19-01-2025 ఆదివారం (మరింత సాయం అవసరం )
ఆదివారం సీఎం చంద్రబాబు కొండపావులూరులో ఎన్‌ఐడీఎం దక్షిణాది క్యాంపస్, ఎన్డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ భవనాల ప్రారంభం, 20వ వ్యవస్థాపక దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కూడా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విధ్వంసంతో వెంటిలేటర్‌పైకి చేరిన రాష్ట్రానికి కేంద్రం సాయంతో ఆక్షిజన్ అందించామని అన్నారాయన. రాష్ట్రాన్ని కరవురహితంగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారు సీఎం. ఈ ప్రాజెక్టుకు కేంద్రసాయం అందించాలని హోంమంత్రి అమిత్ షాను కోరారు.
ఈ సభలో సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కేంద్రం సహాయం అందిస్తుందని చెబుతూనే ఇంకా సాయం చేయాలని అన్నారు. అక్కడితో ఆపకుండా తాము కేంద్రం మీద ఒత్తిడి చేయడం లేదంటూనే ఏపీ కోలుకునే వరకు సాయమందించాలని కోరుతున్నామని చెప్పారు. కేంద్రం మరింత చేయూత అందిస్తే అద్భుతాలు సృష్టించగలమని ధీమా వ్యక్తం చేశారు సీఎం. ఇప్పటి వరకు కేంద్రం నుంచి అందిన సాయాన్ని కూడా వివరించారు.
ఈ సభలో అమిత్ షాపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కొన్నిసార్లు అమిత్ షా పనితీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందన్నారు. ఆయన మనిషిలా కాకుండా మిషన్‌లా పనిచేస్తారని చెప్పారు. అమిత్ షా వనరులు సమకూర్చడమే కాకుండా.. విపత్తు సమయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని అన్నారు.
19-01-2025 ఆదివారం ( టూర్ దావోస్)
ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి నారాలోకేష్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ కూడా ఉన్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్‌లో సీఎం టీం పర్యటన జరిగింది. దావోస్ వెళ్లడానికి ముందు ఆయన స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వెళ్లి అక్కడి నుంచి దావోస్ వెళ్లారు.
20-01-2025 సోమవారం (జ్యూరిక్‌లో ఘనస్వాగతం )
సీఎం చంద్రబాబు నాయుడు బృందానికి జ్యూరిక్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్దఎత్తున తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతో సీఎం ముచ్చటించారు. ఆ తర్వాత తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. నిత్య స్ఫూర్తి నిచ్చే తెలుగు జాతిలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతానని చెప్పారు సీఎం. తెలుగువారు ప్రపంచమంతా ఉండాలని ఆక్షాంక్షించారు. కర్మభూమిని పట్టించుకోవాలని.. జన్మభూమికి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి యూరప్‌లోని 12 దేశాల నుంచి తెలుగు ప్రజలు వచ్చారు.
20-01-2025 సోమవారం (తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ )
జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై చర్చించారు.
20-01-2025 సోమవారం (ఏపీ, స్విట్జర్లాండ్ బంధానికి పునాదులు)
పర్యటనలో ముందుగా జ్యూరిక్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్ కుమార్‌కు చెప్పారు.
20-01-2025 సోమవారం (స్విస్ సీఈవోలతో భేటీ)
ఆ తర్వాత దావోస్‌లో చంద్రబాబు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో నిర్విరామంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మొదటి రోజు స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో సమావేశం అయ్యారు. స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్‌టైల్స్ సీఈవోలను ఏపీకి ఆహ్వానించారు.
20-01-2025 సోమవారం (పరిశ్రమల ఏర్పాటుకు ఊతం )
పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చేలా ఏపీ భవన నిర్మాణ నిబంధనలను సవరించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త సవరణల ప్రకారం పారిశ్రామిక రంగంలోనూ బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. కొత్తగా కల్పించిన వెసులుబాట్లతో తక్కువ స్థలంలో భారీ పరిశ్రమల ఏర్పాటు చేయోచ్చు. ఇక అదే భవనంలో పరిశోధనలు, కార్మికులకు శిక్షణ, వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించే వీలుటుంది. పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ ఆలోచన. దీంతో అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
20-01-2025 సోమవారం (బదిలీలతో పాలనలో ప్రక్షాళన )
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీగా అధికారులను బదిలీ చేసింది. 25 మంది ఐఏఎస్, 27 మంది ఐపీఎస్ అధికారుల్ని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. కొంతమందిని ఇప్పుడున్న పోస్టుల్లోనే కొనసాగిస్తూనే అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏ అధికారులను ఎలా పని చేయించుకోవాలో చంద్రబాబుకి బాగా తెలుసు. అందులో భాగంగానే బదిలీలు చేస్తూ ఉంటారు.
21-01-2025 మంగళవారం ( గ్రీన్ ఇండస్ట్రీస్‌కు బాబు భరోసా)
దావోస్‌లో రెండోరోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై సీఐఐ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఏపీ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమని ఆయన చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. 1999లో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని అక్కడ గుర్తు చేశారు. వాటి ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు సీఎం. జనాభాయే భారతదేశానికి ఉన్న గొప్ప ఆస్తి అని చంద్రబాబు వారికి సూచించారు. భారతీయ పారిశ్రామికవేత్తలు, ప్రత్యేకంగా ఏపీ వారు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ఆయన అభిప్రాయం. 2027 నాటికి దేశ జీడీపీ వృద్ధిరేటు భారీగా పెరుగుతుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసిన విషయాన్ని గుర్తు చేశారు.
