Delimitation Debate: స్టేట్ అయినా, సెంటర్ అయినా.. పొజిషన్ అయినా, అపొజిషన్ అయినా.. నేషనల్ పార్టీలైనా, లోకల్ పార్టీలైనా.. ఇండియా మొత్తం ఇప్పుడు మొత్తం ఇప్పుడు రీసౌండ్‌లో వినిపిస్తున్న అంశం ఒక్కటే! అదే.. డీలిమిటేషన్! భారత రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగల అంశం.. నియోజకవర్గాల పునర్విభజన. ఈ ఏడాది తర్వాత.. దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. అయితే, ఈ డీలిమిటేషన్ ప్రాసెస్.. ఉత్తరాది రాష్ట్రాలకు వరంగా, దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారబోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్.. నేషనల్ లెవెల్‌లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలున్నాయ్. వీటిని 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇదే నెలలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఆర్టికల్ 55, 81 సవరణకు సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. జనాభా లెక్కల ఆధారంగానే విభజించాలని కేంద్రం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన, జనాభా విపరీతంగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరుగుతాయ్.
జనాభా నియంత్రణని సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు.. ఢిల్లీ స్థాయిలో రాజకీయ బలం తగ్గిపోతుంది. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రమాదం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్. అందుకోసమే.. సౌత్‌కు నష్టం జరగకుండా పోరాటాన్ని మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం.. దేనికైనా సిద్ధమంటున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ చెప్పిన ఎగ్జాంపుల్.. అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. మన మల్కాజ్‌గిరి మూడు గోవాలకు సమానం అన్నారు. అంతే.. నష్టం ఎక్కడ జరుగుతుందో, ఎంత జరుగుతుందో అందరికీ అర్థమైపోయింది.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు రాజకీయంగా జరగబోయే అన్యాయాన్ని హైలెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్‌లోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి. గోవాలో సుమారు 12 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారికి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. అదే మల్కాజ్‌గిరిలో 34 లక్షల ఓటర్లున్నా ఒక ఎంపీ సీటే ఉంది. అప్పట్లో గోవా జనాభా చాలా తక్కువగా ఉన్నా, చిన్న రాష్ట్రాలకు కనీస ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ విషయంలోనూ సీఎం రేవంత్ అదే ప్రస్తావిస్తున్నారు. 2026 తర్వాత చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందనేది సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన.
జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెద్దగా పెరగవు. జనాభా భారీగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు కూడా భారీగానే పెరుగుతాయి. అప్పుడు దేశ రాజకీయాల్లో సౌత్ పవర్ తగ్గే ప్రమాదముంది. ఒక్క సీట్ల ముప్పే కాదు, నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా రాష్ట్రాలకు తగ్గిపోతుందనే ఆందోళనలున్నాయ్. అందుకే.. సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములాని తెరమీదికి తెచ్చారు. ఆర్థికాభివృద్ధిలో, సంపద సృష్టిలో దూసుకెళ్తున్న రాష్ట్రాలకు బెనిఫిట్ కల్పించేలా.. సీట్ల సంఖ్య పెంచడమే హైబ్రిడ్ మోడల్.
దేశ జీడీపీలో సౌత్ వాటా 53 శాతంగా ఉంది. ఎన్ని సీట్లు పెంచినా 50-50 గ్రోత్ ఫార్ములా పాటించాలంటున్నారు. 543 స్థానాల్లో 50 శాతం పెంచితే 815 సీట్లకు చేరుతుంది. అదనంగా పెరిగే సీట్లు 272. ఇందులో 50% అంటే 136 సీట్లను అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రాలకే ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 136 సీట్లను మిగతా రాష్ట్రాలకు పంచాలి. GSDP ప్రకారం చూస్తే.. సౌత్, పశ్చిమ రాష్ట్రాలు ఏడు ఉన్నాయ్. వీటికే.. దేశ జీడీపీలో 53 శాతం వాటా ఉంది. 7 రాష్ట్రాలకు 136 సీట్లు పెంచితే.. తిరుగులేని బలం ఉంటుందన్నది రేవంత్ ఆలోచన.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లు 17. సీఎం రేవంత్ హైబ్రిడ్ మోడల్ ప్రకారమైతే.. తెలంగాణలో అదనంగా 13 లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన.. తెలంగాణలో మొత్తం 30 ఎంపీ సీట్లు అవుతాయ్. ఏపీకి కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. దేశ జీడీపీ ఆంధ్రా వాటా కూడా 5 శాతమే. అక్కడ ప్రస్తుతం 25 ఎంపీ సీట్లు ఉన్నాయ్. అదనంగా మరో 13 సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 38 ఎంపీ స్థానాలు పెరుగుతాయ్. ఫలితంగా కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నిర్ణయాత్మక శక్తి తగ్గకుండా ఉంటుందన్నది సీఎం రేవంత్ కాన్సెప్ట్. అదే, జనాభా ఆధారంగా అంటే సౌత్ స్టేట్స్‌కు భారీ నష్టం తప్పదంటున్నారు విశ్లేషకులు.
