CM Chandrababu: ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూడకూడదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. కొత్త మార్గాలను వెతుక్కోవాలి.. చాలా మందికి స్పూర్తిగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు యువతకు చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఈ వారం కూడా యువత స్పోట్స్ వైపు ఇంట్రస్ట్ చూపించే కీలక నిర్ణయాలు తీసుకున్నారాయన.
03-11-2024 ( ఆదివారం ) ( 3 నెలలకు ఓసారి పింఛన్ తీసుకునే ఛాన్స్)
ఏపీ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులు వరుసగా 2 నెలల సామాజిక పింఛను తీసుకోకపోతే మొత్తం 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 2014-19 మధ్యలో ఈ విధానం ఉండేది. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన్న తర్వాత దీన్ని రద్దు చేశారు. ఈ విధానం డిసెంబరు నుంచే అమలులోకి రానుంది. నవంబరులో అందుకోలేనివారు డిసెంబరు 1న రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఉపయోగపడుతుంది. నవంబరులో దాదాపు 45 వేల మంది పింఛను తీసుకోలేదని అధికారులు గుర్తించారు. పింఛను ఇచ్చే సమయానికి కొందరు ఆస్పత్రిలో ఉండొచ్చు, మరి కొందరు వృద్ధులు పిల్లల దగ్గర వేరే ఊర్లో ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు పించన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి.. ఇలాంటి ఇబ్బందుల కారణంగా రెండు నెలల పించన్ తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం తీసుకునే అవకాశం కల్పించారు.
04-11-2024 ( సోమవారం ) ( ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తే రూ. 7 కోట్లు)
కొత్త స్పోట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రీడాకారులపై వరాలు కురిపించారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహకం 75 లక్షల రూపాయల నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలకు పెంచారు. రజత పతకం సాధించిన వాళ్లకు 5 కోట్లు, కాంస్య పతకం గెలిస్తే 3 కోట్ల రూపాయలకు ప్రోత్సహకాలు పెంచుతూ నిర్ణయించారు. ఇక.. ఒలింపిక్స్‌లో పాల్గొంటే చాలు.. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
04-11-2024 ( సోమవారం ) ( ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధిస్తే రూ. 4 కోట్లు)
ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధిస్తే 4 కోట్లు, సిల్వర్ మెడల్ గెలిస్తే 2 కోట్లు, బ్రాంజ్ మెడల్ సాధిస్తే కోటి రూపాయలు ఇవ్వనున్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న వారికి 10లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు.. వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో, జాతీయ క్రీడల్లో పాల్గొన్నవారి కూడా భారీగానే ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహించడంలో హరియాణా మొదటి స్థానంలో ఉంది. కానీ.. అంతకుమించి ఏపీలో స్పోర్ట్సుకు సపోర్టు చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
04-11-2024 ( సోమవారం ) ( స్పోర్ట్స్ సిటీగా అమరావతి)
స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతోపాటు తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో స్పోట్స్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది. కడప, విజయవాడ, విజయనగరంలో స్పోట్స్ స్కూల్స్ మొదలు పెట్టాలని ఓ ఆలోచన కూడా ఉంది. ఇలాంటి ప్రోత్సహకాలతో యువత ఎక్కువగా క్రీడల వైపు ఇంట్రస్ట్ చూపిస్తారని చంద్రబాబు ఆలోచన. హరియాణ నుంచి ఎక్కువుగా క్రీడాకారులు, రెజ్లర్లు ఉండటానికి ప్రధాన కారణం ప్రోత్సహకాలేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
04-11-2024 ( సోమవారం ) (అమరావతిలో నిర్మాణాలకు లైన్ క్లియర్)
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సీఆర్డీఏ అథారిటీ 39వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో కొన్ని పనులకు 2014-19 మధ్య పిలిచిన టెండర్లకు కొన్నాళ్ల క్రితమే గడువు ముగిసింది. ఆ టెండర్లను క్లోజ్ చేస్తేనే.. కొత్తగా టెండర్లు పిలవడానికి అవకాశం ఉంటుంది. దీంతో.. వాటికి క్లోజ్ చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించడానికి ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్ల కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో కొత్త టెండర్లకు లైన్ క్లియర్ అయింది. రాజధానిలో హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు టెండర్లను జనవరి లోగా పిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. మిగిలిన పనులకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే టెండర్లకు ఆహ్వానిస్తామన్నారాయన.