21-01-2025 మంగళవారం ( దిగ్గజ కంపెనీలకు సీఎం పిలుపు)
రెండోరోజు పలు దిగ్గజ సంస్థల సీఈఓలు, ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మేర్స్‌క్ సంస్థ సీఈఓ విన్సెంట్ క్లార్క్‌తో ఆయన కీలక చర్చలు జరిపారు. మేర్స్‌క్ సంస్థ 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేర్స్‌క్ సంస్థ.. పెట్టుబడులతో వస్తే సముద్ర రవాణారంగంలో దేశంలోనే ఏపీ అగ్రగామి అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత సిస్కో సంస్థ సీఈఓ చుక్ రాబిన్స్‌ను చంద్రబాబు కలిసారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. ఏపీలో నెట్‌వర్క్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనను పరిశీలించాలని చెప్పారు. దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌తో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట – విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను వివరించారు.
కూల్ డ్రిక్స్, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ భేటీ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. ఆ తర్వాత ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్రతినిధులను కలిశారు. అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై చర్చించారు.
22-01-2025 బుధవారం ( బిల్ గేట్స్‌తో బాబు భేటీ )
మూడో రోజు కూడా చంద్రబాబు కీలక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.ప్రధానంగా బిల్‌గేట్స్‌తో భేటీ అందరినీ ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని బిల్ గేట్స్‌ను కోరారు సీఎం. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఏపీలో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
22-01-2025 బుధవారం ( కంపెనీల నుంచి సానుకూల స్పందన )
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక, మలేషియాకు చెందిన పెట్రోనాస్ ప్రతినిధులను కలిశారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడలో 13 వేల కోట్లతో ఓ ప్లాంట్‌ను పెట్టాలని ఇప్పటికే నిర్ణయించింది. అయితే.. చంద్రబాబుతో జరిగిన మీటింగ్‌లో ఈ పెట్టుబడులను మరింతగా పెంచాలని నిర్ణయించింది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్‌గా ఉన్న పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ ప్రతినిధులతో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్‌ను పెప్సికో బెవరేజెస్ నిర్వహిస్తుంది. అయితే విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు సీఎం. కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
22-01-2025 బుధవారం ( వారసత్వం ఓ మిథ్య )
ఏపీలో లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్ని డిమాండ్లపై దావోస్ వేధికగా స్పందించారు సీఎం. ఏ రంగమైనా వారసత్వం ఓ మిథ్య అని అన్నారాయన. లోకేష్ వ్యాపారం చాలా తేలికగా చేయగలరని అభిప్రాయపడ్డారు. కానీ, ప్రజాసేవ చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అందులో సక్సెస్ అయితే ముందుకెళ్తారని.. లేదంటే వెనకబడతారని అన్నారు. ఇందులో వారసత్వం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం.
23-01-2025 గురువారం ( నిర్విరామ భేటీలు)
చంద్రబాబు దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. చివరి రోజు కూడా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, చె హోల్డింగ్స్ వైస్-ఛైర్మన్ ఆండ్రే హాఫ్‌మన్‌ను కలిశారు. ఆ తర్వాత అలాగే యూఎన్‌డీపీ అధిపతి అచిమ్ స్టెయినర్, సీఎన్ఎన్ బెకీ ఆండర్సన్‌తోనూ చర్చించారు. అన్ని భేటీలు ముగిసిన తర్వాత సీఎం బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
24-01-2025 శుక్రవారం (బడ్జెట్ ద్వారా భరోసా ఇవ్వండి)
4 రోజుల దావోస్ పర్యటన తర్వాత చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశమై దావోస్‌లోని జరిగిన చర్చలపై ఆమెకు వివరించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు 11వేల 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు.
24-01-2025 శుక్రవారం ( 2019 ఎలక్షన్ ఎఫెక్ట్ )
ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఆయనకు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉండవల్లిలో తన ఇంట్లో చంద్రబాబు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. జగన్ 2019లో అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు ఉండేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిందే ఎక్కువని అన్నారు.
25-01-2025 శనివారం ( దావోస్‌లో బ్రాండ్ ఏపీ)
నాలుగు రోజుల దావోస్ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు శనివారం వివరించారు. దావోస్‌కు వెళ్లేది ప్రధానంగా మన రాష్ట్ర బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి అని చెప్పారు. 27 ముఖాముఖిలు, నాలుగు రౌండ్‌టేబుల్ సదస్సులు, మూడు కాంగ్రెస్ సెషన్స్, యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ జనరల్‌తో ఒక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశాల అధినేతలను, కంపెనీల ప్రతినిధులను ప్రత్యేకంగా ఆదేశాలకు వెళ్లి కలవాలంటే చాలా సమయం పడుతుందని చెప్పారు. కానీ, దావోస్ లో ఈసీగా మీట్ అవ్వొచ్చని అన్నారు. అందుకే 4 రోజుల్లో చాలా మందితో భేటీ అయ్యి కీలక ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేశానని తెలిపారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ప్రకృతి వ్యవసాయంపైనే ప్రధానంగా దృష్టి పెట్టానని అన్నారు.
25-01-2025 శనివారం ( నమ్మకం లేకే రాజీనామాలు)
విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీపై నమ్మకం లేనపుడు ఎవరైనా వీడి వెళ్తారని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం ఆ పార్టీ ఇంటర్నల్ మేటర్ అని చెప్పారు చంద్రబాబు. దానిపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు.