Harish Rao: గులాబీ పార్టీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకుదనం, జిల్లాల పర్యటనలు, కార్యకర్తలతో సమావేశాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు.. ఇవన్నీ బీఆర్ఎస్‌లో ఆయన ప్రాధాన్యం పెరుగుతోందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఒకవైపు పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉంటూ మరోవైపు సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతి అవకాశాన్నీ రాజకీయంగా వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా, మీడియా సమావేశాల్లో, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో హరీశ్‌రావుకు పార్టీ నాయకత్వం మరింత స్వేచ్ఛనిస్తోందా? రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతల్లో ఆయనకు కీలక పాత్ర లభిస్తోందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గులాబీ పార్టీలో ఫ్రీ హ్యాండ్ లభించిందా? అనేది ఆసక్తి రేపుతోంది.
బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు జిల్లాల పర్యటనలకు ప్రాధాన్యమిస్తున్నారు. హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గ రాజకీయాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని మెదక్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై స్థానికంగా జరుగుతున్న పోరాటాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన పర్యటనల పరిధి విస్తరించడం పార్టీ రాజకీయ కార్యాచరణలో ఆయనకు ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించే అంశంపై పార్టీ నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తోందన్న చర్చ కూడా సాగుతోంది.
ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి, కేడర్‌లో నూతనోత్సాహం నింపడం బీఆర్ఎస్‌కు కీలకంగా మారింది. ఈ క్రమంలో హరీశ్‌రావు కార్యకర్తలతో నేరుగా మమేకమవుతున్నారు. స్థానిక నాయకులతో చర్చలు, కార్యకర్తలతో ముఖాముఖి, వివిధ ప్రజా సంఘాల కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా క్షేత్రస్థాయిలో సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతోపాటు వారి సమస్యలను పార్టీ వేదికలపై ప్రస్తావిస్తున్నారు.ఇదే సమయంలో ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకోవడంపైనా దృష్టి సారిస్తున్నారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ అజెండాగా మలుచుకుంటున్నారు. కేవలం పార్టీ సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా పార్టీకి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాజకీయ కార్యాచరణలో హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, రైతు సంక్షేమం, రుణమాఫీ, రైతుభరోసా, సాగునీరు, విద్యుత్, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న పరిస్థితులకు మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతున్నారు. రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, విద్యుత్ సరఫరా, పంటల కొనుగోళ్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి పర్యటనలు, ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపైనా విమర్శలు గుప్పించారు.
Also Read: మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!
ప్రభుత్వ నిర్ణయాలు, మంత్రుల ప్రకటనలు, ప్రజా సమస్యలు.. ఇలా ఏ అంశం తెరపైకి వచ్చినా హరీశ్‌రావు స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకుండా ఆయా అంశాలపై చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్నారు.ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునే క్రమంలో హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు, పర్యటనలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అధికార పక్షం నుంచి వచ్చే విమర్శలకు కూడా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాగ్వాదాల్లో హరీశ్‌రావు తరచూ కేంద్రబిందువుగా మారుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించిన నేతగా హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్ అనే గుర్తింపు ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఆయన అదే చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్టీకి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడం, కేడర్‌లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు.పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణలో భాగస్వాములవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో హరీశ్‌రావు పర్యటనలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఈ పరిణామాలు పార్టీలో ఆయనకు మరింత విస్తృతమైన రాజకీయ బాధ్యతలు అప్పగిస్తున్నారనే చర్చకొనసాగుతుంది.
బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణలో సీనియర్ నేతల పాత్ర కీలకం కానుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడం, ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం వంటి బాధ్యతలు ముందున్నాయి. ఈ పరిస్థితుల్లో హరీశ్‌రావు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. జిల్లాల పర్యటనలు, ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వంపై విమర్శలు.. వీటిలో ఆయన చురుకుదనం పెరిగింది.అయితే ఆయనకు ప్రత్యేకంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? రాష్ట్రవ్యాప్త పర్యటనలకు అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ లభించిందా? అన్న అంశాలపై పార్టీ నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆయన కార్యక్రమాల విస్తృతి గులాబీ పార్టీలో హరీశ్‌రావు ప్రాధాన్యంపై చర్చకు దారితీస్తున్నాయి.
వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ చేపట్టే రాజకీయ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు, జిల్లాల పర్యటనల్లో హరీశ్‌రావు పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ఆయన ముందున్న ప్రధాన కార్యాచరణగా కనిపిస్తోంది. గులాబీ పార్టీలో హరీశ్‌రావు రాజకీయ చురుకుదనం పెరుగుతుండటం, ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: 40 ఏళ్లైనా తగ్గని రోహిత్ క్రేజ్…అపర కుబేరుడు అంబానీ కూడా తలవంచాల్సిందే!