Dating Apps: ఎస్.. ఆన్‌లైన్ పరిచయాలు ఆగం చేస్తున్నాయ్. ఈ ప్రపంచం మారుతున్నకొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. మనుషుల మధ్య సంబంధాలు చాలా ఈజీగా డిజిటలైజ్ అయిపోతున్నాయ్. చుట్టూ మనుషులున్నా, మనవాళ్లున్నా.. సంతోషాలు, బాధలు పంచుకునేందుకు.. మరొకరిపై ఆధారపడుతున్నారు. అపరిచిత వ్యక్తులతో అన్నీ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఒకప్పుడు ఒకరితో పరిచయం కావాలంటే.. ఓ సామాజిక వాతావరణం ఉండేది. కానీ.. ఇప్పుడొక స్వైప్‌తో మనుషులు దగ్గరైపోతున్నారు. ఆ స్వైప్ వెనుక పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. విశాఖపట్నం గాజువాకలో జరిగిన దారుణ హత్య.. ఆన్‌లైన్ పరిచయాల వెనుక ఉన్న ప్రమాదాన్ని మరోసారి కళ్లకు కట్టింది.
పరిచయాలు పెంచుకునేందుకు, ఆ తర్వాత డేటింగ్ చేసేందుకు ఈ డేటింగ్ యాప్స్ ఎంత ఈజీగా ఉంటాయో.. అంతే ప్రాణాంతకంగానూ తయారయ్యాయ్. ఈ డేటింగ్ యాప్స్.. అనేక అనర్థాలకు దారితీస్తున్నాయ్. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు, మోసాలు.. ఇలా ఎన్నో నేరాలకు కారణమవుతున్నాయ్. మొదట సమ్మోహనం.. ఆ తర్వాత వెగటు.. చివరకు చిరాకొచ్చి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయ్. డేటింగ్ యాప్స్ పరిచయాలు.. కొన్ని నెలల్లోనే విషాదాంతమవుతున్నాయ్. విశాఖలో జరిగింది కూడా అదే! రిలేషన్‌షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడం వల్లే మౌనికను హత్య చేసినట్లు తెలిపాడు నిందితుడు చింతాడ రవీంద్ర. ఈ మర్డర్.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
మౌనిక, రవీంద్రకు.. 2021లో మింగిల్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా రిలేషన్‌షిప్‌కు దారితీసింది. పెళ్లి తర్వాత కూడా రవీంద్ర మౌనికతో రిలేషన్‌లో ఉన్నాడు. పెళ్లైన విషయం తెలిశాక.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయ్. ఈ క్రమలో.. డబ్బు కోసం తమ విషయాన్ని రవీంద్ర భార్యకు చెబుతానంటూ.. మౌనిక వేధించడం మొదలుపెట్టింది. అడిగినప్పుడల్లా డబ్బులిస్తున్నా.. ఇంకా కావాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో.. మౌనికను హత్య చేసి.. ముక్కలుగా నరికేశాడు నిందితుడు రవీంద్ర. డేటింగ్ యాప్‌లో సరదాగా మొదలైన వ్యవహారం.. చివరకు ఎంత పాశవికంగా ప్రాణాలు తీసే స్థాయికి చేరిందో చెప్పేందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన.
గాజువాకలో జరిగిన మౌనిక మర్డర్.. నాగరిక సమాజం తలదించుకునేలా చేసింది. నేవీలో పనిచేసే వ్యక్తి.. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కిరాతకంగా చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టాడనే వార్త విని.. ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.. ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయేందుకు కారణమైంది. ఇటీవలే దేశ రాజధాని ఓ ఢిల్లీలో జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఓ యువతిని నమ్మి డేట్‌కు వెళ్లిన 34 ఏళ్ల వ్యక్తిని.. ఆమె స్నేహితులు కిడ్నాప్ చేసి, రాత్రంతా కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసి, ఏకంగా 7 లక్షలు దోచుకున్నారు. ఓ డేటింగ్ యాప్ ద్వారానే వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదిరింది. ఇద్దరూ కలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ అమ్మాయి మాటలు నమ్మి వెళ్లిన వ్యక్తికి.. ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. బాధితుడి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా.. డేటింగ్ యాప్స్ ద్వారా అమాయకులకు వల వేయడం, వారిని ఓ చోటుకి పిలిచి, అనుచరులతో కలిసి దోచుకోవడం ఓ రకం క్రైమ్ స్టైల్.
డేటింగ్ యాప్‌లలో చాలా మంది తమ అసలు గుర్తింపును దాచిపెడతారు. పెళ్లయినా కానట్టు, బాధ్యతలు ఉన్నా లేనట్టు.. నటిస్తూ అవతలి వ్యక్తిని ఆకర్షిస్తారు. గాజువాక కేసులోనూ నిందితుడు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి, మౌనికతో రిలేషన్‌షిప్ కొనసాగించడం, చివరకు అది గొడవలకు దారితీయడంతో.. ఇంత ఘోరం జరిగింది. డేటింగ్ యాప్స్‌లో పరిచయమయ్యే వాళ్లందరినీ గుడ్డిగా నమ్మేయడమే.. నేటి తరం చేస్తున్న అతిపెద్ద తప్పు.
