CM Chandrababu: త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు.. పీ4 విధానం తోడ్పడుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వగ్రామం నారావారిపల్లిలో నారా, నందమూరి కుటుంబాలు సందడి చేశాయి. స్వగ్రామంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. ఇప్పుడే అసలైన పండుగ అంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు.
12-01-2025 ఆదివారం ( ప్రతి ఇంటికీ పైప్ లైన్ గ్యాస్ )
తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే స్థానికుడి ఇంటిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా సీఎం స్వయంగా టీ పెట్టి వారికి అందించారు. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు చంద్రబాబు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైన్ లైన్ ద్వారా ఇంటికి రావడాన్ని చూస్తున్నామని.. ఇది చాలా మంచి పరిణామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ఏజీ అండ్ జీ సంస్థను అభినందిస్తున్నానని చెప్పారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్‌ను విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. గోదావరి బేసిన్ లో 40 శాతం గ్యాస్ లభిస్తోందని.. గోదావరి గ్యాస్‌ను ఏపీకి పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తామన్నారు చంద్రబాబు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యంగా మారుతుందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్ల టార్గెట్ గా నూతన పాలసీని విడుదల చేశామని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్ కో, ఎన్‌టీపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారని సీఎం అన్నారు. అలానే ప్రతి ఇంటికి సోలార్ ఎనర్జీ ద్వారా ఉచిత కరెంట్ అందించేలా ప్రణాళిక చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎన్జీ గ్యాస్ ను ప్రారంభించి వారి ఇంటిలోనే స్వయంగా కాఫీ పెట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నేచురల్ గ్యాస్ తో పాటు నేచురల్ ఫుడ్ కూడా ఉండాలని.. కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు.
12-01-2025 ఆదివారం (జీరో పావర్టీ.. P4 విధానం)
జీరో పావర్టీ విధానంపై తన ఆలోచనలు, అభిప్రాయాలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ -ప్రైవేట్- పీపుల్-పార్టనర్ షిప్ విధానం గురించి మరోసారి ప్రస్తావించారు. ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 విధానం తోడ్పడుతుందని తెలిపారు. మనం బాగుండాలి… మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి.. అప్పుడే నిజమైన పండుగ అంటూ వ్యాఖ్యానించారు.
పది సూత్రాలతో స్వర్ణాంధ్ర -2047 విజన్ ను ఆవిష్కరించామన్నారు సీఎం. ఇందులోని పది సూత్రాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. వీటిలో ప్రధమ సూత్రం జీరో పావర్టీ అని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిందే P4 విధానం అని స్పష్టం చేశారు.
జన్మభూమి స్ఫూర్తితో పీ4 విధానంలో భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారికి సీఎం పిలుపునిచ్చారు. పీ4 అమలుకు ఈ సంక్రాంతి పండుగ వేదికగా తొలి అడుగు పడాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలనుంచి సూచనలు, సలహాలు, అనుభవాలు స్వీకరిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఉన్నతమైన మన సంస్కృతీ సాంప్రదాయాలు వర్ధిల్లాలని.. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలన్నారు.
12-01-2025 ఆదివారం (యువత భాగస్వామ్యం కావాలి)
యువతకు ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకులందరికీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలన.. సమసమాజస్థాపనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందనే అద్భుతమైన సందేశాన్నిచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా చేసుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో చంద్రబాబు .. స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
12-01-2025 ఆదివారం (నిరంతర పర్యవేక్షణ ఉండాలి)
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు రేణిగుంట విమానాశ్రయంలో సీఎంను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన అనంతరం… ఆయనతో పలు అంశాలపై చర్చించారు. తిరుపతిలో తొక్కిసలాటలో మరణించిన భక్తుల కుటుంబాలకు, క్షతగాత్రులకు.. పరిహారం అందించేందుకు పాలకమండలి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. బీఆర్ నాయుడికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. టీటీడీలోని అన్ని అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని బీఆర్ నాయుడికి ప్రత్యేకంగా సూచించారు.
