E-Paper
Advertisement

Parliament: పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

Parliament: పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

Parliament: నేతలు నాటకరాయుళ్లు.. ప్రజలు పిచ్చివాళ్లు. యస్.. మీరు విన్నది నిజమే. ప్రస్తుతం మనం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ప్రజల గురించి ఆలోచించేది ఇదే. అలా కాదు.. వాళ్లు అలా అనుకోరు అంటే ఓరోజు ఓపిక చేసుకొని పార్లమెంట్‌ సమావేశాలు చూడండి. అక్కడ తమ నాటకాలతో ప్రజలను నేతలు ఎలా పిచ్చొళ్లు చేస్తున్నారో అర్థమవుతుంది. రోజుకు నాలుగైదు సార్లు హౌస్‌ ఈస్‌ అడ్జర్డ్న్.. అనే పదం ఎలా వినిపిస్తుంటుంది. విపక్షం డిమాండ్ చేస్తుంది.. అధికార పక్షం పట్టించుకోదు. సీజన్స్‌ మారిన ఇవే సీన్స్‌ రీపిట్‌ అవుతూనే ఉన్నాయి. ఎందుకీ పరిస్థితి? నేతలు అసలు పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఏం చేస్తున్నారు?

విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ విమర్శలు
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి సభ ప్రారంభానికి ముందే కాస్త డ్రామా స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్షాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాయి. ఆయన నిజంగా విపక్షాలను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక ఉద్దేశపూర్వకంగా ఈ వింటర్ సెషన్స్ ముందు అగ్గి రాజేయాలని చేశారా? అనేది తెలియదు కానీ ఇప్పుడు అసలు చర్చ పక్కకు పోయి.. ఈ అంశంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.

సమావేశాలు ప్రారంభం కాగానే నిరసనలు, వాదనలు
నిజానికి పార్లమెంట్ సెషన్‌ ప్రారంభం కావడానికి ముందో.. లేకపోతే అయిన తర్వాతనో ఇలాంటి సీన్సే కనిపిస్తున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే పార్లమెంట్ వింటర్ సెషన్స్ ప్రారంభమైన తొలి రోజు సమావేశాలను చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశాలు ఇలా ప్రారంభమయ్యాయో లేదో.. నిరసనలు, వాదనలు, ఆందోళనలు. దీంతో ఎలాంటి చర్చ జరగకుండానే తొలి రోజు లోక్‌సభ సమావేశాలు ఒకరోజు వాయిదా పడిపోయాయి. ఈ మాత్రం దానికి ఎంపీలు తమ నియోజకవర్గాల నుంచి ఢిల్లీ వరకు వెళ్లడం ఎందుకు? అక్కడ వీరి కోసం ప్రత్యేక వసతులు ఎందుకు? అతి తక్కువ ధరకే వీరికి అన్ని ఏర్పాట్లు చేయడం ఎందుకు? అసలే ఢిల్లీలో కాలుష్యం, చలి ఎక్కువగా ఉంది.. ఈ మాత్రం దానికి అయినను పోయి రావలే హస్తినకు అంటూ వెళ్లడం ఎందుకు అనేది ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న.

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదిక పార్టమెంట్
పార్లమెంట్ అంటే ప్రజాసమస్యలపై చర్చించాల్సిన వేదిక.. చట్టాలు రూపొందే ప్రాంతం. కానీ ఈ మధ్య సమావేశాల్లో ఇలాంటి సీన్స్‌ చాలా రేర్‌గా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, రాజకీయ విమర్శలు, నినాదాలు, వాయిదాలే సరిపోతున్నాయి. స్పీకర్‌ అరూస్తేనే కనిపిస్తాడు.. నేతలు నినాదాలు చేస్తూనే ఉంటారు. కొన్ని కోట్ల మంది ప్రజలు వారిని చూస్తున్నారన్న భయం ఎలాగూ లేదు.. కనీసం కామన్‌సెన్స్‌ లేకపోతే ఎలా? అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్.

ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు ఉంటుంది.. ఉండాలి
నిరసన అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు ఉంటుంది.. ఉండాలి. కానీ నిరసనల పేరుతో పోడియం వద్దకు రావడం, నినాదాలు చేయడం, పేపర్లను చించి విసిరేయడం.. ఇప్పుడు కామన్‌గా మారాయి. అసలు చర్చే లేకుండా ఇవన్నీ చేయడాన్ని ఎలా చూడాలి? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఈ ఆందోళనలు కేవలం సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి తప్ప.. పరిష్కారానికి ఉపయోగపడిన దాఖలాలు అయితే స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకైతే కనిపించలేదు.

మెజారిటీ అంటే పూర్తి నియంత్రణ అనేలా పరిస్థితులు
విపక్షానికి ఒక బాధైతే.. అధికార పక్షానిది మరో బాధ. ఈ మధ్య ఆధిపత్యం అంటే పూర్తి నియంత్రణ అనేలా పరిస్థితులు మారుతున్నాయనే వాదన వినిపిస్తోంది. కేంద్రం క్రమక్రమంగా మరింత ఆధిపత్యాన్ని సాధించాడానికే ప్రయత్నాలు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇది పార్లమెంటు సమర్థత, జవాబుదారీతనంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే విమర్శలున్నాయి. విపక్షాన్ని ఇరుకున పెట్టాలి.. బద్నాం చేయాలనే తాపత్రయం తప్ప.. మరో అంశం కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో చాలా కొన్ని క్షణాలు మినహా దాదాపుగా చర్చలన్నీ రాజకీయ శత్రుత్వంతోనే నడుస్తున్నాయనేది చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే విషయం. కానీ ఉండాల్సింది అలా కాదు కదా.

సీజన్ ఏదైనా సీన్స్ మాత్రం మారడం లేదు..
మన దేశంలో చాలా రకాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. ఇలా మూడు సీజన్స్‌లో మూడు సెషన్స్ కనిపిస్తాయి. కానీ మనం చెప్పుకుంటున్నట్టు సీజన్‌ ఏదైనా సీన్స్‌ మాత్రం మారడం లేదు. నేతల్లో ఆవేశాలు తప్ప.. ఆలోచనలు, సంజాయిషీలు, వివరణలు మాత్రం కనిపించడం లేదు. కులంకశంగా చర్చించి ఆమోదించాల్సిన బిల్లులు.. తీసుకోవాల్సిన నిర్ణయాలు.. హడావుడిగా జరిగిపోతున్నాయి. సెషన్‌ ముగిసేలోపు… దేశ ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. కథ కంచికి చేరుతుంది. ఇందులో అధికారపక్షానిది, విపక్షానిది సమాన బాధ్యత. ఈ మాత్రం సంబరానికి వీరు చేసే ఖర్చు ఎంతో తెలిస్తే మీ గుండె జారడం ఖాయం. అసలు ఈ సమావేశాలు అవసరమా అనే ప్రశ్న తలెత్తడం ఖాయం.

నిమిషానికి లక్షలు.. గంటకు కోట్లు. ఖద్ధరు చొక్కాలు ధరించి పొద్దున్నే పార్లమెంట్‌కు వెళ్లే నేతల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. స్కూల్‌కు వెళ్లే పిల్లవాడు రెడీ అయినట్టు రెడీ అయి మరీ వెళ్తారు నేతలు పార్లమెంట్‌కి. మరి అక్కడికి వీళ్లు చేయాల్సింది ఏంటి? చేసేది ఏంటి? అసలు పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి?

ఒక నిమిషానికి అయ్యే ఖర్చు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలు
ఒక నిమిషం పార్లమెంట్ నడిపేందుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. నిర్వహణ ఖర్చులు, ఎంపీల రోజువారీ భత్యాలు అన్నింటిని లెక్క వేస్తే తేలింది ఎంతంటే రెండున్నర నుంచి ఐదు లక్షలు. ఇది రోజుకో.. గంటకో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది ఒక నిమిషానికి అయ్యే ఖర్చు. వినడానికి కాస్త కష్టంగా ఉన్నా.. ఒక నిమిషం పార్లమెంట్ రన్ అవ్వడానికి రెండున్నర లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతుంది. ఇది సభలో చర్చ జరిగినా.. జరగకపోయినా.. అయ్యే ఖర్చు. దేశ జనాభాలో దాదాపు 25 శాతం మందికి సగటు రోజువారీ ఖర్చు 32 రూపాయల కంటే తక్కువగా ఉంది. ఒక్క నిమిషం పార్లమెంటరీ కార్యకలాపాలు నడవటానికి కనీసం రెండున్నర లక్షలు ఖర్చు అవుతున్నాయి. అంటే నిమిషానికి లక్షల్లో ప్రజాధనం ఖర్చు చేస్తూ, కనీస బాధ్యత కూడా లేకుండా నాయకులు ప్రవర్తిస్తున్నారంటే వారిని ఏమనాలి? ఓటేసి గెలిపించిన పేద వర్గాలపై వీళ్లకు ఏమాత్రం గౌరవం ఉందో పార్లమెంట్ వేదిక చూస్తే అర్థమవుతుంది.

