Errabelli vs Yashaswini Reddy: ఎమ్మెల్యేలకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, నియోజకవర్గ ఓటర్ల నుండి వ్యతిరేకత, నిరసనలు ఎదురవుతుంటాయి. గెలిచినప్పటి నుండి ఏం చేశావని నియోజకవర్గ ప్రజలు నిలదీస్తుంటారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచి పట్టుమని రెండేళ్లు కూడా కాకముందే నియోజకవర్గ ప్రజల నుండి ఓ రేంజ్ లో వ్యతిరేకత, నిరసనలను ఎదుర్కొంటున్నారు పాలకుర్తిఎమ్మెల్యే. అసలు గెలిచి రెండేళ్లు గడవక ముందే ఆ ఎమ్మెల్యేకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని నిలదీస్తున్న ప్రజలు
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలో అసంబ్లీ ఎన్నికలకు ముందు కంటే మించిన పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలు, ఏ విధంగా పరిగెత్తించారో అదే నీన్ రెండు సంవత్సరాలు కాకముందే కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎదుర్కోవలసి వస్తుండటం చర్చనీయాశంగా మారింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఇన్ని రోజులు ఏం చేశారని పాలకుర్తి ఓటర్లు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు.
కోడలు యశస్విరెడ్డి కోసం ఝాన్సీరెడ్డి ప్రచారం
అధికారం లేకున్నా అమెరికాలో ఉండి పాలకుర్తిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, తన కోడలు యశస్వినిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల ప్రచారంలో ఝాన్సీ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు ఓటర్లు. ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటంటూ మండిపడుతున్నారు. అధికారం కోసం మాత్రమే ఝాన్సీ రెడ్డి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంకా హామీలు నెరవేర్చకపోతారా అని ఎదురు చూసిన జనం ఇప్పుడు ఝాన్సిరెడ్డిని, యశస్వినిరెడ్డిని ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు.
అర్హులు కాని వారికి ఇందిరమ్మ ఇళ్లు
ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఇన్ని రోజులు ఝాన్సీ రెడ్డిని నిలదీసి ప్రజలు … ఇప్పుడు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలు అర్హులకు ఇస్తామంటూ ఇన్ని రోజులు దాటవేసిన ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి ఇందిరమ్మ ఇళ్ల పథకం తలనొప్పి తెచ్చి పెడుతోంది. అర్హులు కాని వారికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు ఇస్తున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా తండాల వాసులు మండిపడుతున్నారు. తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద నిరుపేదలు నిరసనలకు దిగారు. ఫతేపురం, పెద్దతండాలలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల పర్యటనలను అడ్డుకొని నిలదీశారు. దాంతో వారు సమాధానం చెప్పలేక సైలెంట్‌గా మధ్యలోనే వెళ్లిపోవాల్సి వస్తుంది.
పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఝాన్సీరెడ్డి హామీలు
ఎన్నికల ముందు ఆరు నెలల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఝాన్సీ రెడ్డి తానే స్వయంగా ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రమాణం చేశారు. గెలిచిన తర్వాత నుండి ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని నియోజకవర్గ ప్రజలు ఝాన్సీ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ ఓట్ల కోసమేనంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా హామీల అమలు కోసం ఎదురుచూసిన పాలకుర్తి ప్రజలు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి ఎక్కడ కనిపించినా నిలదీయడం మొదలుపెట్టారు.
ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు
స్వచ్ఛంద సేవ పేరుతో ఝాన్సీ రెడ్డి ఇన్ని రోజులు మభ్యపెడితే, ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం తమను మోసం చేస్తున్నారని తండావాసులు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు అనర్హుల వద్ద డబ్బులు వసూలు చేసి పథకాలు అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు పాలకుర్తి వాసులు. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పిన అత్తా కోడలు ఇప్పుడు కనీసం కన్నెత్తి చూడట్లేదని మండిపడుతున్నారు.
ఎర్రబల్లి అనుచరుల కుట్ర అంటున్న ఎమ్మెల్యే వర్గం
ఎక్కడా లేని విధంగా పాలకుర్తి నియోజకవర్గం లోని ఇంత వ్యతిరేకత రావడం వెనక మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుల కుట్ర ఉందని ఎమ్మెల్యే వర్గీయలు ఆరోపిస్తున్నారు. తన ఓటమిని తట్టుకోలేకనే స్థానికులతో నిరసనలు చేపిస్తూ ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి, ఝాన్సీ రెడ్డికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఝాన్సీ రెడ్డి అనుచర వర్గం ఆరోపిస్తోంది. అయితే ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎవరైనా ఎందుకు ప్రశ్నిస్తారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గంలో నిరసనల పర్వాలు, ఆధిపత్య పోరు ఎన్నికల హడావిడిని మించి పోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story By Apparao, Bigtv Live