BigTV English

Cm Revanth Reddy: ఏపీపీ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

Cm Revanth Reddy: ఏపీపీ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

Cm Revanth Reddy: మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు, గ్రామీణ రోడ్లకు మహర్దశ కల్పించడం, దివ్యాంగుల కోసం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ, ప్రజల వద్దకే రెవెన్యూ ప్రోగ్రామ్, తెలంగాణ కవులు, కళాకారులకు సత్కారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటనలు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం దిశానిర్దేశం.. వీటిపై ఫుల్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.


01-06-2025 ఆదివారం ( ఏపీపీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ )

నియామకాల విషయంలో శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెలంగాణలో 118 మంది అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం 285 ఏపీపీ పోస్టులకుగాను 120 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ లో పెద్దమొత్తంలో పోస్టులు భర్తీ కానున్నాయి. 2022లో ప్రభుత్వం చివరిసారిగా 92 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది. ట్రైనింగ్ తర్వాత వారంతా విధుల్లో చేరగా అనంతరం పలువురికి ప్రమోషన్లు రావడంతో 165 ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయి.


02-06-2025 సోమవారం ( తెలంగాణ రైజింగ్ 2047 )

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని సీఎం రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌ – 2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న పరేడ్‌ గ్రౌండ్స్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్‌ ప్రణాళికలను సీఎం రేవంత్ వివరించారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ, నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, కులగణనతో దేశానికి ఆదర్శంగా నిలిచామని, యువతే మన భవిష్యత్తు అని చెప్పి 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు. రైతన్న సంక్షేమానికి పెద్దపీట, ఇందిరా మహిళా శక్తి మిషన్‌ ఇలాంటి కార్యక్రమాల గురించి వివరించారు.

02-06-2025 సోమవారం ( జపాన్ తో ఒప్పందాలు )

తెలంగాణ భవిష్యత్ కోసం కొత్తగా ప్రపంచ భాగస్వామ్యాలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టెక్యూచి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి రంగాల్లో అవగాహన ఒప్పందం కుదిరింది. భావితరాల అవసరాలకు తగ్గట్లు జపాన్‌లోని కిటాక్యుషు నగరం స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్‌ను అభివృద్ధి చేయనున్నారు.

02-06-2025 సోమవారం ( ఉద్యమ నేతలకు సత్కారం )

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ పురస్కారాలు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఉద్యమ కళాకారులను సన్మించింది ప్రభుత్వం. కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించారు. తెలంగాణ ఉద్యమ ప్రముఖులు తొమ్మిది మందికి ఈ నగదు పురస్కారం అందించారు. అందెశ్రీ, ఎక్కా యాదగిరి రావు, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, దివంగత గూడ అంజయ్య తరఫున కుమార్తె గూడ దేవనళిని, దివంగత గద్దర్ తరఫున వారి సతీమణి జి.విమల, విదేశీ పర్యటనలో ఉన్న గోరేటి వెంకన్న తరపున ఆయన కూమార్తె సుప్రజ సీఎం చేతుల మీదుగా ఈ నగదు పురస్కారాలను అందుకున్నారు. గతంలో ప్రకటించిన కాళోజీ నారాయణ రావు పురస్కారాన్ని ప్రముఖ రచయిత, సాహిత్యకారుడు నలిమెల భాస్కర్ కి అందించారు.

03-06-2025 మంగళవారం ( మాన్ సూన్ అలర్ట్ )

ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 3న చేసిన రివ్యూలో అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సీఎం పరిస్థితిని సమీక్షించారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

03-06-2025 మంగళవారం ( ప్రజల వద్దకే రెవెన్యూ )

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా నేటి జూన్ 3 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడైంది. ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో రైతుల భూ సమస్యలను పరిష్కరించడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రారంభించారు. మొదట జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ చట్టాన్ని అమలు చేశారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్టులో 55 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 60 శాతం సమస్యలను పరిష్కరించారు. తాజాగా నిర్వహిస్తున్న ఈ సదస్సుల్లో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్‌తో కూడిన బృందం వెళ్లి, భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి, పరిష్కరిస్తుందన్నారు మంత్రి పొంగులేటి. ముఖ్యంగా సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయని గుర్తించారు. కలెక్టర్లు ఈ సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలన్నారు మంత్రి.

04-06-2025 బుధవారం ( అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ )

అంగన్వాడీల రూపు రేఖలు మార్చే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరిన్ని మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై అంగన్వాడీల్లో వారానికి ఒకటి, రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూలో మార్పులు చేయబోతన్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీల ద్వారా చిన్నారులకు అందిస్తున్న ఆహారపదార్థాలను మరింత రుచికరంగా మారుస్తామన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివ‌ద్ధి సంస్థలో ఈనెల 4న మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీతక్క పాల్గొన్నారు.

అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట- అంగన్వాడీ బాట 

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్బిణీలు, బాలింతలు కింద కూర్చోవాలంటే.. ఇబ్బందిపడుతున్నారని ఈసమస్యలను తొలగించేందుకు.. బెంచీలను సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ ఫోన్ల స్థానంలో కొత్తవి ఇస్తామన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల మీద పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలోనే 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అంగన్వాడీల్లో చిన్నారుల చదువు, ఆటవిడుపు, సౌకర్యం కోసం మొత్తం 57 రకాల వస్తువులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే బాలికల్లో రక్తహీనత సమస్య పరిష్కారం కోసం ఇందిరమ్మ అమృతం పథకంలో భాగంగా 14-18 ఏళ్ల యువతులకు అంగన్వాడీల ద్వారా నెలకు 30 చిక్కీలను ఇవ్వాలని నిర్ణయించారు.

05-06-2025 గురువారం ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )

ఈనెల 5న సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని, ఒక డీఏను వెంటనే చెల్లించాలని నిర్ణయించారు. మరో డీఏను ఆరు నెలల తర్వాత చెల్లించనున్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రతి నెల కనీసం 700 కోట్ల చొప్పున చెల్లించి క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా హెల్త్‌కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల రీ-రిక్రూట్‌మెంట్ చేయరాదని నిర్ణయం.

క్రమం తప్పకుండా డిపిసి ప్రమోషన్లు.. కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు.. అంగన్‌వాడీ వర్కర్లకు 2 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇకపై రిటైర్డ్ ఉద్యోగుల రీ-రిక్రూట్‌మెంట్ చేయరాదని నిర్ణయం. కొత్తగూడెంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పాలసీ లేకున్నా ప్రభుత్వం నుంచి నేరుగా 10 లక్షల పరిహారం అందించేలా నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా R&B, పంచాయతీ రాజ్ విభాగాల కింద మొత్తం 13,000 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు మొత్తం 86 కిలోమీటర్ల మార్గాన్ని 19,579 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయించింది.

05-06-2025 గురువారం ( రోడ్లకు మహర్దశ )

గ్రామీణ రోడ్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా రూరర్ రోడ్ల నిర్వహణకు నిధులు లేకపోవడంతో పరిస్థితి మారింది. అయితే సమస్య తీవ్రంగా ఉన్న చోట్ల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ విధానంలో వీటిని చేపట్టనున్నారు. 40 శాతం ప్రభుత్వ, 60శాతం ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని రానున్న రెండున్నరేళ్లల్లో పూర్తి చేయనున్నారు.

కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్లు

ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, అలాగే ప్రతి మండల కేంద్రం నుంచి.. జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్లతో అనుసంధానం, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి దశలో హ్యామ్‌ పద్ధతిలో మొత్తం 33,194 కోట్ల ఖర్చుతో 13,137 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 16,414 కోట్లతో 5,190 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లు.. 16,780 కోట్లతో 7,947 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్‌ పరిధిలో రోడ్లు నిర్మించనున్నారు. వీటి పనులు వెంటనే ప్రారంభించి 2027 చివరికల్లా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

05-06-2025 గురువారం ( దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం )

దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా తెలంగాణ దివ్యాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ పరికరాల పంపిణీలో గత ప్రభుత్వం నిబంధనలు జారీ చేసినప్పటికీ… క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతులు, సలహాలు, సూచనలకు తగ్గట్లు టీవీసీసీ పాలకమండలి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీవీసీసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ జీవో 89 జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న టీవీసీసీ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య ఉత్తర్వుల కాపీలను విడుదల చేశారు. వినతులను పరిగణించి పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు లబ్ధి జరిగే విధంగా మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 80% వైకల్యం ఉన్న వాళ్లకు మాత్రమే అర్హత కల్పించగా.. ప్రస్తుత ప్రజాప్రభుత్వం 40 శాతం వైకల్యం ఉన్నా సంక్షేమ ఫలాలు అందించనుంది.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×