గంటపాటు సభ వాయిదా పడితే కోట్లలో నష్టం..
ఒక గంట సభ వాయిదా పడితే ఈ నష్టం కోట్లలో ఉంటుంది. కానీ లోక్‌సభ ప్రారంభమైన రోజే తరవాత రోజుకి వాయిదా పడింది. వాయిదా తర్వాత ఏం జరిగింది. కొద్దిసేపు పార్లమెంట్ ఆవరణలో హడావుడి చేశారు విపక్ష నేతలు. వారిని విమర్శించారు అధికారపక్ష నేతలు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీని వల్ల ఎవరు నష్టపోయారు. వారికేమైనా నష్టం జరిగిందా? లేదు కదా. అంతిమంగా నష్టపోయేది ప్రజలే కదా. మాకు వచ్చింది ఏముంది అనేది ప్రజాప్రతినిధుల ఆలోచనగా క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.

చర్చ జరగాలి.. ప్రశ్నోత్తరాలను పెంచాలి..
ఎస్‌ఐఆర్ కావొచ్చు.. కశ్మీర్ అంశం కావొచ్చు.. వివాదస్పద బిల్లులు కావొచ్చు.. విషయం ఏదైనా దాని గురించి చర్చించాలి. ప్రశ్నోత్తరాలను పెంచాలి. దేశం నలుమూలల ఉన్న సమస్యలను లెవనేత్తాలి. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు తమ విబేధాలను పక్కన పెట్టాలి. సభలో చర్చకు అవకాశం కల్పించేందుకు సభా నాయకులు నిరంతరం సంప్రదింపులు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభకు అంతరాయం కలిగించవద్దు.. సభా నియమాలను మరింత కఠినతరం చేయాలి.. సభను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే కదా.. ఏవీ పాలు, ఏవి నీళ్లు అనేది తెలుతుంది.

నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక సమయం..
ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌పై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వాటిపై చర్చించేందుకు నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఇతర అంశాలపై ఈ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అది ఒక్క అంశాన్నే పట్టుకొని వేలాడటం వల్ల.. ఒకరోజు సమయం వృథా అయిపోయింది. మరి పోయిన సమయాన్ని ఎవరు తీసుకువస్తారు? లేదా దీన్ని భర్తీ చేయడానికి మరోరోజు సమయాన్ని పెంచే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?

ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే పార్లమెంట్ పనితీరు ఎలా తగ్గిపోయిందో అర్థమవుతోంది. 1952-70ల్లో ఏడాదికి 121 రోజుల పాటు పార్లమెంట్ పనిచేస్తే.. 2022 వచ్చేసరికి అది 56 రోజులకు తగ్గిపోయింది. ఇక రోజుల పాటు జరగాల్సిన చర్చ.. కేవలం 10 నిమిషాలకు తగ్గిపోయింది. ఇక 2020లో ఒకరోజు అయితే రాజ్యసభ పనిచేసిన సమయం కేవలం 30 నిమిషాలు మాత్రమే. 2020 సెప్టెంబర్‌లో వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్‌లు చర్చ లేకుండానే ఆమోదించారు. ఆ సమయంలో విపక్షాలు తమ నిరసనలు తెలపడంలో బిజీగా ఉన్నాయి. మరో దారుణమైన విషయం ఏంటంటే స్టాండింగ్ కమిటీల ప్రమేయం గణనీయంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా ముందుకు వెళ్లడం..
పార్లమెంటుకు ఇలాంటి దీన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఆన్సర్ సింపుల్. అధికార, విపక్షాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం. అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా ముందుకు వెళుతుండగా.. ప్రశ్నించే వారికి అవకాశం ఇవ్వకపోవడం ఒక తప్పైతే.. వచ్చిన అవకాశాన్ని కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తూ.. హుందాగా వ్యవహరించకపోవడం విపక్షాలు చేసే మరో తప్పు. మాములుగా ఈ మధ్య సమావేశాలకు వెళ్లే నేతల సంఖ్య తక్కువవుతుందనే విమర్శ ఎలాగూ ఉంది. పర్సనల్ పంచాయితీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. చాలామంది ఎంపీలు వెళ్లామా.. అటెండెన్స్ వేయించుకున్నామా.. వెళ్లిపోయామా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.

