E-Paper
Advertisement

పెట్రోల్ రూ. 200 దాటుతుందా? హర్మూజ్ దిగ్బంధంతో భారత్‌కు ఆయిల్ గండం!

పెట్రోల్ రూ. 200 దాటుతుందా? హర్మూజ్ దిగ్బంధంతో భారత్‌కు ఆయిల్ గండం!
Advertisement

Hormuz Strait: ఇరాన్ ఆల్రెడీ దిగ్బంధించేసింది.. ఇప్పుడు అమెరికా కూడా.. ఆల్రెడీ దిగ్బంధించిన హర్మూజ్‌ని మళ్లీ బ్లాక్ చేసింది. హర్మూజ్ బ్లాక్ అయితే షాక్ ఎవరికి?

ప్రపంచ దేశాల్లో ఆందోళన

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయ్. యుద్ధం అక్కడ జరిగితే, దాని సెగ మన దేశం దాకా తాకుతోంది. ముఖ్యంగా, ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. టెన్షన్ డబుల్ చేస్తోంది. భారత్ లాంటి దేశాలకు.. ఇదొక ఆర్థిక సునామీ లాంటిదే. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చోక్ పాయింట్ ఇది. ఒమన్, ఇరాన్ మధ్య ఉండే ఈ సన్నని సముద్ర మార్గం ద్వారానే.. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో 20 శాతానికి పైగా రవాణా అవుతోంది.

హర్మూజ్‌లో అమెరికా బ్లాకేడ్

Advertisement

సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాన్, ఖతార్ లాంటి దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ నౌకలన్నీ.. దీనిని దాటుకొనే వెళ్లాలి. కానీ, ఇరాన్-అమెరికా మధ్య చర్చలు విఫలమవడంతో.. అమెరికా తమ నౌకాదళంతో హర్మూజ్‌ని బ్లాక్ చేసింది. భారీగా బలగాలను మోహరించి.. ఇరాన్‌కు నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లలోని ఇరాన్‌ ఓడరేవులకు నౌకల రాకపోకలను సాగనివ్వడం లేదు. ఇరాన్ కాకుండా ఇతర దేశాల పోర్టులకు వెళ్లే నౌకలకు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఈ పరిణామాలతో.. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇప్పటికే భగ్గుమంటున్న చమురు ధరలు మరింత పెరిగే ముప్పు కూడా పెరిగింది.

హర్మూజ్‌కు కౌంటర్ వార్నింగ్

అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్‌.. దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. తమ పోర్టుల దిగ్బంధనానికి కౌంటర్‌గా.. పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ల చుట్టూ ఉన్న పోర్టులన్నింటికీ రాకపోకల్ని అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఏ పోర్టు కూడా సురక్షితం కాదని చెబుతోంది. పాకిస్థాన్‌లో శాంతి చర్చలు విఫలమైన తర్వాత.. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయనే వార్తలు కూడా భయాందోళనని మరింత పెంచుతున్నాయ్. ఈ పరిణామాలతో.. పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.

ట్రంప్ స్ట్రాటజీ బూమరాంగ్ అవుతుందా?

Advertisement

అయితే, యుద్ధం మొదలైన తర్వాత కూడా ఇరాన్ ఎంతో చమురుని ఎగుమతి చేసింది. కానీ, ఇప్పుడు అమెరికా దిగ్బంధనంతో.. ఎగుమతులు నిలిచిపోయి ఇరాన్‌ ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయ్. దాంతో.. ఆర్థికంగా ఇరాన్ నష్టపోనుంది. ఫలితంగా.. టెహ్రాన్ తమతో శాంతి ఒప్పందానికి వస్తుందనేది ట్రంప్ ఆలోచన. కానీ, అటు ఇరాన్, ఇటు అమెరికా దిగ్బంధనంతో.. అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగే ముప్పుంది. దీనివల్ల.. ట్రంప్ పైనా ప్రెజర్ పెరగొచ్చు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులోనే.. 7 శాతం పెరిగింది. హర్మూజ్‌‌లో నౌకల రాకపోకలు సాఫీగా సాగిపోయే వరకు రేట్లు పెరుగుతూనే ఉంటాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్.

చమురు దిగుమతులపై భారత్‌కు భారీ దెబ్బ

హర్మూజ్‌ని దిగ్బంధించిన ఇరాన్, అమెరికాకు.. ఈ పరిణామాలు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ, చమరు దిగుమతులపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే అవకాశాలున్నాయ్. భారత్ చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. హర్మూజ్ బ్లాక్ అయితే, మనకు చమురు సప్లై నిలిచిపోతుంది. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ మార్గాలు వెతుక్కోవడం ఈజీ కాదు. పైగా, సప్లై తగ్గితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర అమాంతం పెరిగిపోతుంది.

భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆయిల్ ప్రభావం

చమురు ధరలో ఒక్క డాలర్ పెరిగినా, అది.. ఇండియా కరెంట్ అకౌంట్ లోటుపై.. వందల కోట్ల భారాన్ని మోపుతుంది. చమురు దిగుమతుల కోసం మనం డాలర్లలో చెల్లించాలి. క్రూడ్ ధర పెరిగితే.. డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ పడిపోతుంది. ఫలితంగా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముంది. అదే జరిగితే, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయ్. ఇది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు, ప్రతి సామాన్యుడి జేబుకు చిల్లు పడే వ్యవహారం. భారత్ దగ్గరున్న చమురు నిల్వలు కొద్దిరోజుల అవసరాలకే సరిపోతాయ్. హర్మూజ్ గనక నెలల తరబడి బ్లాక్ అయితే, మన నిల్వలు ఏమాత్రం సరిపోవు. అప్పుడు.. భారత్‌లో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.

అమెరికా హెచ్చరిక

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ మొత్తం ఇంధన సంక్షోభంలో చిక్కుతుంది. రానున్న వారాల్లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌రైట్ హెచ్చరించారు. హర్మూజ్‌లో నౌకల రాకపోకలు మొదలైనా.. రవాణా మునుపటి స్థాయికి చేరేవరకు ఈ మోత ఉంటుందన్నారు. వచ్చే నవంబర్‌లో అమెరికాలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల వరకు ఇంధన ధరలు ఎక్కువగానే ఉండొచ్చని.. ఇటీవలే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు.

గ్లోబల్ ఎకానమీ అలర్ట్

ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిపించేది క్రూడ్ ఆయిలే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు మరో భారీ ఆర్థిక సంక్షోభం అంచున నిలబెట్టాయి. ఈ సంక్షోభం ముదిరి, చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లు దాటితే మన జీవితాలు తలకిందులైపోతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలతో.. చమురు ధరలు అస్థిరంగా ఉన్నాయి. హర్మూజ్‌లో చిన్న అంతరాయం కలిగినా.. వెంటనే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరిగిపోతాయ్. సప్లై చైన్ పూర్తిగా తెగితే.. 150 నుంచి 200 డాలర్లకు కూడా వెళ్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పుడు.. చమురు దిగుమతి కోసం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దిగుమతుల బిల్లు పెరగితే.. దేశ ఆర్థిక లోటు పెరుగుతుంది, ఇది దేశాభివృద్ధి.. కుంటుపడేలా చేస్తుంది. ఇది కేవలం భారత్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది.

హర్మూజ్ వివాదంలోకి చైనా ఎంట్రీ

హర్మూజ్‌ని దిగ్బంధించాలన్న అమెరికా నిర్ణయాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశ రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్.. పశ్చిమాసియాలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రపంచంలో శాంతి, స్థిరత్వానికి చైనా కట్టుబడి ఉందన్నారు. హర్మూజ్‌ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్‌‌తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాలను తాము గౌరవిస్తామని.. ఈ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా అమెరికాని హెచ్చరించారు.

అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్

హర్మూజ్ ఇరాన్ నియంత్రణలోనే ఉందని, చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధం ముగించే విషయంలోనూ, హర్మూజ్ భద్రతపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలుపునిచ్చింది. అంతేకాదు.. ఇరాన్‌తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా.

గల్ఫ్‌లో ఆయిల్ షాక్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో.. గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి భారీగా తగ్గినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయ్. ఇరాక్‌లో దాదాపు 61 శాతం మేర ఉత్పత్తి తగ్గింది. రోజుకు 4 మిలియన్ బ్యారెళ్ల నుంచి ఇప్పుడు రోజుకు ఒకటిన్నర మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది. కువైట్‌లో సగానికంటే ఎక్కువ ఉత్పత్తి తగ్గిపోయింది. యూఏఈలో 44 శాతం, సౌదీ అరేబియాలో 23 శాతం చమురు ఉత్పత్తి తగ్గింది.

చమురు సరఫరాలో కీలక ఫైప్‌లైన్

చమురు సరఫరాలో కీలకమైన పైప్‌లైన్.. ఇరాన్ దాడుల్లో దెబ్బతినడంతో రోజూవారీ 7 మిలియన్ల బ్యారెళ్ల నుంచి 7 లక్షల బ్యారెళ్లకు పడిపోయిందని మీడియా కథనాలు వస్తున్నాయ్. మొత్తంగా ఒపెక్ దేశాలు చేసే చమురు ఉత్పత్తి 27 శాతం మేర తగ్గింది. ఇప్పటికే.. చమురు సప్లైలో ఆటంకాలు ఏర్పడటంతో.. చాలా దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయ్. పాశ్చాత్య దేశాల్లో విద్యుత్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయ్. పారిశ్రామిక ఉత్పత్తిపైనా ప్రభావం పడుతోంది. ఇదిలాగే కొనసాగితే, షిప్పింగ్ ఛార్జీలు పెరిగి అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతింటుంది.

గ్లోబల్ ఎకానమీకి గట్టి షాక్

క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కేవలం వాహనాలను, యంత్రాలను నడిపే ఇంధనం మాత్రమే కాదు. దేశాల సరిహద్దులను దాటి సామాన్యుల బతుకుదెరువుని నిర్ణయించే శక్తిగా మారింది. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం నుంచి విముక్తి కాకపోతే.. ప్రపంచం మరో చీకటి ఆర్థిక యుగంలోకి వెళ్లిపోతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయ్.

Also Read: జువ్వలదిన్నె జలాల్లో ‘హైడ్రామా’.. 4 బోట్ల మాయం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు?

Story by: Anup, Big Tv

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×