BigTV English

CM Revanth Reddy: టోక్యో మెట్రో ఆధారంగా HYD సెకండ్ ఫేజ్ మెట్రో

CM Revanth Reddy: టోక్యో మెట్రో ఆధారంగా HYD సెకండ్ ఫేజ్ మెట్రో

CM Revanth Reddy: సరికొత్తగా భూభారతిని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ప్రజావాణి అర్జీలను సీఎం స్వయంగా చూసేందుకు డ్యాష్ బోర్డుకు అనుసంధానించాలని ఆదేశించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ రిలీజ్, గిగ్ వర్కర్ల కోసం కొత్త ముసాయిదా బిల్లు.. ఇవన్నీ ఈవారం కీలకంగా ఉన్నాయి.


13-04-2025 ఆదివారం ( విశ్వసనీయ సంస్థకు భూభారతి పోర్టల్ )

సామాన్య రైతులకు కూడా ఈజీగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచేలా భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించి నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 13న జూబ్లీహిల్స్‌ నివాసంలో భూ భారతి పోర్టల్ పై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పోర్టల్ భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. భూ భారతి వెబ్‌సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ఉండాలన్నారు.


13-04-2025 ఆదివారం ( ఇక తెలుగు తప్పనిసరి సబ్జెక్టు )

తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతుల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది. ఇది సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ వంటి జాతీయ బోర్డ్‌లకు కూడా వర్తిస్తుంది. జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగు వాచకంగా వెన్నెల పుస్తకం ఉండబోతోంది.
హిందీకి బదులు తెలుగు రెండో భాషగా తప్పనిసరి చేశారు.

14-04-2025 సోమవారం ( భూభారతికి హారతి )

బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమన్నారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో భూధార్ తీసుకొస్తామని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడత భూ భారతిని నాలుగు మండలాల్లో చేపట్టింది ప్రభుత్వం. అంతకు ముందు కలెక్టర్లతో మీటింగ్ లో పాల్గొన్న సీఎం భూభార‌తి చ‌ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లాల‌న్నారు. భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లు, వేస‌వి తాగు నీటి ప్రణాళిక‌లపై దిశానిర్దేశం చేశారు.

14-04-2025 సోమవారం ( డ్యాష్ బోర్డుకు ప్రజావాణి లింకప్ )

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శక విధానాలను అమలు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి డ్యాష్ బోర్డుతో అనుసంధానం చేయాలన్నారు. వారంలో రెండు రోజులు ప్రజాభవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంపై ఈనెల 14న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు, వాటిల్లో పరిష్కారమైనవి, పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలను సీఎం సమీక్షించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4 శాతం అంటే 37,384 అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేశారు. గల్ఫ్ సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు లైవ్ యాక్సెస్‌ తనకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

14-04-2025 ( గిగ్ వర్కర్లకు అండగా )

గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయ కోసం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈనెల 14న సెక్రటేరియట్ లో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ రూపొందించిన ముసాయిదా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్ లో పొందుపరిచిన అంశాలను అధికారులు సమావేశంలో సీఎంకు వివరించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించబోతోంది ప్రభుత్వం. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను రెడీ చేయనుంది. గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దేశంలోనే మొదటి సారిగా గిగ్ వర్కర్లకు తెలంగాణలోనే ప్రమాద బీమాను అమలు చేశారు. ప్రమాదాల్లో మరణిస్తే 5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

14-04-2025 సోమవారం ( ఎస్సీ వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ )

సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం… జీవో తొలి కాపీని అందజేసింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి పాల్గొన్నారు.

15-04-2025 మంగళవారం ( ఇందిరమ్మ ఇండ్ల ఫండ్స్ రిలీజ్ )

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు లబ్దిదారులకు లక్ష రూపాయల విలువైన చెక్కులను సీఎం అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. 2019 మంది బేస్‌మెంట్ వరకు ఇండ్లను పూర్తి చేసుకోగా 20.19 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఇండ్ల నిర్మాణంలో మరో స్టెప్ తీసుకునే అవకాశం లబ్దిదారులకు కలిగింది.