05-11-2024 ( మంగళవారం ) ( సెమీకండక్టర్, డ్రోన్ పాలసీపై చర్చ)
మంగళవారం సీఎం చంద్రబాబు సెమీకండక్టర్లు, డ్రోన్ పాలసీ, ఐటీ పాలసీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వాటికి సంబంధించిన ముసాయిదాల్లో కొన్ని మార్పులు సూచించారు. అయితే ఐటీ పాలసీ ఆమోదానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సెమీకండక్టర్ పాలసీపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ చేసింది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన పలు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏర్పాటయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్న సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ రాష్ట్రాల జాబితాలో ఏపీని కూడా చేర్చాలని చంద్రబాబు ఆలోచన. పెట్టుబడులను ఆకర్షించడానికి బెస్ట్ పాలసీని ప్రభుత్వం రెడీ చేస్తోంది.
05-11-2024 ( మంగళవారం ) ( సెమీ కండక్టర్స్ మార్కెట్ అందిపుచ్చుకునే ప్లాన్)
ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల మార్కెట్ 2023లో 4వేల 458 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వచ్చే పదేళ్లలో ఇది 7వేల 822 లక్షల కోట్ల రూపాయలకు వెళ్తుందని ఓ అంచనా. ఈ రంగంలో ఏటా 6.5 శాతం వృద్ధి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. సెమీకండక్టర్ల రంగంలో సెంట్రల్ గవర్నెమెంట్ కూడా స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తోంది. సెమికాన్ ఇండియా పథకం కింద సెమీకండక్టర్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 60 వేల కోట్ల రూపాయల ప్రోత్సహకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ ప్రోత్సహకాలను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు ఆలోచన. ఇక.. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం ద్వారా.. తయారీ రంగంలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. రానున్న ఐదేళ్లలో కనీసం 10 వేల మందికి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటుంది.
05-11-2024 ( మంగళవారం ) ( పోలవరం నిర్మాణంపై చర్చ)
ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం సమావేశమయ్యారు. నవంబరు 22, 23న పోలవరాన్ని సందర్శింస్తానని… ఆరోజు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోని.. వారు ఇచ్చిన గడువులోపు ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశించారు. 2026 మార్చి నాటికి డయాఫ్రం వాల్ పూర్తవుతుందని నిర్మాణ కంపెనీ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ప్రారంభిస్తే 2028 మార్చికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలమని తెలిపారు. ఒకవేళ డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం సమాంతరంగా నిర్మిస్తే 2027 నాటికే నిర్మాణం పూర్తవుతుందని వివరించారు.
05-11-2024 ( మంగళవారం ) ( పోలవరం కాలువల నిర్మాణంపై చర్చ)
పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంచాలా.. లేకపోతే కాలువను ఆనుకుని మరో కాలువ తవ్వాలా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఎడమ కాలువ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి ఉత్తరాంధ్రకు నీళ్లు పంపాలని, అక్కడి జలాశయాలను నింపాలని సీఎం టార్గెట్ పెట్టారు. పనులకు టెండర్లు పిలిచామని, 960 కోట్ల రూపాయల పనులు డిసెంబరు నుంచి ప్రారంభించి 2025 జులై నాటికి పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. 2025 నాటికి పోలవరం తొలిదశ పునరావాసానికి భూ సేకరణ పూర్తిచేసి 2026 ఏప్రిల్ నాటికి పునరావాసం పనులు పూర్తి చేస్తామన్నారు. ఇందుకు రూ.7,213 కోట్లు అవసరమని ముఖ్యమంత్రికి తెలిపారు.
ప్రపంచం రేపు ఎలా ఉంటుందని అంచనా వేయడం పెద్ద విషయం కాదు. కానీ.. 50 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది. 5 దశాబ్ధాల తర్వాత కూడా యువతకు ఉపాధి అవకాశాలు లభించాలంటే ఏం చేయాలి? ఓ ప్రాంతం 3 ఏళ్ల ముందే అభివృద్ది చెందితే ఎలా ఉంటుందని ఆలోచించే అరుదైన విజనరీ నేతల్లో చంద్రబాబు ఒకరు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా సెమీ కండక్టర్స్, డ్రోన్స్ సిస్టమ్స్ పై ఉంది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. అంతేకాదు.. సీ ప్లేన్ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచన.
06-11-2024 (బుధవారం ) ( భూ కబ్జా చేస్తే 14 ఏళ్లు జైలు శిక్ష- కేబినెట్ నిర్ణయం)
బుధవారం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూ ఆక్రమణ దారులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం-1982ను రద్దు చేయాలని నిర్ణయించింది. దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పాత చట్టం ప్రకారం భూ ఆక్రమణలకు పాల్పడితే రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష ఉండేది. కానీ.. కొత్త చట్టం ప్రకారం ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా నిబంధనలు తీసుకురావాలని ఓ ప్రతిపాదన. అంతేకాదు.. భూమి విలువతోపాటు, నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు.
06-11-2024 (బుధవారం ) (డ్రోన్, డేటా సెంటర్, సెమీ కండక్టర్ పాలసీలకు కేబినెట్ ఆమోదం )
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలును డ్రోన్ తయారీ హబ్‌గా చేయాలనేది దీని లక్ష్యం. దీనివల్ల వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు, 3 వేల కోట్ల రూపాయల రాబడి వస్తుందని ఓ అంచనా. 15 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని టార్గెట్. ఇక ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0కి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024-29లో 200 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని ఈ పాలసీ లక్ష్యం. ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫాబ్ పాలసీ 4.0ని కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా చిప్, సెమీకండక్టర్ల రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉంది. దేశంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసే కంపెనీలకు కేంద్రం 50 శాతం రాయితీలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 30 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
06-11-2024 (బుధవారం ) ( సీఆర్డీఏ పరిధి విస్తరణకు కేబినెట్ ఆమోదం)
ఏపీ సీఆర్‌డీఏ పరిధిని 8వేల 352.69 చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా వెయ్యి 69 చదరపు కిలోమీటర్ల మేర సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలో 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలు సీఆర్‌డీఏ పరిధిలోకి రానున్నాయి. 189 కిలో మీటర్ల అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
07-11-2024 (గురువారం ) ( తాళ్లాయపాలెంలో జీఐఎస్ ఉపకేంద్రం ప్రారంభం)
గురువారం సీఎం చంద్రబాబు రాజధానిలోని తాళ్లాయపాలెంలో జీఐఎస్ ఉపకేంద్రం ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ నిర్వాకాన్ని ఆయన వివరించారు. జగన్ హయాంలో విద్యుత్తు శాఖ లక్షా 20 వేల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు. ఇద్దరి మధ్య అవగాహన ఒప్పందం చేసుకుంటే.. దానిని రద్దు చేయడం కుదరదని అన్నారు. కానీ.. 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను జగన్ రద్దు చేశారని చెప్పారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో.. ఒక్క యూనిట్ విద్యుత్తు కూడా వాడుకోకుండానే ఆ సంస్థలకు 9వేల 900 కోట్ల రూపాయలు చెల్లించారని అన్నారు.
07-11-2024 (గురువారం ) ( పిచ్చి పోస్టులు పెడితే తాట తీస్తానని సీఎం వార్నింగ్ )
ఇదే మీటింగ్‌లో చంద్రబాబు సోషల్ మీడియా పోస్టుల అంశాన్ని ప్రస్తావించారు. ఒక్కొక్కరు మదమెక్కిన ఆంబోతుల్లా ఆడపిల్లలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా అని ప్రశ్నించారు. తన గురించి, తన భార్య గురించి అసెంబ్లీలో నీచంగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టుల గురించి ప్రస్తావించారు. ఇకపై ఇలాంటివారి ఆటలు సాగనీయనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలోని చట్టాలన్నీ అధ్యయనం చేసి, పటిష్ఠమైన చట్టం తెస్తానని హామీ ఇచ్చారు.
07-11-2024 (గురువారం ) ( ఎస్సీ వర్గీకరణపై మంత్రులతో చర్చ )
ఎస్సీ వర్గీకరణ, దళితుల సంక్షేమం, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు గురువారం ఆ శాఖ మంత్రులతో చర్చించారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అధ్యయనానికి త్వరలో కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోపే నివేదిక అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వమే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిందని గుర్తు చేశారు. తర్వాత న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయిందని అన్నారు. రీసెంట్‌గా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతోపాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చామని అన్నారు.
07-11-2024 (గురువారం ) ( ఎస్సీ వర్గీకరణపై మంత్రులతో చర్చ )
విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితోపాటు వ్యాపార అవకాశాలను కల్పించడం ద్వారా దళితులను మరింత ముందుకు తీసుకెళ్లొచ్చని చంద్రబాబు చెప్పారు. 2014-19 మధ్య అమలు చేసిన పారిశ్రామిక రాయితీల కంటే మరింత ఎక్కువగా చేయూత అందిస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు, ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకుగాను 27 స్థానాల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారాయన. ప్రజల నమ్మకాన్ని నిజం చేసుకుంటామని చెప్పారు.
08-11-2024 (శుక్రవారం ) (సీ ప్లేన్ ట్రయల్ రన్)
చంద్రబాబు సీఎం అయిన తర్వాత పర్యటక రంగంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈ రంగం అభివృద్ధి చెందితే అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటుందని సీఎం ఆలోచన. ఇందులో భాగంగా దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగాన్ని ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ట్రయల్‌రన్ శుక్రవారం నిర్వహించారు. సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కిలోమీటర్ల గగనవిహారం ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 1,500 అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణిస్తుంది. దీంతో పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపించాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ ప్రయాణానికి 30 నిమిషాలు పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోను.. 20 నిమిషాలు గగనంలో విహరిస్తారు.
08-11-2024 (శుక్రవారం ) ( రియల్ టైం గవర్నెన్స్‌పై చర్చ)
రియల్ టైం గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది పౌరుల డేటా అందుబాటులో లేదని.. వెంటనే సేకరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లనూ జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు. అన్ని విభాగాల్లోని డేటాను ఒక వేదికపైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి.. ప్రభుత్వ పథకాలను విశ్లేషించాలని తెలిపారు. ఈ విధానంలో మార్పులు తెచ్చేలా సాంకేతికత వినియోగించాలని చెప్పారు.
09-11-2024 (శనివారం ) ( సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించిన సీఎం)
శనివారం సీఎం చంద్రబాబు సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించారు. విజయవాడలోని కృష్ణానది పున్నమిఘాట్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌లో వెళ్లారు. మళ్లీ అక్కడ నుంచి తిరిగి సాయంత్రం సీప్లేన్‌లోనే పున్నమిఘాట్‌కు వచ్చారు. ఇక భవిష్యత్తు అంతా పర్యాటకానిదేనని సీఎం అన్నారు. సీప్లేన్‌తో టూరిజంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడితే.. ఆరు రెట్లు లాభాలు వస్తాయన్నారు చంద్రబాబు. లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సీఎం లెక్క.
09-11-2024 (శనివారం ) ( శ్రీశైలాన్ని తిరుమలగా అభివృద్ధి చేస్తామని హామీ)
విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి దివ్యక్షేత్రాలను సీప్లేన్‌తో కలిపామని చెప్పారు చంద్రబాబు. విజయవాడ నుంచి 40 నిమిషాల్లోనే శ్రీశైలం చేరుకున్నామని తెలిపారు. అంతేకాదు.. శ్రీశైలం, గండికోట, ప్రకాశం బ్యారేజ్, కోనసీమ, అరకు వ్యాలీ, పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలుపుతామని అన్నారు. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడంతోపాటు జంగిల్ సఫారీనీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. శ్రీశైలం ప్రాంతాన్ని తిరుమల మాదిరిగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
09-11-2024 (శనివారం ) (రెండో విడతలో నామినేటెడ్ పోస్టులు భర్తీ)
ఏపీ ప్రభుత్వం శనివారం రెండో విడతలో నామినేటెడ్ పోస్టులను భర్తీచేసింది. టీడీపీ నుంచి 48, జనసేన నుంచి 10, బీజేపీ నుంచి ముగ్గురికి పదవులను ప్రకటించింది. వీరితోపాటు ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నైతికవిలువల సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది.