గత కొంతకాలంగా తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు సమస్యలతో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రయాణీకులో మరింత భయం పెరిగింది. అయినప్పటికీ, ఎక్కడో ఒక చోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. వెంటనే పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ముప్పు తప్పింది.
ఈ ఘటన ఎయిర్ చైనాకు చెందిన విమానం CA 139లో జరిగింది. హాంగ్ జౌ నుంచి సియోల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయిన సుమారు గంట తర్వాత లగేజ్ క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. లగేజ్ క్యాబిన్ నుంచి నల్లటి పొగతో కూడిన మంటలు రావడం కనిపించింది. ఓ ప్రయాణీకుడితో పాటు సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే విషయాన్ని గమనించిన పైలెట్ షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఓ ప్రయాణీకుడు తీసుకొచ్చిన లగేజీ బ్యాగ్ లో లిథియం బ్యాటరీ ఉండటం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ చైనా విమానయాన సంస్థ స్పందించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. “CA139 విమానంలోని మంటలు చెలరేగాయి. ఓవర్ హెడ్ బిన్ లో ప్రయాణీకుడు ఉంచిన లగేజీ బ్యాగ్ లో లిథియం బ్యాటరీ ఉంది. దాని కారణంగానే ఈ మంటలు చెలరేగాయి. విమానంలో మంటలు ఆర్పేందుకు సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేశారు. వారికి ప్రయాణీకులు కూడా సహకరించారు. ఈ ఘటన నేపథ్యంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అయితే, ఈ ఘటనలు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై విమానాయన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు” అని ఎయిర్ చైనా చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీబోలో వెల్లడించింది.
ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:47 గంటలకు హాంగ్ జౌ జియావోషన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. వాస్తవానికి మధ్యాహ్నం 1 గంటలకు దక్షిణ కొరియాలోని ఇంచియాన్ కు చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విమాన భద్రతను పరిశీలించిన తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ Flightradar24 ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. విమానం తూర్పు చైనా తీరం, జపాన్ దక్షిణ ద్వీపం క్యుషు నుంచి దాదాపు సమాన దూరంలో సముద్రం మీదుగా పూర్తిగా వెనక్కి తిరిగి ఉదయం 11 గంటల తర్వాత షాంఘైలో ల్యాండ్ అయిందని వివరించింది.
#CA139 diverted to Shanghai after a lithium battery fire in the overhead bin. https://t.co/rDsV0jvzCZ pic.twitter.com/k8m7KLRI6a
— Flightradar24 (@flightradar24) October 18, 2025
Read Also: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!