ఎంపీ సీట్ల పెంపుకోసం GSDPని లెక్కలోకి తీసుకోవడం వల్ల, రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి రాజకీయ బలం తోడవుతుంది. ఇదే ఫార్ములాపై సీఎం రేవంత్ పట్టుదలగా కనిపిస్తున్నారు. అందుకే.. తన వాయిస్ ఢిల్లీ దాకా వినిపించేలా బలంగా వినిపిస్తున్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగా డీలిమిటేషన్ చేయాలన్నారు. వెనుకబడిన వర్గాల సీట్లు కట్ చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.
దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని.. సమర్థంగా అమలు చేశాయి. కేవలం జనాభా ప్రాతిపదికనే సీట్లు పెంచితే.. జనాభా పెంచుకున్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు.. ఎక్కువ సీట్లు పెరుగుతాయ్. అదే జరిగితే, జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలను శిక్షించినట్లు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్‍లో దక్షిణాదికి తగిన గుర్తింపు దొరుకుతుందని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
డీలిమిటేషన్.. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్‌ని ఊపేస్తున్న వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేయబోతోందనే విషయంలో.. దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. నిజానికి.. భారత రాజ్యాంగం ప్రకారం, ప్రతి పదేళ్లకోసారి జన గణన ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి. అయితే, జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో.. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం దీనిపై 25 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత 2001లో వాజపేయి ప్రభుత్వం దీనిని మరో 25 ఏళ్లు పొడిగించింది. ఈ గడువు 2026తో ముగియనుంది. అందువల్ల.. ఈసారి కచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి తీరాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లను కేటాయిస్తే.. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్టాల్లో భారీగా సీట్లు పెరుగుతాయ్. ఉత్తరాది రాష్ట్రాలకే లోక్‌సభలో తిరుగులేని ఆధిపత్యం దక్కుతుందనే వాదనలున్నాయ్.
జనాభా ప్రకారం కాకుండా కేంద్రం చెప్పిన మరో ప్రతిపాదన 50 పర్సెంట్ ఫార్ములా. ఇలా చేస్తే.. అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా సీట్లు పెరుగుతాయ్ కాబట్టి, ప్రాంతీయ అసమానతలు ఉండవని చెప్పారు. కానీ, సమాన ప్రాతినిధ్యం అనే ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. అందుకోసమే, సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్‌ని ప్రపోజ్ చేశారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినా, సభలో దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ బలం తగ్గిపోకుండా చూడటమే.. అసలు విషయం. పన్ను ఆదాయం ఇచ్చేది ఒకరు.. పెత్తనం చేసేది మరొకరు అనే విమర్శలకు తావులేకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడమే రేవంత్ ఫార్ములా.
కేవలం జనాభానే ప్రామాణికంగా తీసుకున్నా, 50 శాతం ప్రాతిపదికన పెంచినా భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా జనాభా నియంత్రణని, అభివృద్ధిని పట్టించుకోదు. ఎందుకంటే, జనాభా పెరిగితేనే.. కేంద్రంలో రాజకీయ బలం వస్తుందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఇది, అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది. అందుకోసమే, జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం వెయిటేజీ ఇచ్చే హైబ్రిడ్ మోడల్ గానీ, పూర్తిగా జీఎస్డీపీ ఆధారిత పెంపుదలపై చర్చ జరగాలంటున్నారు. మరోవైపు.. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా డీలిమిటేషన్‌పై కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందన్నారు. తాము డీలిమిటేషన్‌పై మొదటినుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. బాధిత రాష్ట్రాలు ఏకమై చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం తగ్గుతుంది. ఒకవేళ యూపీకి 140కి పైగా సీట్లు వస్తే, ఏపీ, తెలంగాణ ఉమ్మడి బలం ప్రస్తుతమున్న స్థాయి కంటే తక్కువ ప్రభావం చూపుతుంది. లోక్‌సభ సీట్ల సంఖ్య ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపుపైనా ప్రభావం చూపుతుంది. రాజకీయ ప్రాబల్యం తగ్గితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో.. కేంద్రం ఏ విధంగా డీలిమిటేషన్ చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం రాకుండా ఉండాలంటే, జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు ఒకే శాతంలో సీట్లు పెంచడం సేఫ్ రూట్ అంటున్నారు. లోక్‌సభ స్థానాల పెంపు అనేది కేవలం సంఖ్యలకు సంబంధించిన అంశం కాదు. భారత సమాఖ్య స్ఫూర్తికి పరీక్ష లాంటిది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే.. అది దక్షిణాది అణిచివేతగా ముద్రపడే ప్రమాదం ఉంది. మరి, కేంద్రం కొత్త ఫార్ములాను తెస్తుందా? మధ్యే మార్గంలో మరో నిర్ణయం తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు మెయిన్ సస్పెన్స్.
Also Read: పెట్రోల్ రూ. 200 దాటుతుందా? హర్మూజ్ దిగ్బంధంతో భారత్‌కు ఆయిల్ గండం!
Story by: Anup, Big Tv