Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ఎండ్ పడనుందా? మరికొన్ని రోజుల్లో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదరనుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వారంలోనే ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుంది తెలిపారు ఆయన. అంతేకాదు ఈ ఒప్పందం కుదరాల్సిందే.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హమాస్‌కు డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఇప్పటికే ఈ విషయాన్ని అనేక సార్లు ఓపెన్‌గా చెప్పారు ట్రంప్.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంట్‌లో శాంతి ఒప్పందం కుదరనుందని ప్రకటించారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు ఆయన. దీనిపైనే ట్రంప్ స్పందించారు. డీల్ కుదరనుందని కాదు.. కుదరాల్సిందే అని చెప్పారు. అంతేకాదు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేనాటికి హమాస్ చెరలో ఉన్న బంధీలను రిలీజ్ చేయాల్సిందే అన్నారు. లేదంటే హమాస్ ఇంతకుముందు ఎన్నడూ చూడని విపరీత పరిస్థితులను చూడాల్సి వస్తుందన్నారు ఆయన.
మరోవైపు హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు కూడా ముందుడుగు పడుతున్నట్టు తెలుస్తున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఇప్పటికే కొన్ని అంశాలపై ఇరువర్గలు అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. డీల్‌లోని కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే.. హమాస్ చెరలో ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, గాయపడిన వారు ఉండాలని కండిషన్ పెట్టారు. దీనికి హమాస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా 150-200 మంది హమాస్ ఫైటర్లు, పాలస్తీనా ప్రజలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది హమాస్. దీనిపై ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే హమాస్ చేస్తున్న ఒక డిమాండ్‌కు మాత్రం నో చెబుతోంది ఇజ్రాయెల్. ఇటీవల హమాస్ కీలక లీడర్ యాహ్యా సిన్వర్‌ను మట్టు పెట్టింది ఇజ్రాయెల్ ఆర్మీ. అతని మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీనికి మాత్రం ఖరాఖండిగా నో చెబుతోంది ఇజ్రాయెల్. అంతేకాదు ఇజ్రాయెల్ చెరలో ఉన్న హమాస్ కీలక నేతలను కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై మాత్రం చర్చలు జరుగుతున్నాయి.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన 16 రోజుల తర్వాత రెండో స్టేజ్ మొదలు కానుంది. అయితే అప్పుడు ఎంత మందిని రిలీజ్ చేయాలనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాదు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే గాజా నుంచి పూర్తి స్థాయిలో తమ బలగాలను వెనక్కి తీసుకోనుంది ఇజ్రాయెల్. అదే సమయంలో గాజా ప్రాంత ప్రజలు తిరిగి వారి ఇళ్లకు చేరుకోనున్నారు.
Klaasen Six: క్లాసెన్ కొట్టిన భారీ సిక్స్.. బంతిని ఎత్తుకెళ్లిన అభిమాని.. వీడియో వైరల్!
హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి మొత్తం 251 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా చేసుకుంది. వీరిలో ఇప్పటి వరకు 94 మందిని విడిపించింది ఇజ్రాయెల్. సెర్చ్ ఆపరేషన్‌లో మరో 34 మంది మృతదేహాలను గుర్తించారు. ఇక మిగతావారిని విడిపించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే హమాస్ కాస్త వెనకుడుగు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ట్రంప్ బాధ్యతలు చేపడుతుండటం.. ఇజ్రాయెల్ దూకుడు.. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోవడం.. హెజ్బుల్లా వీక్ కావడం.. ఇలా అనేక అంశాలు ఇప్పుడు హమాస్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయి.