట్ల రూపాయలు, ఇ-13కి 384 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా ప్రకటించింది. రాజధాని ప్రాంతాన్ని జాతీయ రహదారులతో కనెక్ట్ చేయడానికి ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోంది.
09-04-2025 బుధవారం (అమరావతిలో సీఎం సొంతిళ్లు)
అమరావతిలో సొంతింటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఇ-6 రోడ్డు పక్కన 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు.
09-04-2025 బుధవారం ( పన్ను ఎగవేత దారులకు ఎఐతో చెక్)
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. ప్రభుత్వానికి నిధులు సమకూరాలి. అందులోనూ పన్నుల చెల్లింపులు, వసూళ్లలో అవకతవకలు జరగకూడదు. దీనిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. బుధవారం ఆదాయార్జన శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఈ సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పన్నుల వసూళ్లు పెరిగితే అన్ని పనులు జరుగుతాయని చెప్పారాయన. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతోపాటు ఎక్కడ ఆదాయం తక్కువ వస్తుందో గుర్తించి, కారణాలు వెతికి చర్యలు తీసుకోవాలని అన్నారు. నోటీసుల జారీ, పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదుల ప్రక్రియ వరకు అంతా ఆన్‌లైన్‌లో జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం లక్షా 37వేల 412 కోట్లను వందశాతం రాబట్టేలా కృషి చేయాలని చెప్పారు సీఎం. దీని కోసం ఏఐని వినియోగించాలని చెప్పారాయన.
09-04-2025 బుధవారం (ఆక్వా అభివృద్ధికి సలహా కమిటీ)
అమెరికా సుంకాలతో ఏపీ ఆక్వా రంగం ఇబ్బందుల్లో పడింది. ఈ సవాళ్లపై అధ్యయనానికి ప్రభుత్వం 16 మందితో సలహా కమిటీ నియమించింది. సుంకాల ప్రభావం, ఉపశమన చర్యలు, సత్వర పరిష్కార మార్గాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ సలహా కమిటీ మొదట ప్రాధమిక నివేదిక, తర్వాత సమగ్ర నివేదిక ఇవ్వనుంది.
10-04-2025 గురువారం (పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్)
సీఎం అధ్యక్షతన గురువారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. 16 సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో 31వేల 617 కోట్ల పెట్టుబడులు, 32వేల 633 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖపట్నంలో 13 వందల 70 కోట్లతో టీసీఎస్ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 4వేల 200 కోట్లు, మహామాయ ఇండస్ట్రీస్ 2వేల 63 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఏపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 SIPB సమావేశాలు జరిగాయి. వాటిలో 57 సంస్థలకు సంబంధించి 4లక్షల 71వేల 379 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులతో మొత్తం 4 లక్షల 17వేల 188 ఉద్యోగాలు లభించనున్నాయి.
10-04-2025 గురువారం (రహదారుల నిర్మాణానికి నిధులు)
రహదారుల ద్వారానే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించాలని సీఎం చంద్రబాబు ఆలోచన. ఆయన మొదటిసారి సీఎం అయినప్పటి నుంచీ రహదారులపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇప్పుడు కూడా రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓర్వకల్లు నోడ్‌కు 17వందల 71 కోట్లు, కొప్పర్తి నోడ్‌కు 12వందల 64 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డిజైన్ మొదలు నిర్వహణ వరకూ ఈ నిధుల్ని వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని సర్కారు తాజాగా జారీ చేసింది.
11-04-2025 శుక్రవారం (బీసీలకు రక్షణ చట్టం)
శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించిన జ్యోతిరావ్ ఫులె జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఫులె బాటలోనే ఎన్టీఆర్ మహిళల విద్యకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు సీఎం. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం మాదిరిగానే త్వరలో బీసీలకు సైతం రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే సబ్ కమిటీ కూడా వేశామన్నారాయన.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని గుర్తు చేశారు. మళ్లీ తాము 34 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధి తన బాధ్యత అని చెప్పారు చంద్రబాబు. అంతేకాదు.. మహిళలపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం.
11-04-2025 శుక్రవారం (కులవృత్తిదారులతో మమేకం)
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో సీఎం ముఖాముఖీ నిర్వహించారు. ఆగిరిపల్లిలో 206 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. బంగారు కుటుంబాల్లో కొందరిని వేదికపైకి పిలిచి వారి సమస్యలు, మార్గదర్శకులను పిలిచి పేదలను ఆదుకోవడానికి వారి ప్రణాళికలు చెప్పించారు. మార్గదర్శకులను వేదికపై సన్మానించారు. ఆ తర్వాత ఆయన కులవృత్తిదారులతో మమేకమయ్యారు. తొలుత పశువుల ఆసుపత్రి సమీపంలోని పశుపోషకుడు నక్కనబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణ వీధిలోని నాయీబ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం దుకాణానికి వెళ్లి, క్షవరం చేయించుకునే కుర్చీలో కూర్చున్నారు. ఆయన సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించారు.
11-04-2025 శుక్రవారం (టెంపుల్ టూరిజం హబ్‌గా ఒంటిమిట్ట)
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరాముని కల్యాణోత్సవానికి సీఎం హాజరైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామ రాజ్యాన్ని మళ్లీ స్థాపించాలనే తపన తనదని అన్నారాయన. తిరుమల తరహాలో ఒంటిమిట్టలో పవిత్రతను కాపాడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట ఆలయాన్ని ప్రధాన పుణ్యక్షేత్రంగా గుర్తించి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దేవాలయాల పర్యాటక హబ్‌గా ఒంటిమిట్టను తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
13-04-2025 ఆదివారం (అమరావతి విస్తరణపై ఫోకస్)
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకే.. విపక్షాలు వ్యతిరేకించినా 2014 తర్వాత 37 వేల ఎకరాల భూ సేకరణ చేశారు. అయితే.. భవిష్యత్ అవసరాల కోసం మరో 30 వేల ఎకరాలను సేకరించాలని భావిస్తోంది ప్రభుత్వం. త్వరలో రాజధాని పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం.. ఆ తర్వాత విస్తరణ పనులపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనుంది. అమరావతి IRR, ORRకి అనుసంధానంగా భూముల సమీకరించాలని భావిస్తోంది. రాజధాని విస్తరణ, భవిష్యత్ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత రాజధాని గ్రామాలు కాకుండా.. మరో 20 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టాలని ఆలోచిస్తోంది. భూ సమీకరణ సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.