12-01-2025 ఆదివారం (నారావారిపల్లెకు సీఎం అండ్ ఫ్యామిలీ)
సంక్రాంతి వేడుకల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. 14వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉండనున్నారు. మంత్రి లోకేశ్ దంపతులు, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా నారావారిపల్లెకు వచ్చారు. సీఎం చంద్రబాబు ముందుగా ఆయన చెల్లెలు హైమావతి భర్త కనుమూరి చంద్రబాబు నాయుడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కొంతసేపు గడిపాక నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మరికొందరు బంధువులు శనివారమే ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా శేషాపురం సమీపంలోని శేషాచల లింగేశ్వరస్వామి గుడిని సందర్శించారు. కందులవారిపల్లిలోని వినాయకస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.
13-01-2025 సోమవారం (ప్రజలందరికి భోగి శుభాకాంక్షలు)
రాష్ట్ర ప్రజలందరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోవాలని ఆకాంక్షిస్తున్నానని రాసుకొచ్చారు. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ట్వీట్ చేశారు.
13-01-2025 సోమవారం (ఓ వైపు సంబరాలు.. మరోవైపు ప్రారంభోత్సవాలు)
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చంద్రబాబు, భువనేశ్వరి.. లోకేశ్, బ్రాహ్మణి.. బాలయ్య, వసుంధర.. సహా ఇతర కుటుంబ సభ్యులు వీక్షించారు. లోకేశ్ కుమారుడు దేవాన్ష్ సైతం ఈ పోటీల్లో పాల్గొన్నాడు. చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి విజేతలకు బహుమతులు అందజేశారు.
స్వగ్రామంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌకగా, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రామ పరిధిలోని 8 అంగన్ వాడీ కేంద్రాల్లో ఐక్యూ పెరుగుదల విధానాన్ని ప్రయోగాత్మకంగా… అమలు చేయనున్న మైక్రో ఇరిగేషన్ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు. ఇక 2 కోట్లతో రంగంపేటలో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 1 కోటితో రంగంపేట జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డ్రిప్ పరికరాలను నారా వారిపల్లెలోని ఇద్దరు రైతులు బలరాంనాయుడు, జ్యోతిలకు చంద్రబాబు అందజేశారు. అలానే నారావారిపల్లె సమీపంలోని ఐదు గ్రామాల్లోని 200 మంది మామిడి రైతులతో ఎప్పీఓ ఏర్పాటుచేసిన రిజిస్ట్రే షన్ పత్రాన్ని వారికి అందజేశారు. తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురి నుంచి వినతులు కూడా స్వీకరించారు.
ఇక ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు గురించి చెప్పాలని సీఎండీ సంతోషరావును సీఎం అడిగారు. అయితే ఆయన సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. అలసత్వం.. నిర్లక్ష్యం ఉన్నాయని మండిపడ్డారు. పండుగరోజు తిడితే బాగుండదు..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
13-01-2025 సోమవారం (గవర్నర్‌కు సంక్రాంతి విషెస్)
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల కోసం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు గవర్నర్ కు ఫోన్ చేశారు. విషెస్ తెలియజేయడంతో పాటు పలు అంశాలపై ఆయనతో మాట్లాడారు.
14-01-2025 మంగళవారం (ఆవిష్కరణలు, నివాళులు.. ప్రత్యేక పూజలు, సమావేశాలు)
సంక్రాంతిని పురస్కరించుకొని సీఎం నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా తమ కులదైవం నాగాలమ్మ తల్లి పుట్ట వద్ద చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి సహా పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలానే తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు చంద్రబాబు.
ఇక నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. విజన్ 2047ను ప్రవేశపెట్టామని.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే కూటమి లక్ష్యమని తెలిపారు. సూపర్ సిక్స్ అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీఎం. ఇప్పటికే ఉచిత సిలెండర్లు అందిస్తున్నాం.. వీలైనంత త్వరలోనే ఇంటింటికి సీఎన్జీ గ్యాస్ అందిస్తామని అన్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ షిప్ అనే కొత్త నినాదంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. వచ్చే ఉగాది లోపు నారావారి పల్లెలో అన్ని ఇళ్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేయనున్నామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. 9 వేల కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారన్నారు.
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా… మనం తినే ఆహార నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా చీడపీడలను గుర్తించే సాంకేతికత వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలకు తావు లేకుండా టెక్నాలజీ వినియోగిస్తామని అన్నారు. తిరుపతి జిల్లాకు చెందినవారిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని చెప్పారు.
15-01-2025 బుధవారం (కమ్మని విందుల కనుమ పండుగ)
కనుమ పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, శుభాకాంక్షలు తెలిపారు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కాలం మారినా తరగని అనుబంధాల విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని ట్వీట్ చేశారు. కనుమ పండుగ మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని తెలిపారు.
15-01-2025 బుధవారం (స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఊరట)
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో తాము కల్పించుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని సీఎం చంద్రబాబు తరఫు లాయర్ కు సూచించింది. ఈమేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ తీర్పు వెలువరించింది.
15-01-2025 బుధవారం (సైనికుల ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం)
దేశ రక్షణలో సైనికులు చూపుతున్న ధైర్యసాహసాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశసార్వభౌమత్వాన్ని కాపాడటంలో సైనికుల త్యాగాలు అద్భుతమని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో దేశం కోసం వారి నిస్వార్థ సేవ వర్ణనాతీతం అని పోస్ట్ చేశారు.
16-01-2025 గురువారం (P4 అనేది గేమ్ ఛేంజర్)
ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని.. సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు వచ్చాయని.. 1993లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేసారని.. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకువెళ్తుందని చెప్పారు. సంపద సృష్టికి P4 విధానం తెస్తున్నామని సీఎం చెప్పారు. P4 అనేది గేమ్ ఛేంజర్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇక తాము తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌కు 16 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలు చెప్పారని సీఎం వెల్లడించారు. పోలవరం ఏపీకి లైఫ్ లైన్ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వెల్తీ, హెల్తీ ఫ్యామిలీనే తన గోల్ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దెలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఏపీ వృద్ధి రేటు 2.8 శాతం ఎక్కువగా నమోదు అయిందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 15.86 వృద్ధి నమోదు అవుతుందని వెల్లడించారు. దేశంలో జనాభా తగ్గుతోందని.. సంపదతో పాటు జనాభా సృష్టి జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు.
16-01-2025 గురువారం (నితీశ్ కుమార్ రెడ్డికి నజరానా)
ఆస్ట్రేలియా పర్యటనలో ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. తన తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి నితీశ్.. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన ప్రదర్శనకు గాను ఆంధ్రా క్రికెట్ సంఘం 25 లక్షల నజరానా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్.. సీఎం చేతుల మీదుగా ఆ నజరానా చెక్ ను నితీశ్ కుమార్ రెడ్డికి అందజేశారు. అలానే నితీశ్ ను చంద్రబాబు సత్కరించారు. సోషల్ మీడియా వేదికగా కూడా సీఎం రియాక్ట్ అయ్యారు. యువ క్రికెటర్ మన నితీశ్ కుమార్ రెడ్డి.. ప్రపంచ వేదికపై భారత్ కు గర్వకారణంలా నిలిచారని కొనియాడారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సెంచరీలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
17-01-2025 శుక్రవారం (విజయపరంపర కొనసాగాలి)
చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా సీఎం పంచుకున్నారు. మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తాను సాధించిన ట్రోఫీని ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుకు చూపించారు. భవిష్యత్తులో ఆమె విజయపరంపర కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.
17-01-2025 శుక్రవారం (కీలక నిర్ణయాలకు ఆమోదం)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ధాన్యం కొనుగోలకు రూ.700 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతి తెలిపింది. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై చర్చించింది. గ్రామ సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థపై చర్చకు వచ్చింది.ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గించాలని నిర్ణయించింది. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌పై కుడి, ఎడమ వైపు మిని హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.
కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ ఫ్రా కార్పొరేషన్ కు.. కేటాయించిన 2 వేల 595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూముల పై నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించగా.. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ..
