Jubilee Hills By Election Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మెగా బూస్ట్‌నిచ్చాయి. వరుసగా రెండో బైపోల్‌లో ఆఖండ విజయంతో తమకు తిరుగులేదని నిరూపించింది. అంచనాలను తలకిందులు చేస్తూ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. సర్వే సంస్థలు టఫ్ ఫైట్ అన్నప్పటికీ, ఏకంగా 24,729 ఓట్ల బంపర్ మెజారిటీ దక్కింది. జూబ్లీహిల్స్ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్లు వస్తాయన్న బీఆర్‌ఎస్ ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని ఈ ఫలితంతో తేలిపోయింది. ఇక జూబ్లీహిల్స్ గెలుపుకు దారితీసిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ ఫ్యాక్టర్స్ GHMCలో ఎంతవరకు పనిచేయనున్నాయి?
అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలిచారు. కానీ సర్వే సంస్థలు చెప్పినట్టుగా టఫ్ ఫైట్ మాత్రం రాలేదు. కొద్దిపాటి ఓట్ల శాతం తేడాతో నవీన్‌యాదవ్ గెలుస్తాడని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఊహించని విధంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు.. 24 వేల 729 ఓట్ల మెజార్టీ వచ్చింది. వాస్తవానికి ఇంత మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. అందుకు భిన్నంగా నవీన్‌యాదవ్‌కు బంపర్ మెజార్టీ వచ్చిందనే చెప్పాలి. అందుకు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి..కానీ వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ గెలుపు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బిగ్ బూస్ట్ అని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండో బైపోల్ ఎన్నిక ఇది. మొదటిది కంటోన్మెంట్. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత యాక్సిడెంట్‌లో అకాల మరణం చెందారు. అప్పుడు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన శ్రీగణేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు సెంటిమెంట్ అస్త్రం వర్కవుట్ కాలేదని క్లియర్‌గా చెప్పొచ్చు. ఇక అప్పుడు.. ఇప్పుడు కమలం పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జూబ్లీహిల్స్‌లో సెగ్మెంట్‌లో నవీన్‌యాదవ్ గెలవడమే కాకుండా రికార్డులను తిరగరాశాడు. 2023లో బీఆర్ఎస్‌కు వచ్చిన మెజారిటీని కాంగ్రెస్ దాటింది. 2023లో మాగంటి గోపీనాథ్‌కు 16,337 ఓట్ల మెజారిటీ వచ్చింది. జూబ్లీహిల్స్ చరిత్రలో 2009లోనే అత్యధికంగా 21,741 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఫిగర్ మారింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తమ పాలనకు రెఫరెండం అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారానికి పబ్లిక్ ఆమోద ముద్ర వేశారు. విపక్షాల విమర్శలను పట్టించుకోలేదు.. ఆరోపణలను పక్కన పెట్టేశారు. సింపతీ రాగాన్ని అస్సలు ఆలకించలేదు.. స్థానికుడైన నవీన్ యాదవ్‌కే జై కొట్టారు. వరుస బైపోల్స్ విక్టరీలతో ప్రభుత్వంపై ప్రజలు మరింత బాధ్యతను పెంచారని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే వ్యతిరేకత ఏర్పడిందన్న బీఆర్ఎస్ ప్రచారం అంతా ఫేక్ అని మొన్న కంటోన్మెంట్.. ఇవాళ జూబ్లీహిల్స్ ఫలితాలతో తేలిపోయింది. త్వరలోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనుంది. ఈ గెలుపు ప్రభావం తప్పకుండా ఆ ఎన్నికలపైనా పడుతుంది. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ జరిగే GHMC ఎన్నికల్లోనూ దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కోర్ సిటీలో ఉన్న నగర ఓటర్లు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో గ్రిప్ లేదన్న ప్రచారానికి కూడా ఎండ్ కార్డ్ పడినట్టుగానే భావిస్తున్నారు రాజకీయ పండితులు. ఇది త్వరలో జరిగే GHMC ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.
ప్రధానంగా జూబ్లీహిల్స్ లో నవీన్‌యాదవ్ గెలుపుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పాలన.. మరోకటి నవీన్ యాదవ్‌కు ఉన్న పాజిటివ్ ఇమేజ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం నవీన్ యాదవ్‌కు ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే గెలుపోటములకు అతీతంగా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నాడు నవీన్ యాదవ్. నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. పిలిస్తే పలుకుతాడు అనే పేరుంది నవీన్ యాదవ్. ఇవన్నీ కూడా అతని గెలుపులో కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. అంతేకాదు.. ఈ గెలుపు ఎన్నో అనుమానాలను పటాపంచల్ చేసిందని చెప్పొచ్చు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే బార్డర్ మెజార్టీతో బయటపడేవాడు. కానీ నవీన్‌యాదవ్‌కు రికార్డు మెజార్టీ వచ్చిందంటే ప్రభుత్వంపై వ్యతిరేక లేదనే అర్థం చేసుకోవాలి. వ్యతిరేకత అనేది ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేసిన ప్రచారంగా తేలిపోయింది.
వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. విజయంపై ధీమా ఉన్నా.. మెజారిటీపై సందిగ్ధం ఉండేది. కానీ, ఈ ఫలితాలు.. రేవంత్‌రెడ్డికి భారీ ఊరటనిచ్చాయి. జూబ్లీహిల్స్ ఫలితాలు కొంచెం అటుఇటుగా వచ్చి ఉంటే సీఎం పదవీకే ముప్పు తప్పదనేలా బీఆర్ఎస్ నేతలు సోషల్‌మీడియాలో ప్రచారాలు చేశారు. అవన్నీ పటాపంచల్ అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని కేవలం రాష్ట్ర నేతగా మాత్రమే కాకుండా ఆధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టగల నాయకుడని చూపించే అవకాశముంది. ఈ బైపోల్ క్యాంపెయిన్‌లోనూ సీఎం రేవంత్ రెడ్డి అంతా తానై నడిపించారు. క్యాంపెయిన్ నుంచి పోల్ మేనేజ్‌మెంట్ వరకు పకడ్బందీగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఈ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి తన పట్టును మరోసారి చాటుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్ర్యం చాలా ఎక్కువే. అందుకే నేతలు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి తామంతా ఒక్కటేనని నిరూపించారు. బూత్‌లవారీగా ఎమ్మెల్యేలు.. డివిజన్లవారీగా మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ప్రచారాన్ని తమ భూజాలపై వేసుకున్నారు. అంతా కలిసి కోఆర్డినేషన్ మిస్ కాకుండా పనిచేసి.. అద్భుత విజయాన్ని పార్టీకి అందించారు. మరోవైపు హైడ్రాపై బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే బుల్డోజర్లు వస్తాయని, బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే బుల్డోజర్లు రాకుండా బ్రేక్ వేయవచ్చని కేటీఆర్ ప్రచారం చేశారు. కానీ ప్రజలు కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్ విజయం రేవంత్‌కు ఒక ఊరట కంటే ఎక్కువ. అది పార్టీలో యూనిటీకి నిదర్శనంగా చెప్పొచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ఆయన మరింత ధైర్యంగా అడుగులు వేయడానికి ఈ ఫలితం పునాది అయ్యే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.
2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పాటైంది. అప్పుడు విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా మాగంటి గోపినాథ్ అక్కడ గెలుస్తూ వచ్చారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఈ బైపోల్‌ను కాంగ్రెస్‌పార్టీ ముందు నుంచి చాలా సీరియస్‌గా తీసుకుంది. పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లింది. మళ్లీ ఆ సీటులో ఇన్నాళ్లకు కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేశారు. అందుకే ఈ విజయం కాంగ్రెస్‌కు ఓ జ్ఞాపకం అని చెప్పాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది. రెండేళ్లలో రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక గెలుపు కాదు.. రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజలు ఇచ్చిన బలమైన రిపోర్ట్ కార్డ్. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయని విధంగా కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు చేసి ప్రజలను మెప్పించి, ఒప్పించి సీటును దక్కించుకోగలిగారు.
జూబ్లీహిల్స్… కాంగ్రెస్ పార్టీకి అస్సలు పట్టులేని కోర్ సిటీ సెగ్మెంట్. గత రెండుసార్లు గులాబీ పార్టీకే జై కొట్టిన నియోజకవర్గం. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు… గెలుపుపై హస్తం పార్టీలో పెద్దగా ఆశలు కూడా లేవు. కానీ ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కథ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు. విజయాన్ని ముద్దాడేలా చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయని ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు. అలాంటి వారందరి నోళ్లు ఈ ఎన్నిక ఫలితం మూత పడేలా చేస్తుందనడలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవి కొట్లాడి తెచ్చుకున్నది కాదని, కష్టపడి తెచ్చుకున్నదని రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. అందుకే జూబ్లీహిల్స్ విజయం వెనుక రేవంత్ రెడ్డి ‘మాస్టర్ స్ట్రోక్’ వ్యూహం ఉందని చెప్పడంలో నో డౌట్.
జూబ్లీహిల్స్ వంటి కీలకమైన, బీఆర్ఎస్ కంచుకోటగా భావించిన స్థానంలో, రికార్డు మెజారిటీతో గెలవడం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు భారీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చినట్టైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, క్యాడర్ ఉత్సాహం చాలా ముఖ్యం. ఈ జోష్‌తో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేస్తారు, ఇది బూత్ స్థాయి మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేస్తుంది. హైదరాబాద్ కోర్ సిటీలో కాంగ్రెస్‌కు పట్టులేదన్న అపవాదును ఈ విజయం చెరిపేసింది. ఇది జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బలంగా మారింది. హైదరాబాద్ నగర ఓటర్లు మార్పును ఆమోదించారని, కాంగ్రెస్ హామీలను విశ్వసించారని ఈ విక్టరీ చెబుతోంది. జీహెచ్‌ఎంసీ డివిజన్లలో కూడా కాంగ్రెస్ ఇదే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. హైదరాబాద్‌ను తమ కంచుకోటగా భావించిన బీఆర్ఎస్‌కు ఈ ఫలితం పెద్ద షాక్. వరుసగా రెండు ఉపఎన్నికలలో ఓడిపోవడం, ముఖ్యంగా కోర్ సిటీలో ఓడిపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ నింపింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో సెంటిమెంట్‌ను పక్కనపెట్టి బలమైన స్థానిక అభ్యర్థులను బరిలోకి దించాల్సిన ఒత్తిడి పెరుగుతుంది. ఇక జూబ్లీహిల్స్ విజయం కేవలం ఆ ఒక్క సీటుకే పరిమితం కాదు. ఇది GHMC ఎన్నికలకు మంచి బూస్ట్ ఇస్తోంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని పట్టు లేదన్న వాదనను బద్దలు కొట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉందని నిరూపించింది.