లోతైన చర్చ లేకుండా హడావుడిగా బిల్లుల ఆమోదం..
వీటన్నింటి వల్ల ముఖ్యంగా మూడు నష్టాలు కనిపిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన బిల్లులు కూడా లోతైన చర్చ లేకుండా హడావుడిగా ఆమోదం పొందుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు అడగడానికి, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రజల ముందు ఉంచడానికి అతి ముఖ్యమైన కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం వృథా అయిపోతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, మహిళా భద్రత వంటి ప్రజలకు సంబంధించిన అంశాలు అసలు చర్చకే రాకుండా పోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఉన్న దేశం మనది. 140 కోట్ల భారత ప్రజలకు లక్షలాది సమస్యలు ఉన్నాయి. కానీ ఒకటి, రెండు అంశాలను సాకుగా చూపించి అధికారపక్షం, విపక్షం అతిముఖ్యమైన సమావేశాల సమయాన్ని వృథా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పటికైనా నేతలు ఆలోచించాలి.

అత్యవసరమైన అంశాలపై చర్చకు సిద్ధంగా ఉండండి..
ఇప్పటికైనా క్లాస్‌లో చిన్న పిల్లలు చేసినట్టు అల్లరి చేయడం మానేయండి. స్పీకర్ ఆదేశాలకు కాస్తైన గౌరవం ఇవ్వండి. అదే సమయంలో సభ్యులను సస్పెండ్ చేసే అధికారాన్ని స్పీకర్‌ చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలి. అదే సమయంలో ప్రతిపక్షం లేవనెత్తిన ముఖ్యమైన, అత్యవసరమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. చర్చను దాటవేసే ప్రయత్నం చేయడంతో ప్రతిష్టంభన పెరగడం తప్ప తగ్గేది లేదు. ప్రతిపక్షం కూడా చర్చ జరిగే సమయంలో తమ నిరసనలను ఉపసంహరించుకుని సభను నడవడానికి సహకరించాలి. ప్రభుత్వం తరపున ఫ్లోర్ లీడర్.. ప్రతిపక్ష నేత మధ్య సమావేశాలు, సంప్రదింపులు ఉండాలి. ప్రతి సెషన్‌కు ముందు, ప్రతిరోజూ ఉదయం ఏ అంశాలపై చర్చించాలి, నిరసనలను ఎలా ఆపాలి అనే దానిపై చర్చించాలి. ఒక అవగాహనకు రావాలి. అంతేకాదు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయాలకు ప్రభుత్వం, విపక్షం కట్టుబడి ఉండాలి.

Also Read: హమ్మయ్య.. తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంత తగ్గిందంటే!

ఇక అతీముఖ్యమైనది ప్రశ్నోత్తరాల సమయం అనేది ప్రభుత్వ జవాబుదారీతనానికి అత్యంత కీలకమైన సమయం. ఇది ఏ పరిస్థితుల్లోనూ వాయిదా పడకుండా.. ఇబ్బంది లేకుండా కొనసాగేలా చూడాలి. అసలు వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా ఉండాలి. ఇక అతి ముఖ్యమైనది పెద్ద పార్టీల నిరసనల కారణంగా చిన్న పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడటానికి అవకాశమే లేకుండా పోతుంది. ఇది వారిని గెలిపించిన ప్రజలను అవమానించినట్టే. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి గుండె లాంటిది. ఇప్పటికైనా ఆ పార్లమెంట్‌ను గౌరవించండి.. ఇతరులు కూడా గౌరవించేలా చేయండి. కొన్ని కోట్ల మంది చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×