కడియం శ్రీహరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌషిక్ రెడ్డి పై చర్యలకు సర్వం సిద్దమైంది. రేపటితో (బుధవారం) ఎథిక్స్ కమిటీకి వివరణ ఇచ్చేందుకు చివరి అవకాశంగా పేర్కొన్నది. గతంతో తనకు నాలుగు వారాల గడువు కావాలని పాడి కోరినా.. ఎథిక్స్ కమిటీ అంగీకరించలేదు.
మార్చి 29న అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా సభలో జరిగిన వివాదం నేపథ్యంలో .. కడియం శ్రీహరిపై పాడి కౌషిక్‌రెడ్డి అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి సెప్టెంబర్ 30న భేటీ అయ్యారు. వివరణ ఇవ్వాలని ఇవాళ్టి వరకు గడువు ఇచ్చారు. అయినా ఇంత వరకు పాడి కౌషిక్ రెడ్డి స్పందించలేదు. అక్టోబర్ 7 బుధవారం చివరి తేదీగా అవకాశం ఇచ్చారు. అనంతరం ఈనెల 13న నివేదికను స్పీకర్‌ను పంపనున్నారు.
ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పీకర్ నిర్ణయించనున్నారు. అయితే గతంలో ఏపీలో జరిగిన ఇలాంటి ఉదంతంలో రోజాకు ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి ఏడాది పాటు ఆమెను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రివిలేజెస్ కమిటీ కూడా ఈ సస్పెండ్‌ను సమర్థిస్తూ నివేదిక ఇచ్చింది. కోర్టు వరకు ఈ వివాదం వెళ్లింది. ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇదే మాదిరిగా పాడి కౌషిక్‌రెడ్డిని కూడా ఓ ఏడాది పాటు సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, సభ్యత్వాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకోదనే భావన అందరిలో ఉంది. పాడి కౌషిక్ రెడ్డి వ్యవహార శైలి అత్యంత వివాదస్పందంగా ఉన్నా.. సభ్యత్వ రద్దు వరకు వెళ్లరనేది తాజా సమీకరణలను బట్టి తెలుస్తోంది.
గతంలో 2018 గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లు తమ హెడ్ ఫోన్లను విసిరారు. ఇవి మండలి చైర్మన్‌కు తగలడంతో తీవ్ర సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించి వీరిద్దరి సభ్యత్వాలు రద్దు చేశారు. తరువాత వీరిద్దరు హైకోర్టును ఆశ్రయించి .. తమ సభ్యత్వాలను పునరుద్దరించుకున్నారు.
అయితే, పాడి కౌషిక్‌రెడ్డిని అంత దాకా పోనిచ్చేందుకు కూడా సర్కార్‌కు ఇష్టం లేదు. చర్యలు తీసుకోవాలి కాబట్టి.. ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసి వదిలేయడమే బెటరనే అనుకుంటున్నది. దీన్ని మరింత వివాదం చేయడం మూలంగా బీఆర్‌ఎస్ రెచ్చిపోయే చాన్సు ఇచ్చినట్టవుతుందనే భావన కూడా సర్కార్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
సభ్యత్వం రద్దు చేసి.. ఉప ఎన్నిక పోవాలనే కోరిక కాంగ్రెస్ సర్కార్‌కు ఇసుమంత కూడా లేదు. ఇప్పటికే ఖైరతాబాద్ ఉప ఎన్నికను దాట వేసే దోరణిలోనే సర్కార్ తీరుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి మరో రెండేళ్ల కాలమే ఉండటం, కీలకంగా ఉన్న ఈ సమయంలో .. అనవసరంగా ఉప ఎన్నికలతో టైమ్ వృథా చేసుకోవాలని అనుకోవడం లేదు సర్కార్.
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాల్లో బిజీబిజీగా తలమునకలై ఉంది సర్కార్.