వాస్తవానికి కాంగ్రెస్ కంటే ముందే బీఆర్ఎస్ ప్రచారపర్వంలోకి దిగింది. ముందుగానే క్యాండిడేట్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా క్యాంపెయిన్ చేసింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే ముద్ర క్రియేట్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాతో పాటు ప్రచారంలోనూ గట్టిగా చెప్పకొచ్చారు. అదే టైంలో సెంటిమెంట్ కార్డు వాడుతున్నారు. హైడ్రాను బూచిగా చూపించి భయపెట్టే ప్రయత్నం చేశారు. అలా డ్యామేజ్ చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి గ్రౌండ్‌లో రియాల్టీ మారిపోయింది. గులాబీ పార్టీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని తెలిసిన రేవంత్ రెడ్డి… దానికి విరుగుడుగా సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చారు. నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నందున, బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఓడిపోయినా, గెలిచినా నియోజకవర్గాన్ని విడిచిపోనని హామీ ఇచ్చిన నవీన్‌కు ఉన్న పాజిటివ్ ఇమేజ్‌ను వాడారు. మజ్లిస్ మద్దతుపై ఆధారపడకుండా… అత్యంత వ్యూహాత్మకంగా అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం, ముస్లింలకు శ్మశాన వాటిక హామీ ఇవ్వడం ద్వారా.. బీఆర్ఎస్‌కు పడే మైనారిటీ ఓటు బ్యాంకును చీల్చి పడేశారు. కాంగ్రెస్‌కు పడని ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు హామీ ఇవ్వడంతో పాటు, కమ్మ ఓటర్లతో ప్రత్యేక మీటింగ్‌లు నిర్వహించి వారి మద్దతు కూడగట్టారు. జూబ్లీహిల్స్‌లో సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉన్నందున… వారితో సమావేశం ఏర్పాటు చేసి 10 కోట్లు ప్రకటించారు. టికెట్ రేట్ల పెంపులో 20శాతం వాటా ఇస్తామని ప్రకటించి.. ఆ వర్గాన్ని కూడా బలంగా కనెక్ట్ చేసుకున్నారు.
మాగంటి గోపీనాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, సునీతకు పడే సానుభూతి ఓటును బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి పదునైన వాదనలను జనంలోకి తీసుకెళ్లారు. గతంలో కేసీఆర్… పీజేఆర్ కుటుంబాన్ని ఎలా మోసం చేశారో ఉదాహరణలతో వివరించి, మాగంటి కుటుంబానికి సానుభూతి దక్కకుండా గండి కొట్టారు. మాగంటి మరణంపై ఉన్న లీగల్ అంశాలు, సునీతపై కేసుల విషయాన్ని పదే పదే ప్రస్తావించి… ఆమెకు సానుభూతి రాకుండా చేయగలిగారు. ఇంటి ఆడబిడ్డనే కేటీఆర్ పట్టించుకోలేదంటే.. సునీతను మాత్రం ఏం పట్టించుకుంటారని ప్రశ్నిస్తూ… కవిత అంశాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టారు. కేవలం ప్రచారం మాత్రమే కాదు, పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో రేవంత్ ఏమాత్రం రాజీ పడలేదు. సీనియర్ నేతలు, జూనియర్ మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి టార్గెట్ ఫిక్స్ చేశారు. అంతా కలిసి కో-ఆర్డినేషన్ మిస్ కాకుండా పనిచేశారు.
Also Read: హరీష్ వల్లే సునీత ఓటమి! హరీష్, కేటీఆర్ బాగోతం బయటపెట్టిన కవిత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ మరోసారి పనిచేయలేదని స్పష్టమవుతుంది. సెంటిమెంట్ కంటే మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండనుండటంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించినా ప్రయోజనం ఏమీ లేదని ఓటర్లు భావించినట్లు కనపడుతుంది. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కష్టం. అదే అధికార పార్టీ గెలిస్తే కొంత నిధులు నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచన కూడా ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించాయని చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేసినా అది వృధాయేనని భావించి ఎక్కువ మంది ప్రజలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వైపు నిలిచారు. ఇదే జోష్ తో కాంగ్రెస్ కేడర్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుంది.
Story By Venkatesh, Bigtv