Congress Govt: స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్‌ను సన్నద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో విజయానికి ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్న హస్తం పార్టీ.. స్థానిక సమరానికి సైతం అక్కడ నుంచే శంఖారావం పూరించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై.. శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఆ జిల్లానే హస్తం పార్టీ ఎంచుకోవటానికి కారణాలేంటి? దాని వెనుక ఉన్న సెంట్‌మెంట్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ..
ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్‌గా భావిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వేదికగా.. దళిత, గిరిజన దండోరా పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో.. హస్తం పార్టీ విజయఢంకా మోగించి అధికారం చేపట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా రేవంత్ రెడ్డి.. ఇదే ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ముందుగా ఆయన ఇంద్రవెల్లిలోనే పర్యటించారు. తాజాగా స్థానిక సంస్థల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. మరోసారి తమకు కలిసి వచ్చిన జిల్లా నుంచే శంఖారావం పూరించనుందట.
జనవరి నెలాఖారు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరుసగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతోందట. ఘన విజయమే లక్ష్యంగా కేడర్‌ను పూర్తి స్థాయిలో సంసిద్ధతను చేసే దిశగా కార్యచరణ రూపొందించిందట. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షలను నిర్వహించాలని భావించిన హైకమాండ్… ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని.. దీనిని ఆ పార్టీ సెంటుమెంట్‌గా భావిస్తోందనే టాక్ నడుస్తోంది.
Also Read: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా ఆరు నియోజకవర్గంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తమ సమస్యలను ఆలకించేవారు లేరనే ఆవేదన క్యాడర్‌లో వ్యక్తం అవుతోందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. శ్రేణుల్లో జోష్ నింపి.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు త్వరలో అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి.. ఎన్నికలకు సంసిద్ధతను చేసేలా పార్టీ సమావేశాన్ని నిర్వహించింది.
ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే మెసేజ్ గట్టిగా తీసుకువెళ్తున్నారనే వార్తలు.. గట్టిగా వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా.. ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందట. రానున్న ఎన్నికల్లో పార్టీని.. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో తమకు కలసి వచ్చిన జిల్లా నుంచే.. ఈ కార్యక్రమాలు నిర్వహించటం.. తమకు కలిసొచ్చే అంశమని హస్తం పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.