HMPV Virus In India: చైనాలో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్.. కరోనాలాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇన్‌ఫ్ల్యూయెంజా A, HMPV వైరస్‌లతో చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నయి. హ్యుమన్ మెటాప్ న్యూమోవైరస్ అనే ఈ కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందంటున్నారు. అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.
ఈ హెచ్ఎంపీవీ (HMPV) వైరస్.. కరోనా వైరస్ లానే అంటువ్యాధి అని, ప్రాణాంతకం అని చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా నిమోనియా, COVID-19 వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొత్త వైరస్‌హెచ్ఎంపీవీ (HMPV) శరవేగంగా విస్తరిస్తోందంటున్నారు.
తాజాగా చైనాలో విజృంభిస్తున్న “హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి” ఎంటర్ అయింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో రెండు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మూడు, 8 నెలల చిన్నారులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఈ కేసు నమోదైంది. అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. చైనాలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అలర్ట్ అయ్యింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌లో తొలి కేసు నమోదైంది. నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఈ HMPV వైరస్ అన్ని వయస్సుల వారికి ప్రాణాంతకమేనంటున్నారు. చిన్నా పెద్దా లేకుండా అందర్నీ ఆస్పత్రి పాలు చేస్తుంది ఈ వైరస్. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకినా.. అది సాధారణంగా వచ్చిన జలుబే అనుకుని చాలా మంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే దీనికి ప్రత్యేక చికిత్సలు అంటూ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు. అయితే, చిన్నపాటి ముందుజాగ్రత్త చర్యలతో ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. కరోనా టైమ్‌లో ఎలాంటి శుభ్రత పాటించారో అలాగే ఇప్పుడు కూడా పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.
Also Read: చైనాలో మరో వైరస్.. కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త.. భారత్ ప్రభుత్వం హెచ్చరిక
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ వ్యాప్తి చెందడంపై ప్రజలు భయాందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచించింది. HMPVకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు, కాబట్టి దాని వ్యాప్తిని నియంత్రించడం ప్రధాన టాస్క్ అని వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా శ్వాసకోశ, కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా కేసులను నిశితంగా పరిశీలిస్తోంది.
అయితే చలికాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయని చైనా చెబుతోంది. చైనాలో ఇన్‌ఫ్లుఎంజా ఎ, ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిపై ప్రశ్నించగా.. సాధారణంగా దేశంలోని ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.