Ramayana: బాలీవుడ్ తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ షూటింగ్ సెట్‌లో ఊహించని అపశృతి చోటుచేసుకుంది. ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఉన్న ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెట్‌కు వెలుపల వేసిన తాత్కాలిక టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిత్ర యూనిట్‌తో పాటు స్టూడియో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ భారీ ప్రమాదానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం సాయంత్రం ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక భాగంలో ఉన్న సుమారు వంద అడుగుల తాత్కాలిక సెట్‌లోని పీసీఆర్ యూనిట్‌లో ఈ మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ వైరింగ్, కేబుల్స్, చెక్కపలకలు, ఏసీ యూనిట్లు, ప్లాస్టిక్ సామగ్రి మరియు కాస్ట్లీ సౌండ్ సిస్టమ్స్ వంటి షూటింగ్ పరికరాలు ఈ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, బీఎంసీ వార్డ్ కంట్రోల్ అధికారులు వేగంగా రంగంలోకి దిగారు. ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల సెట్లలో ఉన్న నటీనటులు, ఇతర సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ALSO READ: “బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్) అధ్యక్షుడు బి.ఎన్. తివారీ అధికారికంగా స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో సెట్‌లో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉండటంతో కొంతసేపు తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. అంతా సురక్షితంగా బయటపడటంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇక ఇన్ని భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం సినీ వర్గాలను కాస్త కలవరపెట్టింది.