15-04-2025 మంగళవారం ( నిరుద్యోగులకు గుడ్ న్యూస్ )

రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. టీజీపీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ వ్యవహారం తేలడంతో జాబ్ క్యాలెండర్ కు మార్గం సుగమమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు కోసం కసరత్తు షురువైంది. దాదాపు 20 వేల పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ క్లియర్ కాకపోవడంతో గతేడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన జాబ్ నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. అయితే ఈనెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10 వేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్ జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది. గురుకుల, ప్రభుత్వ టీచర్ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామక ప్రక్రియలో దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మారాయి.

16-04-2025 బుధవారం ( నైనీలో మన సింగరేణి )

సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా మారింది. దాదాపు 130 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి.. రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థ తనకు కేటాయించిన బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించింది. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే సందర్భం.

16-04-2025 బుధవారం ( శభాష్ తెలంగాణ పోలీసింగ్ )

అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ తొలి స్థానంలో నిలిచింది. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి నిదర్శనమన్నారు సీఎం రేవంత్. ఈ శాఖ ప్రస్తుతం సీఎం దగ్గరే ఉంది. పకడ్బందీగా నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు పోలీసులకు దిశానిర్దేశం చేస్తుండడంతో ఈ ఘనత సాధ్యమైంది. శాంతిభద్రతలు కాపాడడం, నేరాల నియంత్రణ, కేసుల నమోదులో పారదర్శకత ఇవన్నీ ఫస్ట్ ప్లేస్ రావడంలో కీలకపాత్ర పోషించాయి.

16-04-2025 బుధవారం ( గ్రీన్ పాలసీ విక్టరీ )

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీ సత్ఫలితాలు ఇస్తోంది. తెలంగాణ రెడ్కోతో ఎకోరేస్‌ ఎనర్జీ, జీపీఆర్‌ఎస్‌ ఆర్య సంస్థలు ఈనెల 16న అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో ఎంవోయూలపై సంతకాలు జరిగాయి. 27వేల కోట్ల రూపాయలతో 5,600 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరేస్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2వేల కోట్లతో 15 జిల్లాల్లో బయోగ్యాస్‌ ప్రాజెక్టులకు జీపీఆర్‌ఎస్‌ ఆర్య డీల్ కుదుర్చుకుంది.

17-04-2025 గురువారం ( టోక్యో మెట్రో స్టడీ టూర్ )

జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం ప్రఖ్యాత టోక్యో మెట్రోను సందర్శించింది. తొమ్మిది లైన్లతో సమర్థంగా నిర్వహిస్తున్న టోక్యో మెట్రో అత్యాధునిక సామర్థ్యం, లేటెస్ట్ టెక్నాలజీ వాడకాన్ని పరిశీలించారు. స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులకు అందుతున్న సేవలను స్టడీ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే క్రమంలో, ఈ టెక్నాలజీని స్టడీ చేస్తున్నారు.

17-04-2025 గురువారం ( జైకా సహకారం కోసం.. )

రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఆర్థిక సహాయ సంస్థ జైకాతో చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని జైకాను కోరింది. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం 11, 693 కోట్లు రుణంగా అందించాలని కోరారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాల స్థాయికి అభివృద్ధి చేయాలనే తన దీర్ఘకాలిక లక్ష్యాన్ని సీఎం జైకా ప్రతినిధులకు వివరించారు.

17-04-2025 గురువారం ( ఫ్యూచర్ సిటీలో మరుబెని బిగ్ డీల్ )

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ ఓకే చెప్పింది. మరుబెనీ కంపెనీ మొదట వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.

దీని ద్వారా 5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే ఈ పార్క్ తో తెలంగాణలో సుమారు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. మరుబెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అటు టోక్యోలోని వ్యాపార దిగ్గజం సోనీ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను సీఎం బృందానికి కంపెనీ ప్రతినిధులు వివరించారు.

