Vizianagaram Politics: పార్టీలు వేరైనా వారి పదవులు ఒక్కటే.. ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్య ఒకటే.. వారిపైన పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చా ఒక్కటే. అదనపు పదవులు రావడంతో ఉన్న పదవి అవసరమా? అనే డిస్కషన్ ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? వారి పదవులు ఏంటి? ఇంతకీ వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
బాధ్యతల దృష్ట్యా కొత్తవారికి అవకాశం ఇవ్వడమే బెటర్ అనే చర్చ
విజయనగరం జిల్లాలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు కిమిడి నాగార్జున, మజ్జి శ్రీనివాసరావులు. ఇప్పుడు వారి సేవలకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతవరకూ జిల్లాలో తమ పార్టీలను ఇద్దరూ సమర్ధంగానే నడిపించారనే పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ… ప్రస్తుతం వారిద్దరికీ ఉన్న బాధ్యతల దృష్ట్యా కొత్తవారికి అవకాశం ఇవ్వడమే బెటర్ అనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలు కిమిడికి పాజిటివ్‌గా, మజ్జికి నెగటివ్‌గా వచ్చినప్పటికీ పార్టీని ముందుకు నడిపించడం, ప్రత్యర్ధులకు గట్టి కౌంటర్‌లు ఇవ్వడంలో ఎవరికి వారే సాటి అనే పేరును సంపాదించుకున్నారు. మజ్జి కంటే కిమిడి జూనియర్ అయినప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా అటు జగన్ నుంచి ఇటు బొత్స వరకు ఎక్కడిక్కడే కౌంటర్లు ఇచ్చేవారు. మజ్జి సైతం వెనకడుగు వేయకుండా చంద్రబాబు నుండి అశోక్ గజపతివరకు విమర్శనాస్త్రాలు సంధించారు.
మరి అంతా బాగానే ఉన్నప్పుడు మార్పు ఎందుకు?
మరి అంతా బాగానే ఉన్నప్పుడు మార్పు ఎందుకు? దీనికి ఓ కారణం ఉందంటున్నారు నేతలు. ఇపుడు ఈ ఇద్దరు నేతలకు అదనపు పదవులు దక్కాయి. కిమిడికి ఇటీవలే జిల్లా కేంద్ర సహకర బ్యాంకు ఛైర్మన్‌గా అవకాశం దక్కగా.. మజ్జికి జెడ్పీ చైర్మన్‌తో పాటు భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కూడా ఉంది. సో ఇద్దరూ అధ్యక్ష పదవిని పట్టుకొని వేలాడకుండా వెంటనే త్యజిస్తే మంచిదన్నది ఆయా పార్టీల్లో ఉన్న కొందరి ఆశావాహుల ఆలోచన. అంతే కాదు వారి ఆలోచనను ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లారనే చర్చ వినిపిస్తోంది. ఎలాగూ వారికి అదనపు పదవులు దక్కాయి కాబట్టి ఆ అధ్యక్ష పదవులేవో తమ ఖాతాల్లోకి జమచేస్తే తమ సీనియారిటీని రంగరించి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామంటున్నారు కొందరు సీనియర్ నేతలు. రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తామని సదరు పార్టీల సీనియర్లు అధిష్ఠానం వద్ద తమ వాణిని వినిపిస్తున్నారట.
సాహసం చేయలేని వారే ఇక్కడ సేఫ్ అనే ప్రచారం
జోడు పదవులు ఉన్నాయి కాబట్టి వారిని పక్కన పెడతారనే అనుకుందాం. మరి ఆ పాత నేతలకంటే పదవులను ఆశిస్తున్న ఆశావాహులు సమర్థవంతులేనా? అనేది అసలు ప్రశ్న. కాకలు తీరిన నేతల్ని తట్టుకొని జిల్లా అధ్యక్ష పదవిని అలంకరించాలి. టీడీపీలో అశోక్ గజపతిరాజును, వైసీపీలో బొత్స సత్యనారయణను తట్టుకొని అధ్యక్ష పదవికి న్యాయం చేయాల్సి ఉంటుందన్నది రాజకీయ వర్గాల వాదన. వారి మాట కాదనకుండా, ఎదురు చెప్పకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడగలిగెంత సమర్ధత కూడా అవసరం. అంతేకాదు వారిని కాదని ఎలాంటి నిర్ణయం తీసుకునేంత సాహసం కూడా చేయలేని వారే ఇక్కడ సేఫ్ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అలా అని వారిద్దరూ ఏమైనా సీరియస్ అయి పిలిచి చీవాట్లు పెడతారా అంటే అదీ ఉండదు. పరీక్ష రాసిన విద్యార్ధిలా డైరెక్ట్‌గా రిజల్ట్ చూసుకోవడమే.. మరి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందనేది రాజకీయ సోయి ఉన్నోళ్ళకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు .
Also Read: ఛీ..ఛీ తిరుమలలో ఇవేం పనులు
జిల్లా అధ్యక్షులుగా సొంత నిర్ణయాలు తీసుకున్నారా? లేదా?
అలా అని మజ్జి, కిమిడిలు జిల్లా అధ్యక్షులుగా సొంత నిర్ణయాలు తీసుకున్నారా ? లేదా ? అంటే .. దీనికి జిల్లా వాసులు చెబుతున్న సమాధానం ఓ తీరుగా ఉంది. పార్టీ లైన్‌ను, పెద్దల నిర్ణయాన్ని సమతూకం చేసుకొని తమ పదవులకి న్యాయం చేస్తే.. మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీల అధిష్ఠానాలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా వీరిద్దరికీ ఎందుకు మొండి చేయి చూపాయన్నది అసలు క్వశ్చన్. మరి ఈ ఇద్దరు నేతలు పెద్దలను మించి పని చేశారా? లేక వారి లైన్‌ను వీరు క్రాస్ చేశారా? అనేది మాత్రం పార్టీ పెద్దలకే తెలియాలి. అయితే ఇవన్నీ తెలిసి కూడా అధికారం లేని అధ్యక్ష పదవి కోసం కొందరు ఎగబడడం మాత్రం పార్టీలో కాస్తో కూస్తో గౌరవం కోసం మాత్రమేనన్నది కాదనలేని సత్యం. చూడాలి మరి ఆశావాహుల కల నెరవేరుతుందో? లేదో?
Story By Vamshi Krishna, Bigtv