వరంగల్ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ దుమారం
సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా దంపతులు.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. కొండా ఫ్యామిలీ రేపిన దుమారం.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయం దుమ్ము దులుపుతోంది. మొన్నటిదాకా మంత్రి కొండా సురేఖ మాత్రమే.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకుంటే.. ఇప్పుడు ఆవిడకు తోడుగా.. ఆమె భర్త కొండా మురళి కూడా తయారైనట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ.. సర్కారును ఇరుకున పడేసేలా మాట్లాడితే.. కొండా మురళి వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసేలా మాట్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు.. వరంగల్ బోర్డర్ దాటి స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారాయి. దీనిని.. ఆ జిల్లా నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
జిల్లాలో కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టేలా కొండా మురళి కామెంట్స్
మొన్నటిదాకా మంత్రి కొండా సురేఖ, ఇప్పుడు ఆమె భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు.. అధికార పార్టీలో అగ్గి రాజేశాయ్. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే.. టార్గెట్ చేసిన కొండా మురళి.. ఓరుగల్లు గడ్డపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయ్. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. మిగతా నేతలపైనా ధ్వజమెత్తిన మురళి అంతటితో ఆగలేదు. రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. ఓ చానల్ ఇంటర్వ్యూలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో.. ఒకరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని.. మరొకరు 75 ఏళ్ల దరిద్రుడనే వ్యాఖ్యలు చేశారు. తనని చూస్తే.. చావు కూడా భయపడుతుందని.. కొండా మురళి ఎవ్వరికీ తలవంచడని సవాల్ విసిరారు.
కొండా సురేఖ, మురళిపై అధిష్టానానికి జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదు
బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయ్. పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలా? లేక.. మేము కావాలా? తేల్చుకోవాలని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అల్టిమేటమ్ జారీ చేసే స్థాయికి చేరింది వివాదం. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశమయ్యారు. వీరిలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు. వీరంతా.. సుదీర్ఘంగా చర్చించి.. అదిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం తగదన్నారు
ఇక.. కొండా మురళి వ్యాఖ్యలను.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తప్పుబట్టారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలో చర్చించుకోవాలే గానీ.. బహిరంగ వేదికలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం తగదన్నారు. పైగా.. క్యాస్ట్ కార్డ్ ఉపయోగిస్తూ.. బ్లాక్‌మెయిల్ చేస్తామంటే పార్టీ సహించదన్నారు. వీటన్నింటిని.. పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని.. కచ్చితంగా సరైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కొండా ఫ్యామిలీ విషయంలో హైకమాండ్ ఏం చేయబోతోంది?
వరంగల్ కాంగ్రెస్‌లో రగిలిన వివాదంపై పీసీసీ కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పరిశీలకుల్ని నియమించినట్లు.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఇదే నెలలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే.. కొండా దంపతులు కూడా తగ్గేదేలే అంటున్నారు. తాము కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని రాజకీయాలు చేస్తున్నామని.. ఎంతకైనా రెడీ అని చెబుతున్నారు. పైకి ఇలా ఉన్నా.. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కొండా కుటుంబానికి వ్యతిరేకంగా ఏకమవడంతో.. మంత్రి కొండా సురేఖ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొండా మురళి వ్యాఖ్యల దుమారం పక్కనబెడితే.. భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం విషయంలోనూ.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో తగువు పెట్టుకున్నారు కొండా సురేఖ. ఎమ్మెల్యేల భేటీ తర్వాత.. కాస్త వెనక్కి తగ్గారు. అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
వరంగల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుంది?
ఏడాదికాలంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా సురేఖ, మురళి దంపతులు చేస్తున్న వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారు. ఈసారి వారి దూకుడికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో.. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పీసీసీ నాయకత్వం గతంలో మాదిరిగా రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తే.. ఏఐసీసీ దగ్గరకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి.. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో.. ఈ ఆధిపత్య పోరు ఎక్కడి వరకు దారితీస్తుందోనని చర్చనీయాంశంగా మారింది.
Story By Anup, Bigtv Live