ఈ డిజిటల్ జమానాలో.. తోడు కోసం వెతికేవారికి డేటింగ్ యాప్స్ ఓ వరంలా కనిపిస్తున్నా.. అవే ప్రాణాల మీదకు తెచ్చే శాపాలుగా మారుతున్నాయ్. పరిచయాలు పెంచుకోవాలనే ఉత్సాహం, ఒంటరితన్నాని దూరం చేసుకోవాలనే తపన.. చివరకి చావు ఊబిలోకి నెట్టేస్తున్నాయ్. డేటింగ్ యాప్స్ పరిచయాల వల్ల పొంచి ఉండే ప్రమాదాలు అన్నీ, ఇన్నీ కావు. ముఖ్యంగా యువతలో.. ఈ డేటింగ్ యాప్స్ పట్ల విపరీతమైన ఆకర్షణ పెరిగింది. కానీ, అక్కడ కనిపించే ప్రతి ప్రొఫైల్ నిజం కాదు. అబ్బాయిలు అమ్మాయిల పేర్లతో, నేరగాళ్లు అమాయకుల వేషంలో పొంచి ఉంటారు. అపరిచిత వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకున్నాక, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత ఫోటోలు, వీడియోల విషయంలో గొడవలు మొదలైతే.. ఒకరు, మరొకరిని బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి వస్తోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అడ్డు తొలగించుకునేందుకు.. ఇంకొందరు హత్యలకు పాల్పడుతున్నారు.
అందమైన ఫోటోలతో ఆకర్షించి, మాటలతో మాయ చేసి, ఏకాంతంగా కలవాలని పిలిచి, ప్రైవేట్ వీడియోలు తీయడం, వ్యక్తిగత ఫోటోలను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కొందరు.. కేవలం డబ్బులు లూటీ చేసేందుకే పరిచయాలు పెంచుకుంటారు. అత్యవసరమని చెప్పి డబ్బులు అడగడం, ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట భారీగా దండుకోవడం చేస్తుంటారు. డేటింగ్ యాప్ ద్వారా కలిసిన కొందరైతే.. దారుణమైన హత్యలకు పాల్పడిన ఘటనలు దేశంలో ఏదో ఒక మూలన చూస్తూనే ఉన్నాం. రిజెక్షన్ తట్టుకోలేని వారు వేధింపులకు గురిచేయడం, దాడులకు పాల్పడటం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో పరువు తీయడం లాంటివి చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని కలవడానికి వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. అపరిచితులను ఏకాంత ప్రదేశాల్లో కలవడం, తమ లోకేషన్‌ను ఎవరికీ షేర్ చేయకపోవడం, పరిచయమైన కొద్ది రోజుల్లోనే వ్యక్తిగత రహస్యాలు, ఆర్థిక వివరాలు పంచుకోవడం చేసేస్తున్నారు. ఇవే, నేరగాళ్లకు వరంలా మారుతున్నాయ్. లేని ఆలోచనలు వచ్చేలా చేస్తున్నాయ్.
ఎవరినైనా మొదటిసారి కలవాలనుకుంటే.. రద్దీగా ఉండే మాల్స్ లాంటి ప్రదేశాల్లోనే కలవడం బెటర్. నిర్మానుష్య ప్రాంతాలకు, వారి ఇళ్లకు వెళితే.. ప్రమాదం పొంచి ఉన్నట్లే. మీరు ఎవరిని కలుస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారనే విషయం.. స్నేహితులకో, కుటుంబ సభ్యులకో కచ్చితంగా చెప్పాలి. ఆన్‌లైన్ పరిచయాలకు డబ్బులు పంపడం అత్యంత ప్రమాదకరం. టెక్నాలజీని వాడటంలో తప్పులేదు. కానీ, అది మన ప్రాణాల మీదకు రాకూడదు. కొన్ని క్షణాల ఆనందం కోసం.. జీవితాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదు. డేటింగ్ యాప్స్‌లో కనిపించే ప్రతి మెరుపు బంగారం కాదు. ప్రొఫైల్‌వలో అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయంటే, అక్కడేదో మోసం ఉండే అవకాశం ఉందని గ్రహించాలి. అప్పుడే.. మీ భద్రత మీ చేతుల్లో ఉంటుంది. డేటింగ్ యాప్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
బతుకు అంటే ఆన్‌లైన్ గేమ్ కాదు. పొరపాటు చేస్తే.. రీసెట్ చేయడం కుదరదు. గాజువాక మౌనిక మర్డర్ అయినా, డేటింగ్ యాప్స్ వల్ల ఇప్పటిదాకా జరిగిన దారుణాలైనా.. మనకు చెబుతున్నది ఒక్కటే.. కనిపించేదంతా నిజం కాదు. పైపై మెరుపులు.. ప్రాణాల మీదకు తెస్తాయ్. అందానికి ఆకర్షితులై, అన్నీ మర్చిపోయి, గుడ్డిగా నమ్మేస్తే.. జీవితాలనే ఫణంగా పెట్టాల్సి వస్తుంది. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు.. మనసు కంటే మెదడుకు పని చెప్పండి. డేటింగ్ యాప్‌ల్లో కొత్త వ్యక్తులను పరిచయాలు కావాలనుకునే వాళ్లంతా.. తస్మాత్ జాగ్రత్త! అందమైన మాటలతో ఊరించి, డేట్‌కు పిలిచి.. నిలువునా ముంచేసే వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు.
Also Read: ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై దెబ్బ.. ట్రంప్ ‘ఖార్గ్’ ప్లాన్ వెనుక అసలు గేమ్ ఇదే!