సమావేశం అనంతరం పలు రాజకీయ అంశాలపై కూడా చంద్రబాబు చర్చించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.. మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేసిన వెంటనే.. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని తెలిపారు. అలానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించి.. నిర్దేశిత సమయం లోపు పూర్తి చేయాలన్నారు. రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
17-01-2025 శుక్రవారం (అలసత్వం వహిస్తే యాక్షన్ తప్పదు)
అలసత్వం ప్రదర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదని… కావాల్సింది ఫలితాలు అని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు హెచ్చరించారు. పలువురు నేతలు సోషల్ మీడియా వినియోగంలో విఫలమయ్యారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సమావేశానికి పలువురు ఎంపీలు రాకపోవడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా? అని మండిపడ్డారు. ఎమ్మెల్యే తప్పు చేస్తే ఇంచార్జ్ మంత్రిదే బాధ్యత అని తెలిపారు. అలానే ఇంచార్జ్ మంత్రులు, ఎంపీలకు జిల్లాల వారీ పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
17-01-2025 శుక్రవారం (ఇకపై అన్నీ మంచి రోజులే..)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 11 వేల 440 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఇస్తున్నట్టు కేంద్రం అధికారిక ప్రకటన చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులేనని ఆనందం వెలిబుచ్చారు. ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అలానే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న అంశం అని తెలిపారు. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు.
18-01-2025 శుక్రవారం (వెలుగులు నింపిన మహానీయుడు.. ఎన్టీఆర్)
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆరే అని చెప్పారు. ఎన్టీఆర్ స్త్రీలకు సాధికారతను ఇచ్చిన సంస్కర్త అని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.
18-01-2025 శుక్రవారం (స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మైదుకూరులో.. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రీన్ వాక్ చేశారు. మైదుకూరులో రాయల సెంటర్ నుంచి జడ్పీ హైస్కూల్ వరకు గ్రీన్ వాక్ చేశారు. జడ్పీ హైస్కూల్లో సీవరేజి ట్రీట్ మెంట్ పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలతో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. చెత్త సేకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని చంద్రబాబు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర సాధనకు చేయీచేయీ కలిపి కలసికట్టుగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి నెలా మూడో శనివారం ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాల్ని నిర్వహించాలన్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకూ… తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. అనుక్షణం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడని పేర్కొన్నారు. ఈ సభలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. అలానే కార్మికులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులిస్తామని చెప్పారు. ఈ మేరకు మైదుకూరులో ముగ్గురు కార్మికులకు రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించడంతో పాటు వారిని ఘనంగా సత్కరించారు.
ఈనెల చివరలో వాట్సప్ గవర్ననెన్స్ తీసుకొస్తున్నామన్నారు సీఎం. ఫోన్ ద్వారానే అన్ని సేవలు అందుబాటులోకి తేవడం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. కడప ఎయిర్ పోర్టులో 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గండికోటను అన్ని విధాల అభివృద్ధి చేసి.. పర్యాటక హబ్‌గా తయారు చేస్తామని సీఎం చెప్పారు. బనకచర్లకు జలాలు తీసుకురావడం తన జీవితాశయం అన్నారు సీఎం. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలని వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారంతో 12 వేల 200 కోట్లతో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించాం అని.. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని గెలిపించారంటూ చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. కాస్త కష్టపడి ఉంటే కడప ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేవాళ్లమన్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ సహా అన్ని అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి సభ్యత్వాలతో పార్టీ రికార్డు సృష్టించిందని.. ఈ విషయంలో లోకేశ్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. కడపలో విర్రవీగిన నియంతలు కాలగర్భంలో కలసిపోయారని.. ముఠా కక్షల్ని అణచివేశామని చంద్రబాబు అన్నారు.
18-01-2025 శుక్రవారం (12వ పీఆర్సీ నియమించాలి)
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆప్టా డైరీ, క్యాలెండర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ నియమించాలని సీఎం చంద్రబాబును ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ఈ కార్యక్రమంలో ఆప్టా అధ్యక్షుడు గణపతిరావు సహా పలువురు పాల్గొన్నారు.
18-01-2025 శుక్రవారం (అమిత్ షా ఆగయా.. కీలక భేటీ)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అంతకు ముందు షాకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు లోకేశ్, అనిత.. కూటమి నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న అమిత్ షాకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ఎంపీ పురందేశ్వరీ ఘన స్వాగతం పలికారు. దాదాపు గంటా ఇరవై నిమిషాలకు పైగా అమిత్‌షా, చంద్రబాబు, పవన్ ల మధ్య భేటీ జరిగింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఎన్డీఏ కీలక నేతల మధ్య చర్చ జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై అమిత్ షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అంశంపై చంద్రబాబు విన్నవించారు.