17-04-2025 గురువారం ( పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ )

5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పుప్పాలగూడ పరిసరాల్లో మొదటిదశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీని ద్వారా హైదరాబాద్‌ ప్రగతి మరింత వేగవంతమవుతుందన్న అంచనాకు వచ్చింది. ఈనెల 17న సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు, పలు సొసైటీలకు దాదాపు 200 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. ఇటీవల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. ఈ భూమి పక్కనే TGIICకి చెందిన మరో 250 ఎకరాలు ఉండటంతో ఇక్కడ ఐటీ నాలెడ్జి హబ్‌ అభివృద్ధి కోసం మొత్తం 450 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని గుర్తించారు.

18-04-2025 శుక్రవారం ( మూసీ పునరుజ్జీవం కోసం.. )

మూసీ పునరుజ్జీవం కోసం ఎలాంటి విధానాలు పాటించాలో తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. అందుకోసం ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. ప్రపంచంలోని ది బెస్ట్ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటోంది. ఇందుకోసం తాజాగా సీఎం బృందం ఈనెల 18న జపాన్‌లోని టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ ను విజిట్ చేసింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నదిని రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. జల రవాణాకు తగ్గట్లు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్‌, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందో ప్రతినిధి బృందం పరిశీలించింది.

18-04-2025 శుక్రవారం ( రూ.562 కోట్లతో తోషిబా డీల్ )

ప్రఖ్యాత తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ తెలంగాణలో కొత్తగా 562 కోట్ల భారీ పెట్టుబడితో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా ఈ భారీ పెట్టుబడిని రాబట్టింది. MNC తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 562 కోట్లతో సంగారెడ్డి జిల్లా రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులను, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం ద్వారా ముందడుగు వేసింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాక, పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆకర్షించడంతోనే పెట్టుబడికి ముందుకొచ్చినట్లు తొషిబా ప్రకటించింది.

18-04-2025 శుక్రవారం ( NTT అతిపెద్ద AI డేటా సెంటర్ )

సీఎం బృందం జపాన్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి మరో 10,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఐటీ సేవల్లో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్‌టీటీ డేటా కార్పొరేషన్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్క్స్‌ లు జాయింట్ గా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్‌ను నిర్మించేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లో 400 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ నిర్మితమవుతుంది. 25,000 జీపీయూలతో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ ‌కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఈ క్లస్టర్ అందిస్తుంది.

తెలంగాణను దేశంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. ఈ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను 500 మెగావాట్ల వరకు గ్రిడ్ విద్యుత్‌తో, మిగిలినది పునరుత్పాదక శక్తి ద్వారా నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్టును ఉన్నత ఈఎస్‌జీ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని విద్యా సంస్థలతో భాగస్వామ్యంతో ఈ క్యాంపస్ ఏఐకి బూస్టప్ గా మారనుంది. ఇప్పటికే AWS, ఎస్‌టీటీ, టిల్‌మన్ హోల్డింగ్స్, CTRLS వంటి దిగ్గజ కంపెనీల డేటా సెంటర్లతో ఎన్‌టీటీ డేటా ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా మరింత బలపడింది.

18-04-2025 శుక్రవారం ( జపాన్ లో తెలంగాణ రైజింగ్ )

తెలంగాణకు పెట్టుబడులతో రావాలని, చైనా ప్లస్ వన్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి సాధించాలని జపాన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో ఈనెల 18న సీఎం నేతృత్వంలోని బృందం సమావేశమై, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ మీటింగ్ లో 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఇదే వేదికపై ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ల వీడియోలను ప్రదర్శించారు.

19-04-2025 శనివారం ( టోక్యోతోనే పోటీ ) తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్ పర్యటనలో తాజాగా జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన తెలుగు వెలుగు పండుగ సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పోటీ అమరావతి, బెంగళూరు, ముంబయి, చెన్నైతో కాదని, లండన్, టోక్యో వంటి అభివృద్ధి చెందిన నగరాలతోనేనని అన్నారు.

 

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×